Wednesday, November 29, 2023

Delhi | ఉద్యోగానికి రాజీనామా చేసి మాట్లాడాలి.. అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలుపై కనకమేడల

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలా మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. మంగళవారం ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై పొన్నవోలు చేసిన వ్యాఖ్యలు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించేలా ఉన్నాయన్నారు.

వైఎస్సార్సీపీ నేతలకు న్యాయస్థానాలపై గౌరవం లేదని, ఇప్పుడు అదనపు అడ్వొకేట్ జనరల్ కూడా అలాగే వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. న్యాయమూర్తులను కించపరిచేలా ఆయన మాటలున్నాయని, పార్టీ నేతలా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేయాలని హితవు పలికారు. పొన్నవోలుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ తామ న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు.

- Advertisement -
   

మరోవైపు సీనియర్ నేత బోండా ఉమ మాట్లాడుతూ.. ఈ కేసులో సీఐడీ ఒక్క ఆధారమైనా పట్టుకోగలిగిందా అని ప్రశ్నించారు. ఆధారాలు చూపలేదని హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్‌లోనే స్పష్టంగా పేర్కొందని అన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతలను ప్రజలు గ్రామాల్లోకి అడుగుపెట్టనీయడం లేదని, అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలకు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఇది చూసి ఓర్వలేకనే తప్పుడు కేసులు పెట్టి తమ పార్టీ అధినేత చంద్రబాబును తప్పుడు కేసుల్లో ఇబ్బందులకు గురిచేస్తున్నారని బోండా ఉమ ఆరోపించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement