Friday, April 26, 2024

Delhi: నవశకం ఆరంభం, కలసికట్టుగా పనిచేద్దాం.. పదవీ బాధ్యతలు చేపట్టిన ఖర్గే

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సుదీర్ఘ రాజకీయ చరిత్ర కల్గిన కాంగ్రెస్ (ఏఐసీసీ)లో నవశకం మొదలైంది. రెండు దశాబ్దాల అనంతరం గాంధీయేతర కుటుంబం నుంచి పగ్గాలు చేతులు మారాయి. ఇటీవల జరిగిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మల్లికార్జున ఖర్గే బుధవారం ఉదయం పదవీ బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ తాజా మాజీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలు పలువురు హాజరయ్యారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీఎల్పీ నేతలను ఆహ్వానించగా, ‘భారత్ జోడో’ యాత్ర ఏర్పాట్లలో నిమగ్నమైనవారు మినహా దాదాపుగా అందరూ హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైనవారిలో మధుయాష్కి గౌడ్, పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సురేశ్ శెట్కార్, గిడుగు రుద్రరాజు, సర్వే సత్యనారాయణ, టి. సుబ్బిరామిరెడ్డి, జేడీ శీలంతో పాటు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ సహా వివిధ అనుబంధ సంఘాల నేతలున్నారు.

న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముందు మల్లికార్జున ఖర్గే మొదట రాజ్‌ఘాట్ సందర్శించారు. అక్కడ మహాత్మ గాంధి సమాధి వద్ద నివాళులు అర్పించిన ఖర్గే, అనంతరం మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ స్మారక ప్రదేశాలతో పాటు మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ స్మారక స్థలాలను కూడా ఆయన సందర్శించారు. అనంతరం ఏఐసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేదికపై చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన పత్రాన్ని మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. వందేమాతర గీతాలాపనతో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని జనగణమనతో ముగించారు.

పార్టీ ముఖ్య నిర్ణయాల్లో సోనియా పాత్ర కొనసాగుతుంది: కేసీ వేణుగోపాల్
కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీని కోల్పోతున్నామని, అయినప్పటికీ పార్టీ తీసుకునే ముఖ్య నిర్ణయాల్లో ఆమె అనుభవాన్ని, పాత్రను ఎప్పటికీ కోల్పోమని ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. మల్లికార్జున ఖర్గే పదవీ బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి రాజకీయ నాయకుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారని, కానీ ప్రజాస్వామ్యం మాత్రం కాంగ్రెస్ లోనే ఉందని వ్యాఖ్యానించారు. పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఖర్గే బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని, ఆయన పార్టీ కోసం గత 50 ఏళ్లుగా సేవలు అందజేస్తున్నారని గుర్తుచేశారు. 9 పర్యాయాలు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొంది, కర్నాటక అసెంబ్లీలో విపక్ష నేతగా, పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతగా పనిచేశారని తెలిపారు. సుదీర్ఘ రాజకీయానుభవం కల్గిన ఖర్గే పార్టీ పగ్గాలు చేపట్టడం గొప్ప పరిణామంగా ఆయన అభివర్ణించారు.

- Advertisement -

కలసి నడుద్దాం.. సవాళ్లను అధిగమిద్దాం: సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గేకు అభినందనలు తెలియజేసిన సోనియా గాంధీ దేశంలో నెలకొన్న అప్రజాస్వామిక పాలన ఎదుర్కోవడమే పార్టీ ముందున్న అసలైన సవాల్ అని వ్యాఖ్యానించారు. ఖర్గే పదవీ బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, ఖర్గే కింది స్థాయి నుంచి ఎదిగిన నేతగా కొనియాడారు. ఖర్గే నేతృత్వంలో ముందుకు సాగుతుందనే విశ్వాసం తనలో ఉందని అన్నారు. పార్టీని బలమైన వ్యవస్థగా నిలబెట్టేందుకు నిరంతరం పనిచేశారని ఆశిస్తున్నట్టుగా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టడం ఒక సవాలుగా అభివర్ణించిన సోనియ, గతంలోనూ పార్టీకి అనేక సవాళ్లు ఎదురయ్యాయని, అందరూ కలిసి ఐకమత్యంగా వ్యూహాత్మకంగా వాటిని ఎదుర్కోవడంలో సఫలీకృతమయ్యామని గుర్తుచేశారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రస్తుత, భవిష్యత్తు సవాళ్లను అధిగమిద్దామంటూ ఆమె పార్టీ శ్రేణులను పిలుపునిచ్చారు.

కార్మికుడి కొడుకు అధ్యక్షుడయ్యాడు.. మల్లికార్జున ఖర్గే భావోద్వేగం
ఒక కార్మికుడి కొడుకు, సామన్య కార్యకర్త నుంచి ప్రస్థానాన్ని ప్రారంభించి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం తనకు గర్వంగా ఉందని మల్లికార్జున ఖర్గే అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు సర్టిఫికెట్ అందుకున్న అనంతరం వేదికపై నుంచి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. 1969లో కాంగ్రెస్ లో తన జీవితం ప్రారంభమైందని, ఎంతోమంది రాజకీయవేత్తలతో కలిసి పనిచేసే అవకాశం తనకు దొరికిందని గుర్తుచేసుకున్నారు. రాజ్యాంగాన్ని కాపాడడం తన బాధ్యత అని, అందుకోసం పోరాడేందుకు పోరాడేందుకు అందరూ సిద్దంకావాలని పిలుపునిచ్చారు. సోనియా నేతృత్వంలో రెండుసార్లు యూపీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిందని, ఆ సమయంలోనే కాంగ్రెస్ కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చిందని గుర్తుచేశారు. రాజస్థాన్‌లో జరిగిన చింతన్ శిబిర్‌లో సోనియా ఆలోచన నుంచి తీసుకొచ్చిన బ్లూప్రింట్‌ను అమలుచేస్తామని ఖర్గే అన్నారు. దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాంగ్రెస్ లక్ష్యమని ఆయనన్నారు. 137 ఏళ్లుగా కాంగ్రెస్ దేశంలోని బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడుతోందని, ‘భారత్ జోడో’ యాత్రతో మరోసారి రాహుల్ పేద వర్గాల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారని అన్నారు.

పార్టీలో భారత్ జోడో యాత్ర ఒక కీలకమైన ఘట్టం అని ఆయన అభివర్ణించారు. ఈ యాత్రలో రాహుల్ వెంట నడిచేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజానీకం ఉత్సాహం చూపుతున్నారని అన్నారు. హిమాచల్, గుజరాత్ రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన పోటీనిస్తుందని ఆయన తెలిపారు. రాహుల్ ఎప్పుడూ చెప్పే ‘డరో మత్’ (భయపడకు) నినాదంతో ముందుకెళ్తామని అన్నారు. ఏదేమైనా లడేంగే (పోరాడదాం), జీతెంగే (గెలుద్దాం) అంటూ ఆయన నినదించారు. తమ పోరాటం పార్టీ కోసం, ప్రజల కోసం, దేశ భవిష్యత్ కోసం తప్ప వ్యక్తుల కోసం కాదని ఖర్గే తెలిపారు.

నవశకానికి నాంది: తెలుగు నేతలు
కాంగ్రెస్ చరిత్రలో నవశకానికి నాంది పలికామని తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. ఏఐసీసీ కార్యాలయంలో సందడి చేసిన తెలుగు నేతలు, మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టడాన్ని స్వాగతించారు. సుదీర్ఘ రాజకీయానుభవం కల్గిన ఖర్గే నాయకత్వం, 2 దశాబ్దాలుగా పార్టీకి నాయకత్వం వహించిన సోనియా గాంధీ అనుభవం, మార్గదర్శకత్వం పార్టీకి రెండింతల బలాన్నిస్తాయని అన్నారు. పూర్తి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించి మరీ కొత్త అధ్యక్షుణ్ణి ఎన్నుకోవడం ఏ పార్టీలోనూ లేదని కొందరు వ్యాఖ్యానించారు. కొత్త-పాత, అనుభవం-యువతరం మేళవించిన సరికొత్త కూర్పుతో పార్టీ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోందని అన్నారు.

అగ్గిపెట్టె శాలువాతో సత్కారం
ఏఐసీసీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గేను మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అగ్గిపెట్టె శాలువాతో సత్కరించారు. బుధవారం మధ్యాహ్నం ఖర్గేను ఆయన నివాసంలో కలిసిన పొన్నం ప్రభాకర్ తెలంగాణలోని సిరిసిల్లలో పట్టుదారంతో చేనేత మగ్గాలపై నేసిన శాలువాను అగ్గిపెట్టెలో పెట్టి తీసుకొచ్చారు. సిరిసిల్ల చేనేత నైపుణ్యాన్ని చాటడంతో పాటు కొత్త అధ్యక్షుడిపై అభిమానాన్ని చాటుకునేందుకు ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ సురేశ్ శెట్కార్ కూడా ఉన్నారు. ఖర్గే నాయకత్వంలో, గాంధీ పరివారం దిశానిర్దేశంతో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కలసికట్టుగా పనిచేస్తామని వారు తెలిపారు. ‘భారత్ జోడో’ యాత్ర గురువారం నుంచి తెలంగాణలో పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో సాయంత్రానికి ఢిల్లీ నుంచి తిరుగుప్రయాణమయ్యారు.

కాంగ్రెస్ అగ్రనాయకత్వం రాజీనామా
ఏఐసీసీ నూతన అధ్యక్షుడిగా ఖర్గే పదవీ బాధ్యతలు చేపట్టిన కాసేపటికే పార్టీ జాతీయ కార్యవర్గం మొత్తం రాజీనామా చేసింది. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంచార్జులు తమ పదవులకు రాజీనామా చేశారని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు మారినప్పుడు కార్యవర్గం మొత్తం రాజీనామా చేయడం ఆనవాయితీ అని, కొత్త అధ్యక్షుడు తనకు అనుకూలమైన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్త కార్యవర్గంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు 50 శాతం వరకు చోటు కల్పించనున్నట్టు తెలిసింది. ఆ మేరకు మార్పులు చేర్పులు జరగనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో 50 శాతం వరకు కొత్త అధ్యక్షుడు తనకు నచ్చినవారిని నామినేట్ చేస్తారని, మిగతా 50 శాతం పదవులను ఎన్నికల ద్వారా భర్తీ చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తొలుత వర్కింగ్ కమిటీ కూర్పు జరుగుతుందని, అనంతరం వారిలో నుంచి కొందరిని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులుగా తీసుకుంటారని తెలిపారు. అలా ప్రధాన కార్యదర్శులైనవారికి వివిధ రాష్ట్రాల బాధ్యతలు అప్పగిస్తారు. ఈ కసరత్తుతో పాటు వివిధ రాష్ట్రాల్లో పీసీసీ నాయకత్వంలో మార్పులు, చేర్పులు చేసే అధికారాన్ని ఏఐసీసీకి కట్టబెడుతూ ఇప్పటికే అన్ని రాష్ట్రాల పీసీసీలు తీర్మానం చేసి పంపాయి. తొలుత ఏఐసీసీ నాయకత్వ కసరత్తు పూర్తి చేసి, ఆ తర్వాత వివిధ రాష్ట్రాల పీసీసీ నాయకత్వంలో మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement