Saturday, May 4, 2024

లైమ్ సిటీకి బొగ్గు గనిని కేటాయించండి.. కేంద్రానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వినతి..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : లైమ్ సిటీగా పేరొందిన పిడుగురాళ్ల సున్నపు పరిశ్రమకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలుచేపట్టాలని వైసీపీ నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు విజ్ఞప్తి చేశారు. పల్నాడులో గుంటూరు-హైదరాబాద్ హైవేపై ఉన్న పిడుగురాళ్లకు బొగ్గు గనిని కేటాయించాలని, సున్నపు రాయి పరిశ్రమ ఉత్పత్తులకు బొగ్గును సబ్సిడీపై ఇవ్వాలని ఆయన బొగ్గు మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు. బుధవారం లోక్‌సభ జీరో అవర్‌లో శ్రీకృష్ణ మాట్లాడారు. సున్నపు రాయి పరిశ్రమలకు కేంద్రంగా విలసిల్లిన పిడుగురాళ్ల పరిశ్రమ ప్రస్తుతం కష్టాల్లో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

1995 నుంచి డిమాండ్ లేక ఈ పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, దీనికితోడు కరోనా సమయంలో ముడి పదార్థాల ధరల పెరుగుదలతో పరిస్థితులు మరింత దిగజారాయని వాపోయారు. 2021లో టన్ను బొగ్గు ధర రూ.11,200 కాగా, ఇప్పుడది రూ.14,700కి పెరిగిందని, 2020లో పెట్‌కోక్ ధర టన్నుకు కేవలం రూ.8,500 ఉండగా, ఇప్పుడు టన్నుకు రూ.18,500కి చేరుకుందని తెలిపారు. బొగ్గు, పెట్‌కోక్ లభ్యత కూడా ప్రధాన సమస్యగా మారడంతో తయారీదారులు సున్నం పొడి తయారీలో టన్నుకు రూ.400-500 నష్టపోతున్నట్లు ఎంపీ శ్రీకృష్ణ వివరించారు. సున్నపురాయి పరిశ్రమను ఆదుకోవడానికి కేంద్రం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement