Sunday, May 5, 2024

గోదావరి వరదలకు 1.53 కోట్లు నష్టం.. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు

అమరావతి, ఆంధ్రప్రభ : వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ పునరుద్ధరణ పనులు పూర్తిచేయాలని ఇంధన శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. ఈమేరకు బుధవారం ఆయన తూర్పు ప్రాంత విద్యుత్‌ సంస్థ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంధన శాఖ కార్యదర్శి కే విజయానంద్‌ విద్యుత్‌ పునరుద్ధరణ పనుల పురోగతిని మంత్రికి వివరించారు. వరదలు, తుఫానులు మరియు భారీ ఈదురుగాలులు మొదలైన విపత్తుల తర్వాత దాని ప్రభావాన్ని తగ్గించడానికి యుద్ధ ప్రాతిపదికన స్వల్ప మరియు దీర్ఘకాలిక విద్యుత్‌ పునరుద్ధరణ కార్యకలాపాలకు మెరుగైన ప్రణాళికను రూపొందించాలన్నారు. ఇటువంటి విపత్తుల సమయంలో జరిగే నష్టాలను నివారించేందుకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అవసరమని మంత్రి అధికారులను ఆదేశించారు.

ముందస్తుగా అప్రమత్తంగా ఉండటం, శాశ్వత పరిష్కారాలను అన్వేషించడం ద్వారా ఆర్ధిక పరిస్థిపై కూడా ప్రతికూల ప్రభావం ఉండదని చెప్పారు. గోదావరి వరద ముంపు గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడుతున్నామని విద్యుత్‌ శాఖ కార్యదర్శి కే విజయానంద్‌ తెలిపారు. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారని చెప్పారు.

అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి సహా 5 జిల్లాల్లోని 12 మండలాల్లోని 415 గ్రామాలు వరదల కారణంగా విద్యుత్‌ వ్యవస్థలు దెబ్బతిన్నాయని ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ సంతోషరావు తెలిపారు. ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలో 250 కిలోమీటర్ల మేర 33కేవీ లైన్‌తో కూడిన 33/11కేవీ సబ్‌స్టేషన్లు 8, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు 4022, 11కేవీ ఫీడర్లు 46, వ్యవసాయ కనెక్షన్లు 5453, వ్యవసాయేతర కనెక్షన్లు 71443 దెబ్బతిన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు రూ.1.53 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నామని సీఎండీ తెలిపారు. గత మూడు రోజుల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో 35936కు పైబడి గృహ కనెక్షన్లు పునరుద్ధరించబడ్డాయన్నారు. పూర్తిగా నీట మునిగిన మండలాలైన చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, ఏఎస్‌ఆర్‌ జిల్లాలోని ఏటపాక, ఏలూరు జిల్లాలోని కుకునూరు, వేలరుపాడు మండలాలకు చెందిన దాదాపు 35,507 డొమెస్టిక్‌ సర్వీసులను నేటికీ పునరుద్ధరించలేకపోయామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement