Sunday, April 28, 2024

Big story | రోడ్లు మింగేస్తున్నాయి.. 11 నెలల్లోనే దాదాపు 6 వేల మరణాలు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రహదారి భద్రత అత్యంత ఆందోళనకరంగా మారుతోంది. నానాటికీ రోడ్డు ప్రమాదాల తీవ్రత పెరుగుతూ వస్తుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు అధ్వానస్థితిలో ఉన్న రహదారులు, మరోవైపు అతివేగం ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. ప్రతి ఏటా ప్రమాదాల తీవ్రత నానాటికీ పెరుగుతూ వస్తుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ప్రతి నెలా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాల్లో సగటున 60 నుంచి 70 మరణాలు సంభవిస్తున్నాయంటే తీవ్రత ఏ విధంగా ఉందో స్పష్టమవుతోంది. అలాగే 2020 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాల శాతం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది గడిచిన 11 నెలల్లోనే దాదాపు 6 వేల మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రంలో మృత్యువాత పడినట్లుగా అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

వరుసగా మూడేళ్లుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను ఒక్కసారి పరిశీలిస్తే 2020లో 13 వేల 430 ప్రమాదాలు జరిగితే వాటిలో 5 వేల 670 మంది మృత్యువాత పడగా మరో 16 వేల 012 మంది గాయాల పాలయ్యారు. ఇక 2021లో 13 వేల 362 ప్రమాదాలు రాష్ట్రంలో సంభవిస్తే వాటిలో 5 వేల 711 మంది మరణించగా, 14 వేల 126 మంది ఆస్పత్రుల పాలయ్యారు. ఈ ఏడాది 11 నెలల్లో 6 వేల మంది మరణించగా 14 వేల 700 మందికి పైగా ప్రమాదాల్లో గాయపడ్డారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే ప్రతి ఏడాది ప్రమాదాల తీవ్రత పెరుగుతూ వస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. 2021లో జరిగిన ప్రమాదాలకు ప్రస్తుతం ఈ ఏడాదిలో ఇప్పటికే జరిగిన ప్రమాదాల్లో గణనీయమైన పెరుగుదల కనిపించడం ఆందోళనకు గురి చేస్తోంది. గత ఏడాది కన్నా ప్రస్తుతం జరిగిన ప్రమాదాలు 10 శాతం మేర అధికంగా ఉండటం శోచనీయం. ప్రమాదాల పెరుగుదలకు ప్రధాన కారణం రహదారుల దుస్థితితో పాటు అతివేగమేనని అధికార యంత్రాంగం నివేదికల్లో స్పష్టమవుతోంది.

రాష్ట్ర రహదారుల్లో జరుగుతున్న ప్రమాదాల్లో అత్యధికంగా మరణాలు సంభవిస్తున్నట్లు ఈ నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో రహదారులు గుంతలమయంగా మారడంతో తరచు ప్రమాదాలు సంభవిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. వాహనదారులకు జరుగుతున్న ప్రమాదాలు అత్యధికంగా రాత్రి వేళల్లోనే జరుగుతూ వస్తుండటం శోచనీయం. రాత్రి వేళల్లో జరుగుతున్న ప్రమాదాలకు ప్రధాన కారణం రహదారులపై ఉన్న పెద్ద పెద్ద గుంతలే కారణంగా పోలీసుల ప్రాధమిక విచారణలో వెల్లడవుతుంది. మరోవైపు అతివేగంతో ప్రయాణించడం వల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రహదారుల అధ్వాన పరిస్థితి వల్ల 30 శాతం ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంటే అతివేగం వల్ల 70 శాతం ప్రమాదాలు సంభవిస్తున్నట్లుగా వెల్లడవుతోంది.

- Advertisement -

ఎన్‌సీఆర్బీ నివేదికల్లో సైతం నానాటికీ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల తీవ్రత పెరుగుతున్నట్లుగా స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలోనే సంభవిస్తున్నాయి. గడిచిన మూడేళ్లుగా ఈ జిల్లాలో ప్రమాదాల తీవ్రత పెరుగుతున్నట్లుగా వెల్లడవుతోంది. ఈ ఏడాది కేవలం 11 నెలల్లోనే 391 మరణాలు ఈ జిల్లాలోనే సంభవించాయి. ఇప్పటి వరకు 952 ప్రమాదాలు ఈ జిల్లాలో జరిగితే 391 మంది మృత్యువాత పడగా, దాదాపు 940 మంది తీవ్ర గాయాల పాలయ్యారు.

అలాగే కడప జిల్లాలో కూడా ప్రమాదాల తీవ్రత క్రమేణా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే 824 ప్రమాదాలు జరిగితే వాటిలో 372 మంది మరణించారు. తూర్పు గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో జరుగుతున్న ప్రమాదాలు కూడా ఆందోళన కలిగించే రీతిలో ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో కూడా జరుగుతున్న ప్రమాదాలు సంభవిస్తున్న మరణాలు క్రమేణా పెరుగుతున్నట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రహదారి భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement