Monday, April 29, 2024

స్పీడ్ పెంచిన జ‌గ‌న్ – అమ‌రావ‌తిలో ప‌ట్టాల పంపిణీకి సిద్ధం

అమరావతి, ఆంధ్రప్రభ: రాజధాని ఆర్‌ -5 జోన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ప్రభుత్వానికి ఒకింత ఊరట కలిగించింది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వటం ఓ శుభ పరిణామంగా ప్రభుత్వ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.. ఈ వ్యవహారంలో ఓ అడుగు ముందుకే వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.. ముందుగా నిర్దేశించిన ప్రకారం గురువారం పట్టాలు పంపిణీ చేయాల్సి ఉండగా సుప్రీం ఆదేశాలను ధృవీకరణపత్రాలపై ముద్రించాలని స్పష్టం చేయటంతో ఈనెల 26వ తేదీకి ముహూర్తం వాయిదా పడింది..

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించే యోచనలో అధికారులు ఉన్నారు. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టులో వాదనలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి న్యాయ నిపుణులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. రాజధాని అమరావతి కేసులతో ఈ వ్యాజ్యం ముడిపడి ఉన్నందున భవిష్యత్‌ పరిణామాలపై చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. పేదలకు పూర్తి స్థాయిలో ఇళ్ల పట్టాలు పంపిణీచేయటంతో పాటు గృహనిర్మాణం కూడా చేపట్టాలనే భావనతో ప్రభుత్వం ఉంది.. ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 1.80 లక్షల చొప్పున అందించాల్సి ఉంది. అయితే సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్రం ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుందా లేదా అనే విషయమై సస్పెన్స్‌ నెలకొంది. సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 41, 43 ప్రకారం పేదల నివేశన స్థలాలకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఇంతకు ముందే చట్ట సవరణలు తీసుకొచ్చిన సంగతి విదితమే.

మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధంగా భూ సేకరణ జరపలేదని ఖాళీగా ఉన్న భూములను ప్రజా ప్రయోజనాలకు వినియోగిస్తే తప్పేంటనేది అధికార పార్టీ నేతల వాదన. అమరావతిలో ఆర్‌-5 జోన్‌కు సంబంధించి ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో 50,004 మంది నిరుపేదలకు పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల పరిధిలో ఇందుకు సంబంధించి 24 లేఅవుట్లు సిద్ధంగా ఉన్నాయి.. తుది తీర్పు అనంతరం తిరిగి సకల హక్కులతో మరోసారి పట్టాలు పంపిణీ చేస్తారా లేక ప్రస్తుతం ఇచ్చిన వాటినే కొనసాగించాలా అనే విషయమై స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా రాజధాని అమరావతి వ్యవహారం సుప్రీంకోర్టులో ఇప్పుడే తేలే సూచనలు కనిపించటంలేదు.. ప్రస్తుతం అమరావతి కేసులు విచారిస్తున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ మరికొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయనుండటంతో మరో ధర్మాసనం ముందుకు అమరావతి వ్యాజ్యాలు విచారణకు బదలాయించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్‌ వ్యూహంపై ముఖ్యమంత్రి జగన్‌ న్యాయ నిపుణులను అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు ఆర్‌-5 జోన్‌లో పట్టాలను వ్యతిరేకిస్తున్న అమరావతి రైతుల జేఏసీ నేతలు మాత్రం రాజధాని వ్యాజ్యాలు విచారణకు వచ్చేంత వరకు వేచి చూడా లా లేక ప్రత్యక్ష ఆందోళన చేపట్టాలా అనే విషయమై భవిష్యత్‌ కార్యాచరణను నిర్దేశించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఇళ్ల పట్టాల పంపిణీని ఏ రకంగా అయినా అడ్డుకోవాలనే భావనతో ఉన్నారు.ఆర్‌-5 జోన్‌ పారిశ్రామిక అవసరాలకు నిర్దేశించిందని ఇక్కడ పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీచేయడం ద్వారా భవిష్యత్తులో మురికివాడల్లా మారే ప్రమాదం లేకపోలేదని ఈ విషయాన్ని స్వయంగా లబ్దిదారులకు వివరించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. నామ్‌కే వాస్తేగా పంపిణీ చేసే ఇళ్ల పట్టాలు చెల్లవని భవిష్యత్తులో నష్టపోతారని అర్హులకు వివరించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఓ విడత పట్టాలు పంపిణీచేస్తే భవిష్యత్తులో న్యాయ, సాంకేతికపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు లేకపోలేదని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంకా ఇళ్లపట్టాలు పంపిణీకి నోచుకోక ముందే సుప్రీంకోర్టులో ఆర్‌-5 జోన్‌ వాదనల సందర్భంగా లబ్దిదారుల తరుపు న్యాయవాదులు తాము ఈ వ్యవహారంలో ఇంప్లీడ్‌ అవుతున్నట్లు ధర్మాసనం దృష్టికి తేవటమే ఇందుకు నిదర్శనం. దీంతో ఒక విడత పట్టాల పంపిణీ అయితే భవిష్యత్తులో మరిన్ని కేసులు దాఖలయ్యే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. మొత్తంగా సుప్రీం ఆదేశాలు ఏ పరిణామాలకు దారితీస్తాయనేది అంతటా ఉత్కంఠభరితంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement