Saturday, May 4, 2024

త‌నిఖీలు చేస్తే దాడులేనా – ఎపిలో ఉద్యోగులు గ‌గ్గోలు..

రాబడి తెచ్చే ఉద్యోగులపై దాడులు!
విస్తరిస్తున్న విష సంస్కృతి
ప్రోత్సహిస్తున్న రాజకీయ నేతలు
చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు
ఇలాగైతే విధులు నిర్వహించలేమంటున్న ఉద్యోగులు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ‘నయా’ సంస్కృతి మొదలైంది. పన్ను వసూళ్ల కోసం ఉద్యోగులు నిలదీస్తే దాడులకు తెగబడుతున్నారు. ఓ వైపు ప్రభుత్వ లక్ష్యాలు..మరో వైపు దాడుల పరంపర ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గతం కంటే భిన్నంగా సాక్షాత్తు ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులే దాడులను ప్రోత్సహించడం ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది. రాష్ట్రంలో రాబడి శాఖల ఉద్యోగులపై ఇటీవల దాడులు నిత్యకృత్యమయ్యాయి. గతంలో రవాణాశాఖ ఉద్యోగులపై దాడుల మీద ఉదాసీన వైఖరి.. నేడు వాణిజ్య పన్నుల శాఖకు ఉద్యోగులపై దాడులకు ప్రేరణగా నిలిచింది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కమిషనర్‌ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా వీ.కోటలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ముగ్గురు ఉద్యోగులపై దాడి జరిగింది. మహిళా అధికారిణి పట్ల అనుచితంగా ప్రవర్తిం చడంతో పాటు ఆమెకు సహాయంగా వచ్చిన ఇద్దరు ఉద్యోగులపై చేయి చేసుకోవడం విశేషం. ఇదంతా అధికార పార్టీ ఎమ్మెల్యే సమక్షం లో జరగడం పట్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా రవాణాశాఖ అధికారులపై పలు జిల్లాల్లో దాడులు జరిగాయి. పోలీసు అధికారులు కూడా వీరిపై నామమాత్రపు చర్యలు తీసుకోవడం..కొన్ని చోట్ల అధికారులే దాడులకు పాల్పడిన వారితో రాజీ చేసుకోవడం జరిగింది.

అసలేం జరిగింది..
అక్రమంగా గ్రానైట్‌ చెన్నైకి తరలిస్తున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు సమాచారం వచ్చింది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత బుధవారం రాత్రి చిత్తూరు-2 సర్కిల్‌ డెప్యూటీ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఇందిరా ప్రియదర్శిని మరో ఇద్దరు ఉద్యోగులను వెంటబెట్టుకొని వీ.కోటలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే గ్రానైట్‌ లారీని నిలువరించి తనిఖీ చేయగా ఏ విధమైన రికార్డులు లేవని గుర్తించారు. దీంతో పన్నుతో పాటు వే-బిల్లు లేకుండా గ్రానైట్‌ తరలిస్తున్నందుకు జరిమానా చెల్లించాలంటూ అధికారులు పేర్కొన్నారు. దీంతో లారీ డ్రైవర్‌ సమాచారం మేరకు అక్కడికి ఎమ్మెల్యే సహా కొందరు అనుచరులు వచ్చి ఉద్యోగులపై దౌర్జన్యం చేశారు. అక్కడ విధులు నిర్వహించే మహిళా అధికారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల నేపధ్యంలో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

గతంలో రవాణాశాఖ అధికారులు..
గతంలో పలు జిల్లాల్లో రాష్ట్ర రవాణాశాఖ అధికారులపై దాడులు జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో ఓ అధికారి వాహన పన్ను చెల్లించమన్నందుకు అధికారిపై దాడికి పాల్పడ్డారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టిప్పర్‌ యజమాని నేరుగా కార్యాలయానికి వచ్చి పన్ను కట్టమన్న అధికారిపై దాడికి తెగబడ్డాడు. కాకినాడలో వాహనదారుడు పన్ను కట్టమంటే కొబ్బరి బొండాల కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. పలు జిల్లాల్లో ఈ తరహా దాడులు నిత్యకృత్యమై పోయాయి. కేవలం పన్నులు, జరిమానాలు కట్టమంటే అధికారులపై దాడులకు తెగబడుతున్న కొత్త సంస్కృతి మొదలు కావడం ఉద్యోగుల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది.

- Advertisement -

రాబడి శాఖలే లక్ష్యంగా..
రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం పెద్ద ఎత్తున నిధుల అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే పన్నుల లీకేజీ లేకుండా చూడాలంటూ తరుచూ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తోంది. పైగా గతంతో పోల్చితే పన్నుల వసూళ్ల లక్ష్యాలు కూడా పెరిగాయి. ముఖ్యంగా వాణిజ్య పన్నులు, రవాణాశాఖలపై ఒత్తిడి బాగా ఉంది. మద్యంపై ఆదాయం నేరుగా వస్తుంది కాబట్టి అవాంఛనీయ ఘటనలు ఆస్కారం లేదు. రాష్ట్ర ఆదాయంలో వాణిజ్య పన్నుల శాఖది సింహ భాగం. ఎక్కడా పన్నుల ఎగవేత లేకుండా చూస్తేనే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేతాయి. ఎప్పటికప్పుడు పన్నుల లీకేజికి ఆస్కారం లేకుండా చూడటంతో పాటు నిరంతరం వాహణాల తనిఖీలు చేయాల్సి ఉంటుంది. పైగా పన్ను ఎగవేత దారులు రాత్రి సమయాల్లోనే సరకు అక్రమ రవాణా చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో వచ్చిన సమాచారం మేరకు అధికారులు తనిఖీ చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే అధికారులపై దాడులు చేస్తున్నారు. మహిళా అధికారులైతే ఇష్టం వచ్చినట్లుగా బూత పంచాంగం విప్పుతున్నట్లు చెపుతున్నారు. ఇక రవాణాశాఖ అధికారులైతే పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వ లక్ష్యాలు..మరో వైపు అధికారుల ఇండెంట్ల నేపధ్యంలో తనిఖీలకు వెళ్లే అధికారులు క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దాడుల పట్ల ఉన్నతస్థాయిలో ఉదాసీన వైఖరి కూడా అక్రమార్కులకు వరంగా మారింది. ఉద్యోగులపై దాడికి పాల్పడితే ప్రభుత్వపరంగా కఠిన చర్యలు ఉంటాయనే హెచ్చరికలు ఉన్నప్పుడే ఇలాంటి ఘటనలను నిలువరించొచ్చు. లేకుంటే రానున్న రోజుల్లో దాడులు సర్వసాధారణమై తనిఖీలు అంటేనే ఉద్యోగులు బెంబేలెత్తే పరిస్థితులు నెలకొంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement