Saturday, April 27, 2024

Annamaiah Dam Victims – ఎన్నాళ్లు ఈ క‌న్నీళ్లు.. ఎంత‌కాలం గుడారాల‌లోనే జీవితాలు

అన్నమయ్య జిల్లా, ప్రభన్యూస్‌ బ్యూరో: అది ఒకప్పుడు మరో కోనసీమ ఆ ప్రాంతం. ఏడాదంతా పచ్చగా కనిపించే పైర్లు. ఇండ్ల నిండా ధాన్యం…. సంవత్స రానికి రెండు పంటలు… కరువు తెలియ ని సుభిక్షమైన ప్రాంతం. అదే అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం. అన్నమయ్య ప్రాజెక్టు పరీవాహక ప్రాంతం. కరువు కాటకాల మాట ఎలా ఉంటు-ందో కూడా తెలియని ఆ ఊర్లు వల్లకాడుగా మారాయి. 2021వ సంవత్సరం నవంబర్‌ 19. తెల్లవారు జాము వరకు ఆ పల్లెలు సంపన్నమైనవి. అదేరోజు ఉదయం 10 గంటల తరువాత సర్వం కోల్పోయి నిర్జీవంగా మారిన శిధిల ప్రాంతాలు. విధి వక్రీకరిస్తే ఎంతటి వారైనా కుదేలైపోతారనే అంశానికి నిలువెత్తు నిదర్శనం. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మండలం చెయ్యేరు ప్రాజెక్టు వరద ప్రాంతం. అన్నమయ్య డ్యాం తెగిపోయి రెండేళ్లు కావస్తోంది. కానీ అక్కడ పునరావాస కార్యక్రమాలు చూస్తే పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యాలుగా దర్శనమిస్తున్నాయి. అన్నమయ్య డ్యాం అర్ధరాత్రి తెగిపోవడంతో అక్కడ జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసిన నాధుడే లేడు. ఆ సంఘటన ప్రపంచాన్ని మొత్తం కలచివేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆ ప్రాంతాలకు వెళ్లి బాధితులకు నేరుగా గట్టి భరోసా ఇచ్చారు. మూడు నెలల్లో బాధితులకు పక్కా ఇళ్లు నిర్మించి తాళాలు చేతికిస్తామని గట్టి నమ్మకం చెప్పాడు. అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ గిరీష పిఎస్‌ వరద బాధిత గ్రామాలలో సందర్శించి నెలలోపు ఊరట కల్పిస్తానని ఆశలు చెప్పారు. సీఎం హామీలు.. కలెక్టర్‌ చెప్పిన ఆశలు.. అక్కడ కొండెక్కడంతో వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతం.

ఆ ఊళ్ల ఆనవాళ్లేవీ…
అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో ఇసుకతో కూడిపోయిన ఆ పరివాహక గ్రామాల ఆనవాళ్లుగా కూడా కనపడడం లేదు. ఇప్పటికీ అదే పరిస్థితి. పాలకుల నిర్లక్ష్యానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. అధికారుల అలసత్వానికి అక్కడి పరిస్థితి చూస్తే చాలు. అంతకంటే ఆధారం అవసరం లేదు. ఏడు దశాబ్దాలు దాటిన ప్రజాస్వామ్య సమాజంలో విపత్తులకు బలైపోయిన గ్రామాలు కోలుకోవడానికి రెండేళ్ల సమయం సరిపోలేదు. అన్నమయ్య డ్యాం బాధిత గ్రామాల ప్రజల కష్టాలకు కన్నీళ్ళకు ఇంకా ఎన్నాళ్ళు ఎన్నేళ్లో అర్థం కావడం లేదు .

నెలలో ఇల్లిస్తామని…
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నమయ్య డ్యాం తెగిపోయిన తరువాత సుమారు 15 రోజులకు 2021 డిసెంబర్‌ మూడవ తేదీన వరద ప్రాంతాలను సందర్శించారు. ముఖ్యమంత్రి ప్రత్యక్షమవడంతో బాధితులంతా తమ గోడు వెళ్లబోసుకున్నారు. దానికి చలించిన జగన్‌ మూడు నెలల్లో బాధితులకు పక్కా గృహాలు నిర్మించి తాళాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. కానీ రెండేళ్ల అవుతున్నా బాధితులు మాత్రం తాత్కాలికంగా వేసుకున్న -టె-ంట్లు-, పూరి గుడిసెలు మారలేదు. అదే రోజున సీఎం జగన్‌.. తెగిపోయిన పింఛా అన్నమయ్య ప్రాజెక్టులను రీడిజైన్తో మళ్లీ పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీలు ఏమ య్యాయో కూడా ఇప్పటికీ తెలియదు. ఒక హెక్టారుకు 12,500 రూపాయలను ఇసుకమేటలు తొలగించడానికి మంజూరు చేస్తున్నానని సీఎం హామీ ఇచ్చారు. కానీ వరద బాధిత గ్రామాల్లో ఏడాదికి రెండు పంటలు పండే పొలాలు ఇసుక దిబ్బలతో ఎడారిని తలపిస్తున్నాయి. ఆ మేటలను తొలగించడానికి ఎకరాకు లక్ష రూపా యలకు పైగా ఖర్చు అవుతుందని ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుం దని బాధితులు లబోదిబోమంటు-న్నారు. డ్వాక్రా గ్రూపులకు రుణాల చెల్లింపు విషయంలో ఒక సంవత్సరం మారిటోరియం ప్రకటిస్తానని సీఎం చెప్పినా ఒక నెల తరువాత నుంచే బ్యాంకర్లు వేధింపులకు పాల్పడడం ప్రారంభించారు. వరదల్లో గల్లంతయిన వేలాది పశువుల నష్టాలను పూడ్చడానికి పశుసంవర్ధక శాఖ ద్వారా పశుగణన చేయించి రైతులకు తిరిగి పశువులను పంపిణీ చేస్తానని సీఎం జగన్‌ ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. 60 మంది డిప్యూటీ- కలెక్టర్లతో వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేస్తామని చెప్పినా ఆ వాగ్దానమూ నెరవేరనే లేదు. వరద బాధిత గ్రామాలైన పులపత్తూరు, అరుంధతివాడ, హరిజనవాడ, వరద బాధితులు ఇప్పటికీ తాత్కాలికంగా ఏర్పాటు- చేసుకున్న గుడారాల్లోనే మగ్గుతున్నారు, మూగజీవాలను పోగొట్టు-కున్న రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూసి చూసి ఆశ వదులుకున్నారు. విపత్తులతో ఏ ప్రాంతమైనా చిన్నాభిన్నమై చితికిపోతే ఆదుకునే విధానం ఇదేనా అంటూ పలువురు విమర్శిస్తున్నారు. డ్యామ్‌ తెగిపోయిన మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా కొన్ని రాజకీయ పార్టీలు నాయకులు నిత్యం సందర్శిస్తూనే కోట్ల రూపాయల సాయం అందిస్తూనే ఉన్నారు. కానీ అసలైన వరద బాధితులకు శాశ్వత పరిష్కారాలు ఇంకా దొరకనే లేదు.

రెండేళ్ల క్రితం తెగిపోయిన అన్నమయ్య డ్యాం రాజంపేట పాలకులకు శాపంగా మారనుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిని మెప్పించి అన్నమయ్య డ్యాం పరివాహక ప్రాంత గ్రామాలను వీలైనంత త్వరగా పునరుద్ధరింపజేసే విషయంలో రాజంపేట ప్రజాప్రతినిధులు ఘోర విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా తక్షణ సాయం అందించడంలొ గాని బాధితులకు పక్కా ఇల్లు ఇసుకమేటలతో నిండిన పొలాలు పునరావాసాలు లాంటివి అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని అభిప్రాయాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ అంశం ప్రభావితం చూపుతుందని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement