Saturday, April 27, 2024

కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎలా కొడతారు ?

ఎంపీ రఘు రామకృష్ణ రాజు కేసు విచారణకు హైకోర్టులో జస్టిస్‌ ప్రవీణ్‌ నేతృత్వంలో స్పెషల్‌ డివిజన్‌ బెంచ్‌ ఏర్పాటైంది. రఘురామ తరఫున హైకోర్టులో హేబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలైంది. రాష్ట్రంలో ఏం జరుగుతోందని హైకోర్టు ప్రశ్నించింది. ‘‘కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎలా కొడతారు? రఘురామకు తగిలినవి తాజా గాయాలని తేలితే తీవ్ర పరిణామాలు’’ తప్పవని హైకోర్టు హెచ్చరించింది. ఎంపీ రఘురామ గాయాల పరిశీలనకు వైద్యుల కమిటీని ఏర్పాటు చేసింది.

మరోవైపు రఘు రామకృష్ణ రాజు రిమాండ్‌ రిపోర్టును సీఐడీ కోర్టు పెండింగ్‌లో పెట్టింది. అరికాళ్లపై గాయాలు, వివరాలను న్యాయస్థానం నమోదు చేసుకుంది. ఎంపీ కాళ్లకు తగిలిన గాయాల ఆధారాలను రఘురామ తరఫు న్యాయవాదులు కోర్టు ముందుంచారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా చికిత్స కోసం ఎంపీని ఆసుపత్రికి తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు రఘురామ నిరాకరించారు. దీంతో ఆయనకు రమేశ్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించాల్సిందిగా కోర్టు అధికారులను ఆదేశించింది.

కాగా, అంతకు ముందు..పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని.. వాళ్ల దెబ్బలకు తన కాళ్లు వాచిపోయాయని నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. రఘురామపై సీఐడీ అధికారులు పెట్టిన సెక్షన్లు వర్తించవని, రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న ఆ సెక్షన్లను రద్దు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది వాదించినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement