Sunday, April 28, 2024

Flash: ఏపీ సర్కార్ ఇచ్చిన నోటీసుపై గట్టిగా రిప్లై పంపిన ఎబి వెంకటేశ్వరావు

మీడియా సమావేశం నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన నోటీసుపై సీనియర్ ఐపిఎస్ ఎబి వెంకటేశ్వరావు గట్టి రిప్లై పంపారు. వ్యక్తిత్వ దూషణలు, ఆరోపణలపై స్పందించే అవకాశం ఆలిండియా సర్వీస్ రూల్స్ కల్పించాయని ఎబి వెంకటేశ్వరరావు అన్నారు. తనకు ఇచ్చిన నోటీసులోనే పేర్కొన్న…. రూల్ 17 నియమానికి అనుగుణంగానే తాను మీడియాతో మాట్లాడినట్లు తెలిపారు. తాను ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉండగా పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగించలేదని మాత్రమే చెప్పానని లేఖలో వివరించారు. ఆలిండియా సర్వీస్ రూల్స్ 6 ప్రకారం అధికారిక అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందన్నారు. రూల్ నెంబర్ 3 ప్రకారం అధికారులు పారదర్శకంగా, జవాబుదారీతనంగా ఉండాలన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించకూడదని మాత్రమే రూల్స్ చెపుతున్నాయని, మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదని చెప్పారు. గౌరవానికి భంగం కలిగించేలా తనపై, తన కుటుంబంపై ఆరోపణలు చేస్తే స్పందించకుండా ఎలా ఉంటానని ప్రశ్నించారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం లభించిన ప్రాధమిక హక్కు మేరకు వ్యక్తిగత ఆరోపణలపై వివరణ ఇచ్చానని చెప్పారు. మీడియా సమావేశం పెడుతున్న విషయాన్ని ముందుగానే ప్రభుత్వానికి తెలిపానని స్పష్టం చేశారు. రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి తనపై చేసిన ట్వీట్ ను కూడా వివరణలో ఎబి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

కాగా, నిన్న ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం మెమో జారీ చేసింది. గత నెల మార్చి 21వతేదీన ఏబీ వెంకటేశ్వరరావు పెట్టిన ప్రెస్ మీట్ ను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. వివరణ కోరుతూ సీఎస్ సమీర్ శర్మ షోకాజ్ నోటీసు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్ మీట్ పెట్టారంటూ నోటీసు జారీ చేశారు. వారంలోగా వివరణ ఇవ్వకపోతే చర్యలుంటాయని సీఎస్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement