Monday, April 29, 2024

వైసీపీ ప్రభుత్వంలో క్రీడలకు పెద్దపీట: వెల్లంపల్లి శ్రీనివాసరావు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడా రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. విజయవాడలో రెండు రోజుల పాటు జరిగే రాష్ట్రస్థాయి శాప్‌ లీగ్‌ రెజ్టింగ్‌ పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్‌ మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ క్రీడాకారులను తయారు చేయాలన్నదే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందుకోసం పాఠశాల స్థాయి నుంచే క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పలు రకాల పోటీలను ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు. తన సొంత నియోజకవర్గంలో, తాను విద్యనభ్యసించిన హిందూ హై స్కూల్లో రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీ-లు నిర్వహించడం, పోటీలను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు.

విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. దీని ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కూడా ఏర్పడుతుందన్నారు. శాప్‌ లీగ్‌ కన్వినర్‌ అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇండోర్‌ క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోనే 13 జిల్లాలకు గాను 12 జిల్లాల నుంచి సుమారు 350 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు హిందూ హైస్కూల్‌ వ్యాయామ ఉపాధ్యాయుడు, పోటీల నిర్వాహకుడు సత్యప్రసాద్‌ తెలిపారు. పలువురు ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement