Monday, May 6, 2024

Sharmila: మోసం చేసిన మోదీకి మీ ఊడిగం ఎందుకు ?…తెదేపా, వై కాపా లకు షర్మిల సూటి ప్రశ్న

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో): మహా భక్తుడు గా చెప్పుకునే మోదీ తిరుపతి పుణ్యక్షేత్రం లో ఇచ్చిన ప్రత్యేక హోదా మాట తప్పినా ఆయనకు ఇంకా ఎందుకు ఊడిగం చేస్తున్నారో తెలుగుదేశం, వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతలు రాష్ట్ర ప్రజలకు చెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత రాష్ట్ర పర్యటన చేస్తున్న ఆమె ఈరోజు తిరుపతిలో జిల్లా సమావేశం లో పాల్గొన్నారు.

సమావేశం లో షర్మిల మాట్లాడుతూ 2014 లో తిరుపతి లో జరిగిన ఎన్నికల సభలో పాల్గొన్న మోదీ విభజిత రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తానని ఇచ్చిన హామీని గుర్తు చేశారు. అదే వేదికపైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు పదేళ్లు చాలదు పదిహేనేళ్ళు కావాలని అడిగిన సందర్భాన్ని వివరించారు. తరువాత అధికారం లో వచ్చిన మోదీ హోదా ఇవ్వకపోయినా ప్యాకేజీ చక్కని చంద్రబాబు సర్దుకున్నరన్నారు. 2019 ఎన్నికల్లో తనను గెలిపిస్తే హోదా తీసుకువస్తానని హామీలిచ్చిన వై ఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగనన్న అధికారం లో వచ్చాక పట్టించుకోలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వందలాది పరిశ్రమలు వచ్చే వీలున్న హోదా ఇవ్వని మోదీ ని ఆ ఇద్దరు నేతలు ఇప్పటికీ నిలదీయడం లేదన్నారు.

- Advertisement -

పైగా మోసం చేసిన మోదీ కి పోటీలు పది ఊడిగం చేస్తూ బానిసలుగా వ్యవహారిస్తున్నారన్నారు. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపి లేకున్నా గత పదేళ్లుగా బి జె పి రాష్ట్రాన్ని ఏలుతోందని ఎద్దెవా చేశారు. అందుకే బాబు జగన్ పవన్ ల పేర్లతో బి జె పి రాష్ట్రాన్ని ఏలుతోందని అన్నారు. మోసం చేసిన మోదీ కి ఎందుకు ఊడిగం చేస్తున్నారో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేసారు. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం పూర్తి కాకున్నా, వెనుక బడిన ప్రాంతాలకు ప్యాకేజి ఇవ్వకున్నా నిలదీయడం లేదన్నారు. చంద్రబాబు, జగనన్న తమ స్వలాభం కోసమే మోదీ కి ఊడిగం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారని ప్రజలు గుర్తించాలన్నారు.

వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలు పెట్టి చాలావరకు పూర్తి చేసిన నీటి ప్రాజెక్టులు గత పదేళ్లలో ముందడుగు వేయలేదన్నారు. వై ఎస్సార్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిన హంద్రీ నీవా ప్రాజెక్ట్ ను నిర్లక్ష్యం చేస్తున్నారని చంద్రబాబు ను విమర్శించిన జగనన్న కూడా పట్టించుకోలేదని అన్నారు. ఇదే విధంగా పెండింగ్ ప్రాజెక్టులు, వై ఎస్సార్ మొదలు పెట్టిన మన్నవరం అన్నీ నిర్లక్షానికి గురవుతున్నా పట్టించుకోని జగనన్న ప్రభుత్వం ఏవిధంగా ఆయన అడుగుజాడల్లో నడచినట్టు అవుతుందని ప్రశ్నించారు.

ఈ వాస్తవాలను కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చే 60,70 రోజుల్లో ఇంటింటికి వెళ్లి తెలియచేయాలని పిలుపు నిచ్చారు. 3,500 రోజులపాటు పాదయాత్ర చేసి వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని అధికారం లో రావడానికి తోడ్పడిన తనపై కృతజ్ఞత చూపకుండా ఆ పార్టీ నాయకులు వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేస్తున్నారని అన్నారు. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలినైన తాను భయపడే సమస్య లేదన్నారు. ఏ త్యాగినికైనా వెనుకాడకుండా పోరాటం సాగించి కాంగ్రెస్ పార్టీకి అధికారం సాధిస్తానని అన్నారు. ఈ సమావేశం లో కాంగ్రెస్ నాయకులు పల్లంరాజు, చింతా మోహన్, గిడుగు రుద్ర రాజు, రఘువీరా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement