Sunday, April 28, 2024

రాష్ట్రంలో అరాచక పాలన.. పెట్టుబడులు రాక సన్నగిల్లిన ఉపాధి : దగ్గుబాటి పురంధేశ్వరి

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో అరాచకత్వం రాజ్యమేలుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో పెట్టుబడులు రాక యువతకు ఉపాధి లభించడం లేదని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాష్‌ నడ్డా రాకను పురస్కరించుకొని విజయవాడలో నిర్వహించిన శక్తి కేంద్రాల ప్రముఖుల సన్నాహక సమావేశం విలేకరుల సమావేశాల్లో పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండటం బాధాకరమన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని పురందేశ్వరి కోరారు. రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలా బీజేపీ అండగా ఉంటు-ందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ల పాలనను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పదిహేను రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. కరోనాతో ప్రపంచం మొత్తం ఇబ్బంది పడ్డా మోడీ ప్రణాళికాబద్దమైన కృషితో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. మోడీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వివరిస్తున్నట్లు పేర్కొంటూ ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. కేంద్రం అందించే పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటోందని విమర్శించిన ఆమె బీజేపీ అధికారమిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని తెలిపారు.

పొత్తులు జాతీయ నేతలు నిర్ణయిస్తారు..

ఎన్నికల్లో పొత్తులను జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని పురంధేశ్వరి చెప్పారు. జనసేనతో తమ పొత్తు యథావిధిగా కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. రెండు పార్టీలూ సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇతర పార్టీలతో కలవాలా?వద్దా? అనేది భాజపా జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని పురందేశ్వరి అన్నారు. బీజేపీ, జనసేన పార్టీల మధ్య గ్యాప్‌ వచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఉన్నప్పటికీ నాయకత్వం స్థాయిలో ఏకాభిప్రాయంతోనే ఉన్నామన్నారు. రెండేళ్ల కరోనా వలన క్షేత్రస్థాయిలో గ్యాప్‌ వచ్చినట్లు చెపుతూ, రానున్న రోజుల్లో సరి చేసుకుంటామని తెలిపారు. ఆత్మకూరు అభ్యర్థి గెలుపుపై జనసేనతో చర్చించామని ఆమె తెలిపారు. జాతీయ పార్టీగా పోటీలు ఉన్నామని చెపుతూ జనసేన మద్దతు ఉందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్‌టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శ్రీరాం, బాల కోటేశ్వరరావు, డాక్టర్‌ దాసం ఉమామహేశ్వర రాజు, పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement