Friday, April 26, 2024

రివర్స్‌లో ఏపీ అభివృద్ధి : దగ్గుబాటి పురంధేశ్వరి..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పాలనే కాదు అభివృద్ధి కూడా రివర్స్‌లోనే వెళుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం స్కీములతో అన్ని రంగాల్లో ముందుకెళుతుంటే..ఏపీ ప్రభుత్వం మాత్రం మాఫియాలో ముందుకు సాగుతోందన్నారు. విజయవాడలో సోమవారం జరిగిన బీజేపీ శక్తి కేంద్రాల ప్రముఖుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే ఏపీని పరిపుష్టం చేస్తానని చెప్పిన జగన్మోహన రెడ్డి అందుకు విరుద్ధంగా చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఏపీ అంటే ఉన్నతంగా ఉండేదని చెపుతూ ప్రస్తుతం అంతర్జాతీయ మీడియా కూడా ఏపీ అప్పులపై చర్చలు పెడుతుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రూ.7లక్షల కోట్లు అప్పులు చేసి కూడా కనీసం పరిశ్రమలు తీసుకు రాలేదని, ప్రభుత్వపరంగా ఆస్తులు కూడబెట్టలేదన్నారు. ఇటీవల ఒక పారిశ్రామిక వేత్త పెట్టుబడులను తమిళనాడుకు తరలిస్తున్నట్లు చెప్పడం ఇక్కడి పరిస్థితులకు అద్దం పడుతోందని ఆమె చెప్పారు. భూ, మట్టి, మద్యం ఇలా ఏ ఒక్కదాన్ని చూసినా కనిపించేది మాఫియానేనని ఆమె పేర్కొన్నారు. ఏపీలో కేంద్రం చేసిన అభివృద్ధి తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదన్నారు. పైగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు స్టిక్కర్లు వేసుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ఇటీవల నిర్వహించిన సామాజిక న్యాయం బస్సు యాత్రకు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత నుంచి దృష్టి మల్లింపులో భాగమే అమలాపురం ఘోర కలి అని ఆమె అన్నారు.

మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని చెపుతూ శక్తి కేంద్రాల ప్రముఖులు కీలక పాత్ర పోషించాలని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్‌ కృష్ణారావు మాట్లాడుతూ కేంద్ర అభివృద్ధిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే కేంద్రం ఇచ్చిన సాయంపై పుస్తకాన్ని తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ మాట్లాడుతూ గతంలో తెదేపా, ప్రస్తుతం వైసీపీ బీజేపీ ఎదుగుదలను జీర్ణించుకోలేక మైండ్‌ గేమ్‌ ఆడుతున్నాయన్నారు. దీనిని బలంగా తిప్పి కొట్టేందుకు ప్రజా ఉద్యమాలు చేద్దామంటూ అందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ సహ సంఘటనా మంత్రి శివప్రకాష్‌, రాష్ట్ర సహ ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్‌, ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌, జీవీఎల్‌ నరసింహారావు, డాక్టర్‌ కే.లక్ష్మణ్‌, జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌, జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌, బీజేపీ మేధావుల ఫోరం కన్వీనర్‌ డాక్టర్‌ ముత్తా నవీన్‌ కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, పలువురు బీజేపీ రాష్ట్ర, జాతీయ నేతలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement