Sunday, April 28, 2024

Agri Mafia – డ్ర‌గ్స్ రాకెట్‌! బ్రెజిల్ నుంచి విశాఖ‌కు స‌ప్ల‌య్‌

ఆక్వా ముసుగులో కొత్త‌ర‌కం దందా
బ‌య‌ట‌ప‌డ్డ మాఫియా యాక్టివిటీస్‌
ఇన్ యాక్టివ్ డ్రై ఈస్టుతో ఈజీగా ట్రాన్స్‌పోర్టు
అగ్రీ ప్రొడక్ట్ ముసుగులో ఇంటర్నేషనల్ స్మగ్లింగ్
భారత్‌లో వెలుగులోకి వ‌చ్చిన న‌యా డ్రగ్ దందా
ఈ ఎత్తుగ‌డ‌ల‌తో నివ్వెర‌పోతున్న ప్ర‌పంచ దేశాలు
ఏపీని తాకిన‌ కోకైన్ దిగుమతి సెగ..
పొలిటికల్ వార్‌లో కొత్త ఆయుధం

(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – డ్రగ్స్ ..అదే మాదక ద్రవ్యాలు.. కోకైన్, హెరాయిన్ పేర్లు వినపడగానే.. సినీ సెలబ్రిటీస్ గుర్తుకు వస్తారు. తెలంగాణలో సినీ పరిశ్రమకు కేంద్రం కావటంతో.. మాదక ద్రవ్యాల వ్యాపారం జోరుగా సాగుతుంది. అయితే.. ప్రతి సారి డ్రగ్స్ ముఠా దొరకటం ఆలస్యం.. నైజీరియా పెడ్లర్స్‌ను ప‌ట్టుకుని పోలీసులు అరెస్టు చూపిస్తారు. సినీ హీరోలు, బంధువులు, రాజకీయ ప్రముఖుల బిడ్డలు, పోలీసుల ఉన్నతాధికారుల బంధువులు తెరమీదకు రావటం.. మీడియాలో కథలు కథలు మార్మోగటం ఇప్ప‌టిదాకా తెలిసిందే. కానీ, ఇప్పుడు ఏపీ ఆర్థిక రాజ‌ధానిని కేంద్రంగా చేసుకుని చేస్తున్న న‌యా దాందా వెలుగులోకి వ‌చ్చింది. తెలంగాణలో డ్రగ్స్ కలకలం రేపితే.. ఆంధ్రాలో డ్రగ్స్ దిగుమతి కేసులు కలవరం సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారం వెనుక రాజకీయ అండ ఉన్న‌ద‌నే కథలు వినిపిస్తున్నాయి. కొన్నాళ్ల కిందట గుజరాత్‌లో ఓ షిప్‌లో ₹500 కోట్ల విలువ చేసే కొకైన్ దొరికింది. దాని విలువ రూ.25వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇక.. గుజరాత్ ఓడరేవుకు, కాకినాడ రాజకీయ నాయకుడికి సంబంధం కూడా ప్రచారంలోకి వచ్చింది. తాజాగా ఏపీలో అధికార, పత్రిపక్ష పార్టీల మధ్య ఈ ఆరోపణలు, పత్యారోపణలు జోరందుకున్నాయి. తాజాగా విశాఖపట్నంలో 25 టన్నుల కొకైన్ మిక్సిడ్ డ్రై ఈస్ట్ లభించడంతో ఇప్పడు ఏపీ పేరు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగిపోతోంది.

ఈ డ్రై ఈస్ట్కు ఇంత పాపులారిటీ దేనికి?

డ్రై ఈస్ట్ పదార్థం అంటే నిజానికి ఓ వ్యర్థ పదార్థంలో ఉత్పత్తి. కుళ్లిన తియ్యని పండ్లు, ఆహార పదార్ధాల నుంచి డ్రైఈస్ట్ తయారవుతుంది. ఈ డ్రైఈస్ట్కి ఆంధ్రపద్రేశ్ ఆక్వా కంపెనీకి సంబంధం ఏమిటీ? యూరప్ కంట్రీల్లో మిగిలిన ఆహార పదార్థాలను ఉచితంగా ఇచ్చేస్తారు. ఈ పదార్ధాల నుంచి డ్రైఈస్ట్ తయారు చేసిన కంపెనీలు చాలా చౌకగా విక్రయిస్తాయి. దీంతో ఐరోపా దేశాల నుంచి డ్రైఈస్ట్ను భారతీయ కంపెనీలు దిగుమతి చేసుకుంటాయి. ఎందుకంటే… పశువుల మేతకు, చేపలు, రొయ్యల మేతకు డ్రైఈస్ట్ను ఉపయోగిస్తారు. ఈ డ్రైఈస్ట్లో ప్రొటీన్లు, సీ విటమిన్లు, భాస్వరం, అమినో ఆమ్లాలు ఉంటాయి. అంతే కాదు, డ్రైఈస్టును ఆల్కాహాల్ తయారీలోనూ వినియోగిస్తారు. అంటే బేవరేజెస్ కూడా డ్రైఈస్ట్ కోసం క్యూకడతాయన్న మాట.

ఇంతకీ విశాఖలో దొరికిన డ్రైఈస్ట్ సంగతేంటీ?

బ్రెజిల్ నుంచి విశాఖపట్నం చేరుకున్న ఈ డ్రైఈస్ట్ ఏపీలో వినియోగం ఎక్కువ. సాధారణంగా ఆక్వాకల్చర్లో వినియోగం కావటంతో.. డ్రైఈస్ట్ దిగుమతిపై అంతగా నిఘా ఉండదు. వ్యవసాయ రంగంలో అనుబంధ పరిశ్రమలకు అవసరమైన ఉత్పత్తి కావటంతో దేశీయ నిఘా వ్యవస్థ పట్టించుకోలేదు. ఇంటర్ పోల్ నిఘాలో డ్రైఈస్ట్ ముసుగులో డ్రగ్స్ రవాణ కథ వెలుగు చూడటంతో యావత్ భారత దేశం కంగుతింది. నిన్న విశాఖలో ఇన్ యాక్టివ్ డ్రైఈస్ట్లో కోకైన్ జాడ కనిపించగా… శుక్రవారం హైదరాబాద్‌లో సుమారు రూ. 9 కోట్ల విలువ చేసే కోకైన్ దొరికింది. ఈ కోకైన్ కూడా బ్రెజిల్ నుంచే డ్రైఈస్ట్ రూపంలో హైదరాబాద్‌కు చేరిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ యాక్టివ్ డ్రైఈస్ట్ ను దిగుమతి చేసిన సంధ్యా ఎక్స్ పోర్టర్స్ చుట్టూ డ్రగ్స్ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ ప్రతినిధులను సీబీఐ ప్రశ్నించింది. ఇక దర్యాప్తును ముమ్మరం చేస్తోంది.

- Advertisement -

కాకినాడ‌లోని సంధ్య అక్వాలో సిబిఐ త‌నిఖీలు

కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ పరిశ్రమలో సీబీఐ దాడులు చేపట్టింది. ఉదయం 11 గంటల నుంచి ఏడుగురు సీబీఐ అధికారుల బృందం వివిధ భాగాల్లో తనిఖీలు చేశారు. ఇప్పటికే పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది, కూలీల నుంచి వివరాలు సేకరించారు. ల్యాబ్‌ను పరిశీలించి ఫోరెనిక్స్ బృందాన్ని పిలిపించారు. వైజాగ్ నుంచి ఫోరెన్సిక్‌ బృందం పరిశ్రమకు చేరుకుంది. ల్యాబ్‌లో ఉన్న వివిధ శాంపిల్స్ సేకరించి విశాఖకు తరలించినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement