Sunday, April 28, 2024

Andhra Pradesh – ప‌వ‌ర్ పాలిటిక్స్ – రేప‌టి నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎన్నిక‌ల శంఖ‌రావం

ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌ల‌కు ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ సిద్ధం
భీమ‌వ‌రం నుంచి ఎన్నిక‌ల శంఖ‌రావం
నాలుగు రోజుల పాటు గోదావ‌రి జిల్లాల్లో టూర్‌
175 నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేనాని ప్రచారం
మంగ‌ళ‌గిరిలోనే రాత్రి బ‌స‌
ఏర్పాట్లు చేస్తున్న పార్టీ వ‌ర్గాలు

అమ‌రావ‌తి – ఏపీలో ప‌ట్టు పెంచుకుని, విజ‌య‌మే ల‌క్ష్యంగా జ‌న‌సేన త‌హ‌త‌హ‌లాడుతోంది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నికలకు పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రెడీ అయ్యారు. ఇప్ప‌టికే టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చివ‌రి ద‌శ‌లో ఉంది. చంద్రబాబు, లోకేశ్ జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. కాగా, జనసేన అధినేత పవన్ కూడా ప్ర‌చార రంగంలో దిగేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప‌వ‌న్ కోసం ప్రత్యేక హెలికాప్టర్ సిద్ధం అయ్యింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్ర‌చారం చేప‌ట్ట‌నున్న‌ట్టు తెలుస్తోంది. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం అనువైన ప్రదేశాలను ఇప్పటికే పార్టీ వ‌ర్గాలు గుర్తించాయి. హెలిపాడ్ నిర్మాణాల అనుమ‌తుల కోసం జ‌న‌సేన త‌ర‌పున‌ సంబంధిత అధికారుల‌కు లేఖ‌లు వెళ్లాయి. అనుమ‌తుల అధారంగా ప్రతీ నియోజకవర్గంలో పవన్ పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

ప్ర‌తి జిల్లాలోనూ మూడు సార్లు ప‌ర్య‌ట‌న

ప్రతి జిల్లాకు మూడు సార్లు వెళ్లాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. మొదటి పర్యటనలో జిల్లా ముఖ్యనేతలతో సమీక్షలు, రెండు, మూడు పర్యటనల్లో జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో సభల్లో పాల్గొనేలా పవన్ షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు.

రేప‌టి నుంచే ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న ..

- Advertisement -

రేపటి నుంచి పవన్ గోదావరి జిల్లాల్లో మొదటి పర్యటన ప్రారంభించనున్నారు. నాలుగు రోజులు పాటు గోదావరి జిల్లాల్లో ముఖ్యనేతలతో సమీక్షల్లో పాల్గొంటారు. రేపు భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా నాయకులతో, 15న గురువారం అమలాపురంలో జిల్లా ముఖ్యనేతలతో, 16వ తేదీన కాకినాడలో మరోసారి పవన్ సమీక్షలు చేయనున్నారు. ఈనెల 17వ తేదీన శనివారం రాజమండ్రిలో పార్టీ ముఖ్య నేతలతో పవన్ సమావేశం అవుతారు.

రాత్రి బ‌స మంగ‌ళ‌గిరిలోనే …

పవన్ కల్యాణ్ పర్యటనలకు హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు. రాత్రి తిరిగి మంగళగిరి పార్టీ కార్యాల‌యానికి చేరుకునేలా షెడ్యూల్ రెడీ అయ్యింది. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో టికెట్ల విషయంపై పార్టీ ముఖ్యనేతలతో, టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చలు ఉండ‌నున్నాయి. దీనికి వీలుగా జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పటికీ రాత్రి వేళల్లో అందుబాటులో ఉండేలా పార్టీ నేతలు పవన్ పర్యటనలను ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement