Friday, April 26, 2024

Delhi: తెలంగాణలో విఫల ప్రభుత్వం, రాష్ట్రం వైఖరితో రైతులకు, పేదలకు అన్యాయం: పీయూష్‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలపట్ల ఏమాత్రం కనికరం లేకుండా వ్యవహరించిందంటూ దుయ్యబట్టారు. బుధవారం ఢిల్లీలోని కృషి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన పీయూష్ గోయల్, తెలంగాణలో అన్న యోజన పథకం కింద ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, రాష్ట్రంలో వరి ధాన్యం (బియ్యం) సేకరణ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద దేశంలో పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న ఆహార ధాన్యాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెల నుంచి అందించలేదని ఆరోపించారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక వైఫల్య ప్రభుత్వం ఉందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అన్న యోజన పథకం కింద పంపిణీ చేయాల్సి ఉచిత రేషన్ విషయంలో తాము అనేక పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి, లేఖలు రాసినా సరే ఫలితం లేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో మరో దారి లేక ‘ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.సీ.ఐ)’ సెంట్రల్ పూల్ కింద సేకరించాల్సిన వరి ధాన్యాన్ని నిలిపివేయాల్సి వచ్చిందని గోయల్ అన్నారు. నిరుపేదల విషయంలో ఇంత కంటే అన్యాయం మరొకటి ఉండదని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభద్రతాభావంతో ప్రధాని, కేంద్ర మంత్రులపై నోటికొచ్చినట్టు అమర్యాదకరంగా అసభ్యపదజాలంతో దూషణలకు దిగారని ధ్వజమెత్తారు. తమపై నోరుపారేసుకుంటే పేదల కడుపు నిండదని, రైతులకు సైతం న్యాయం జరగదని పీయూష్ గోయల్ హితవు పలికారు.

ఎఫ్.సీ.ఐ బృందాలు జరిపిన తనిఖీల్లో రాష్ట్రంలోని అనేక మిల్లుల్లో అవకతవకలు గుర్తించామని, అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆయనన్నారు. మిల్లుల్లో జరుగుతున్న అక్రమాలపై తమకు ఫిర్యాదులు రావడంతో అధికారులు ప్రత్యక్ష తనిఖీలు జరిపారని అన్నారు. వీటిపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపే అవకాశం ఉంటే పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఓవైపు పేదలకు బియ్యం పంపిణీ చేయకపోవడం, మరోవైపు మిల్లర్ల అక్రమాలపై చర్యలు తీసుకోకపోవడం, ధాన్యం సేకరణలో పాటించాల్సిన నిబంధనలు అమలు చేయకపోవడం వంటి కారణాలను పరిగణలోకి తీసుకుని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం (బియ్యం) సేకరణ నిలిపివేసిందని కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు.

తాజాగా జూన్ నెలలో అన్న యోజన కింద ఉచిత రేషన్ పంపిణీ జరిపినట్టు రాష్ట్ర ప్రభుత్వం సమాచారమిచ్చిందని, ఈ నేపథ్యంలో నిలిచిపోయిన ధాన్యం సేకరణ కొనసాగించాలంటూ ఎఫ్.సీ.ఐకి ఆదేశాలు జారీ చేశామని పీయూష్ గోయల్ వెల్లడించారు. జులై నెల కోటా రేషన్ ప్రజలకు ఇంకా పంపిణీ చేయాల్సి ఉందని, అయితే బకాయిపడ్డ ఏప్రిల్, మే నెల రేషన్ కూడా పంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని ఆయన చెప్పారు. జులై నెలలో ఆ నెల కోటాతో పాటు ఏప్రిల్ కోటాను, ఆగస్టు నెలలో ఆ నెల కోటాతో పాటు మే నెల కోటాను సర్దుబాటు చేయాల్సిందిగా సూచించినట్టు వెల్లడించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం విధిగా అన్న యోజన పథకాన్ని అమలు చేస్తుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గత కొన్ని నెలలుగా అన్న యోజన పథకం కింద జరగాల్సిన రేషన్ పంపిణీ జరగలేదని, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడామని కేంద్ర మంత్రి తెలిపారు. ఏపీ సర్కారు పంపిణీ మొదలుపెట్టనున్నట్టు సమాచారమిచ్చిందని అన్నారు. లేనిపక్షంలో ఆ రాష్ట్రంలోనూ ధాన్యం సేకరణ నిలిపేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీ చేయకపోయినా.. పర్యవసానాలు ఇలాగే ఉంటాయని ఆయన హెచ్చరించారు. తాము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు పెంపొందించేందుకు ప్రయత్నిస్తుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిని చెడగొట్టేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

- Advertisement -

పాడైన బియ్యం, నూకల నుంచి ఇథనాల్ తయారు చేసే యూనిట్లను నెలకొల్పేందుకు దరఖాస్తులు ఆహ్వానించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు సూచించిందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. ఇథనాల్ తయారీ ద్వారా ఓవైపు రైతులకు న్యాయం చేయవచ్చని, మరోవైపు పర్యావరణానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేయవచ్చని అన్నారు. దేశ దిగుమతుల్లో అత్యధికం క్రూడ్ ఆయిలే అన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. ఇథనాల్ బ్లెండింగ్ పెంచుకుంటూ వెళ్లడం ద్వారా క్రూడ్ మీద ఆధారపడడం తగ్గుతుందని, తద్వారా దిగుమతుల భారం తగ్గించుకోవచ్చని అన్నారు. ఇన్ని ప్రయోజనాలున్న ఇథనాల్ యూనిట్ల ఏర్పాటు గురించి చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని పీయూష్ గోయల్ అన్నారు.

మోదీకి పేరొస్తుందనే బియ్యం పంపిణీ నిలిపేశారు: కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ కారణంతో బియ్యం పంపిణీ నిలిపేసిందో అర్థం కావడం లేదని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి, అనంతరం తెలుగు మీడియా కోసం తెలుగులో వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్న యోజన పథకం కింద జరుపుతున్న ఉచిత బియ్యం పంపిణీతో ప్రధాని మోదీకి, భారతీయ జనతా పార్టీకి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే పంపిణీ నిలిపేసి ఉంటారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరితో రైతులకు చేటు చేస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఓవైపు బాయిల్డ్ రైస్ కేంద్రానికి ఇవ్వబోమంటూ రాసిచ్చి, మరోవైపు రాద్ధాంతం చేశారని మండిపడ్డారు.

ముడి బియ్యం ఎంతిచ్చినా తీసుకుంటామని కేంద్రం చెబుతుంటే, ఢిల్లీ వచ్చి ఎందుకు ధర్నా చేశారో అర్థం కాలేదని అన్నారు. ధర్నా అనంతరం నూకలైనా సరే తామే కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. వర్షానికి పాడైన ధాన్యం సేకరణ గురించి ప్రశ్నించగా.. రైతుల దగ్గర కొనుగోలు జరిపేది రాష్ట్ర ప్రభుత్వమేనని, కొన్ని ధాన్యాన్ని మిల్లు పట్టి బియ్యంగా మార్చి ఎఫ్.సీ.ఐకి అందజేస్తారని, ఈ క్రమంలో అయ్యే ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని గుర్తుచేశారు. సకాలంలో రైతుల దగ్గర ధాన్యం కొనుగోళ్లు జరపకపోవడం వల్లనే ధాన్యం మొలకలెత్తే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. మిల్లర్ల అక్రమాల గురించి మాట్లాడుతూ… మిల్లులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయని, వాటిపై చర్య తీసుకునే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అందుకే తమ దృష్టికి వచ్చిన అక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని కోరామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.

మిల్లర్ల అక్రమాలను అదుపు చేయడంలో వైఫల్యం
కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించడానికి ముందు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ ఓ నోట్ విడుదల చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. పుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు జరిపిన ప్రత్యక్ష తనిఖీల్లో రాష్ట్రంలోని అనేక మిల్లుల్లో అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నట్టు గుర్తించామని నోట్‌లో పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లను అదుపు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మొత్తం 40 మిల్లుల్లో 4,53,896 బియ్యం సంచులు మాయమవడాన్ని గుర్తించామని, అక్రమాలకు మిల్లర్ల జాబితాను మార్చి 31న తెలంగాణ ప్రభుత్వానికి పంపించామని తెలిపారు.

మళ్లీ మే 21న 63 మిల్లుల్లో 1,37,872 బియ్యం సంచులు మాయమైన అంశాన్ని గుర్తించి, ఆ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. 593 మిల్లుల్లో లెక్కించడానికి వీల్లేకుండా ధాన్యం సంచులను నిల్వచేశారని పేర్కొన్నారు. అన్న యోజన కింద ఏప్రిల్ – మే నెలల వాటా కింద 1.90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని, అయినా సరే ప్రజలకు పంచకుండా వ్యవహరించిందని నోట్‌లో పేర్కొన్నారు. మిల్లర్ల అక్రమాలపై చర్యలు తీసుకోకపోవడం, అన్న యోజన కింద ఆహార ధాన్యాల పంపిణీ చేపట్టకపోవడం, ధాన్యం సేకరణలో నియమ నిబంధనలు అమలుచేయకపోవడం వంటి కారణాలతో ఎఫ్.సీ.ఐ ధాన్యం సేకరణ నిలిపేసిందని అందులో వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement