Saturday, May 4, 2024

AP New Cabinet: ఏపీలో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కేబినెట్ కొలువుదీరింది. 25 మంది కొత్త మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. పాత మంత్రివర్గంలోని 11 మందిని మళ్లీ మంత్రివర్గంలో తీసుకోగా.. కొత్తగా 14 మందికి స్థానం కల్పించారు. అక్షర క్రమంలో కొత్త మంత్రుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ చదువుతూ ఉండగా.. ఆ ప్రకారం వారితో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత మంత్రిగా అంబటి రాంబాబు ప్రమాణం చేశారు. అనంతరం అంజాద్‌ బాషా, ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్‌నాథ్‌, గుమ్మనూరు జయరాం, జోగి రమేష్‌, కాకాణి గోవర్థన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి, ఉషాశ్రీ, చరణ్‌, మేరుగ నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్‌, పి.రాజన్న దొర, ఆర్కే రోజా, తానేటి వనిత, సీదిరి అప్పలరాజు, విడదల రజినీ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్‌, ఉషాశ్రీ చరణ్‌ ఆంగ్లంలో ప్రమాణం చేశారు.

ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో మంత్రులుగ్రూపు ఫొటో దిగారు. ఆ వెంటనే సచివాలయంలో గవర్నర్, సీఎం, కొత్త, పాత మంత్రులు, అధికారులకు తేనీటి విందుకు హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. అనుభవం, సామాజిక సమీకరణలు దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్‌ జగన్‌.. పాత, కొత్త కలయికతో కొత్త మంత్రివర్గాన్ని కూర్పు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, మహిళలకు మంత్రివర్గంలో పెద్దపీట వేశారు. కాగా, ఈ నెల 7వ తేదీన 24 మంది మంత్రులు రాజీనామాలు సమర్పించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement