Sunday, April 28, 2024

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీసుపై నిషేధం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే వైద్యులు ప్రైవేట్‌గా ప్రాక్టీస్‌ చేయకుండా నిషేధం విధిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనిపై నియమ నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది. చాలా మంది ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీసు నిర్వహిస్తుండటంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ ప్రాక్టీసు నిర్వహిస్తున్న వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులను సరిగా నిర్వహించడం లేదని, వారి దృష్టి ప్రైవేట్ ప్రాక్టీస్ ద్వారా వచ్చే డబ్బుపైనే ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ నిర్వహించకుండా నిషేధం విధిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై స్పష్టమైన నియమ, నిబంధనలను రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ‘నాడు- నేడు’ కార్యక్రమం కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులను మెరుగు పరిచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తయారు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని నియమించింది. నాణ్యమైన మందులను ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేస్తోంది. అయినప్పటికీ గవర్నమెంట్ డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే మెరుగైన సేవలు అందిస్తున్నారనే భావనలో ప్రజలు ఉన్నారనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement