Sunday, April 28, 2024

APలో పది పరీక్షలకు సన్నద్ధం! అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ‌

అమరావతి, ఆంధ్రప్రభ : విద్యార్థుల భ‌విష్య‌త్​కు ప‌ది ప‌రీక్షలే ప్రాధాన్యం కావ‌డంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,23,092 మంది విద్యార్థులు ప‌రీక్ష రాయ‌నున్నారు. ఇందులో బాలురు 3,17,939 మంది, బాలికలు 3,05,153 మంది ఉన్నారు. వీరితో పాటు రీ అప్పీయర్‌ విద్యార్ధులు 1,02,528 మంది, ఓఎస్‌ఎస్‌సీ అభ్యర్థులు 1,562 మంది ఉన్నారు. 3, 473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

స‌మ‌యానికి ప‌రీక్ష కేంద్రాల‌కు చేరుకున్న వారికే అనుమ‌తి ఉంటుంద‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాల‌ని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థుల‌కు ప‌రీక్ష కేంద్రాల్లో అన్ని వ‌స‌తులు క‌ల్పించ‌నున్నారు. ఎమ‌ర్జెన్సీ కింద ప్ర‌త్యేక మెడిక‌ల్ క్యాంపుల‌ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. స‌మ‌యానికి ప‌రీక్ష కేంద్రాల‌కు చేరుకునే విధంగా ఆయా రూట్ల‌లో ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డ‌ప‌నున్నారు. ఇప్ప‌టికే ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు మండ‌ల స్థాయి అధికారులను సిద్ధం చేశారు.

ప‌క‌డ్బందీ ఏర్పాట్లు..

ప‌ది ప‌రీక్ష‌ల‌కు విద్యాశాఖ ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. విద్యార్థులు మాస్ కాపీయింగ్ కి పాల్ప‌డ‌కుండా ఫ్ల్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్ల ఏర్పాటు చేశారు. 682 సిట్టింగ్‌ స్క్వాడ్లు, 156 ఫ్లైయింగ్‌ స్క్వాడ్లను సిద్ధం చేశారు. 130 కి పైగా పరీక్షా కేంద్రాల్లో సీసీటీ-వీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ (ఎస్‌ఎస్‌సీ బోర్డ్‌), విజయవాడలో 0866-2974540 ఫోన్‌ నంబర్‌ తో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఇది మార్చి 1 నుండి 30 వరకు అన్ని రోజులలో అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

జిల్లా స్థాయి కంట్రోల్‌ రూములు డీఈవోల నుండి 24 గంటల పాటు పనిచేస్తాయి. ప‌రీక్ష స‌మ‌యంలో విద్యార్థుల‌తో పాటు సిబ్బందికి సెల్ ఫోన్లు, ఇత‌ర ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో సీఆర్‌పీసీ సెక్షన్‌ 144ని అమ‌లు చేయ‌నున్నారు. పరీక్షా కేంద్రాల చుట్టూ శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రశ్నా పత్రాల లీకేజీ లేదా నకిలీ ప్రశ్నపత్రాలు మొదలైన వాటికి సంబంధించిన పుకార్లను తనిఖీ చేయడానికి అన్ని పరీక్షా కేంద్రాలను సందర్శించడానికి మొబైల్‌ పోలీస్‌ స్క్వాడ్ల ను నియమించారు. ప్రశ్నాపత్రం లీకైతే క‌నిపెట్టేంద‌కు నూత‌న సాంకేతిక విధానాన్ని ఉప‌యోగించి నిందితుల‌ను క‌నిపెట్ట‌నున్నారు. అక్రమాలకు పాల్పడే అక్రమార్కులపై 1997 నాటి యాక్ట్‌ / 1997 (మాల్రాక్టీసెస్‌ నిరోధక చట్టం) ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement