Monday, April 29, 2024

Spl Story – పౌష్టికాహారంతోనే ఆరోగ్య భార‌త్

న్యూఢిల్లి , ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి.. స్థూల జాతీయోత్పత్తిలో భారత్‌ గతేడాది ఇంగ్లాండ్‌ను దాటి ప్రపంచ అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో ఐదోదిగా నిల్చింది. 2030 నాటికి భారత స్థూల జాతీయోత్పత్తి విలువను ఐదు ట్రిలియన్‌ డాలర్లకు పెంచాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. అప్పటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానానికి భారత్‌ ఎగబాకు తుందన్నది అంచనా. అలాగే 2050 నాటికి భారత్‌ను ప్రపంచ అగ్రదేశంగా మార్చేస్తా మంటూ పాలకులు తరచూ ప్రకటనలు చేస్తు న్నారు. గత కొన్ని మాసాలుగా జీఎస్‌టి వసూళ్ళు అనూహ్యంగా పెరుగుతున్నా యి. నెలనెలా 15 నుంచి 20 శాతం వసూళ్ళ వృద్ధి నమోదౌతోంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కుబేరులున్న దేశంగా కూడా భారత్‌ అవతరించింది. ఓ దశలో ప్రపంచ సంపన్నుల జాబితాలో భారతీయులు అగ్రభాగాన నిల్చారు. తిరిగి ఆ స్థానం కోసం ఈ దేశానికి చెందిన పలువురు సంపన్నులు పోటీలు పడుతున్నారు.

ఇదంతా చూసే, విదేశీయులకు భారత్‌లో ప్రజలు సర్వసౌఖ్యాల్తో ఆరోగ్యంతో జీవిస్తున్నట్లు భావిస్తారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నం. ఇక్కడ వేగంగా సంపద సృష్టించబడుతున్నా దాని పంపిణీలో తీవ్ర అసమానతలు భారతీయుల్లో మెజార్టీ ప్రజల్ని రోజురోజుకు దారిద్య్రంలోకి నెడుతున్నాయి. ఇక్కడ అర్ధాకలితో అలమటించే వారి సంఖ్య 28 కోట్లకు చేరింది. దేశంలో వివిధ రోగగ్రస్తుల సంఖ్య 21 కోట్లుగా నమోదైంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ క్షయవ్యాధిగ్రస్తులపై విడుదల చేసిన జాబితా ఈ దేశంలో దారిద్య్రం, పౌష్టికాహార లోపాల్ని ఎత్తి చూపుతోంది.

ప్రపంచంలోనే ఆర్థిక, సాంకేతిక, సామాజిక రంగాల్లో భారత్‌ అత్యంత వేగంతో దూసుకుపోతోంది. అదే సమయంలో ఈ దేశంలో క్షయ వ్యాధి తిరిగి విస్తరిస్తోంది. స్వాతంత్య్రానంతరం క్షయ వ్యాధి నివారణ కోసం ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేశాయి. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారం కూడా లభిస్తోంది. అయితే ప్రజల్లో పౌష్టికాహార లోపం, తగినంత ఆహారం అందుబాటులో లేని పేదరికాలు ఈ దేశంలో తిరిగి క్షయ వ్యాధి పుంజుకునేందుకు కారణమౌతున్నాయి. 2022లో ప్రపంచంలోనే అత్యధిక క్షయవ్యాధి గ్రస్తుల నమోదు భారత్‌లోనే జరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా నమోదౌతున్న కేసుల్లో 87 శాతం కేవలం 30 దేశాల్లోనే ఉంటున్నాయి. ఈ 30 దేశాల్లోనూ అగ్రస్థానంలో భారత్‌ ఉంది. గతేడాది ప్రపంచ వ్యాప్తంగా దాదా పు 81 లక్షల వ్యాధి కేసులు నమోదైతే ఇందులో 28 లక్షలకు పైగా భారత్‌లోనే ఉన్నాయి. అలాగే గతేడాది క్షయ కారణంగా 3 లక్షల మందికి పైగా మరణించారు. భారత్‌ తర్వాత ఇండోనేషియా, చైనా, పాకిస్థాన్‌, నైజీరియా, బంగ్లాదేశ్‌, కాంగో రిపబ్లిక్‌లలో క్షయవ్యాధి గ్రస్తులు అధికంగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 2022 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి లక్షమందిలో 133 మంది క్షయవ్యాధిగ్రస్తులుంటే భారత్‌లో మాత్రం ఇది 199గా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. అలాగే క్షయవ్యాధి కారణంగా మరణాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ప్రతి వందకు 5.8 ఉంటే భారత్‌లో ప్రతి వందకు 12మంది మరణిస్తున్నారు.

ఆహార అసమతుల్యతే ప్రధాన కారణం
క్షయ విస్తరణకు పలు కారణాలున్నాయి. వాతావరణ సంక్షోభం, కాలుష్యాలు కూడా క్షయ విస్తరణకు కారణాలే. అయితే ప్రధాన కారణం ఆహారంలో సమతుల్యత లోపించడమే. క్షేయ సుదీర్ఘ కాలంగా భూగోళంపై విస్తరించిన వ్యాధి. ఇది 17వేల సంవత్సరం పూర్వం నుంచే ఉనికిలో ఉంది. భారత్‌లోనూ చారిత్రక కాలంలో క్షయ ప్రస్తావన కనిపిస్తోంది. గతంలో క్షయ వ్యాధిగ్రస్తుల్ని ఊరికి దూరంగా ఉంచేవారు. ఇందుకోసం మెరుగైన వాతావరణంగల ప్రదేశాల్లో ప్రత్యేకంగా శానిటోరియంలను ఏర్పాటు చేసేవారు. కాలుష్య రహిత వాతావరణంలో ఈ వ్యాధిగ్రస్తుల్ని ఉంచి వారికి పౌష్టికాహారాన్నందించేవారు. ఔషధాల్తో పాటు బలమైన ఆహారం ద్వారానే ఈ వ్యాధి నివారణ సాధ్యం.

అయితే గతకొన్నేళ్ళుగా ఆధునిక వైద్యం అందుబాటులోకొచ్చింది. బహుళ విధాన చికిత్స ద్వారా క్షయను వేగంగానే తగ్గించగలుగుతున్నారు. 2020నాటికి భారత్‌ను క్షయరహిత దేశంగా ప్రకటించాలని ఉవ్విళ్ళూరారు. కుష్టు, పోలియోల తరహాలోనే క్షయపై కూడా ప్రభుత్వం పెద్దెత్తున యుద్ధం ప్రకటించింది. అవగాహన కార్యక్రమాల్తో పాటు నివారణా చర్యలు చేపట్టింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం సఫలం కాలేదు. తిరిగి 2035 నాటికి దేశాన్ని క్షయరహితంగా తీర్చిదిద్దుతామంటూ కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా గర్భిణులనుంచి వృద్ధుల వరకు ఆహారాన్నిచ్చే పథకాల్ని అమలు చేస్తోంది. ఉచితంగా బియ్యాన్నిస్తోంది. అయితే క్షయ విస్తరణ నివారణకు ఈ మాత్రం సాయం ఏ విధంగానూ సరిపోవ డంలేదు. బియ్యాన్ని పంపిణీ చేసినంత మాత్రాన శరీరానికి అవసరమైన పోషకాలు లభించవు. కార్బొహై డ్రేట్‌ల వినియోగంతో జనం బరువు పెరుగుతున్నారు. వారి కొనుగోలు శక్తి క్షీణిస్తుండడతో కనీసం గుడ్లు కూడా కొని తినలేని ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్నిచ్చి బాధ్యత తీరిందని చేతులు దులుపుకుంటోంది. అంతకుమించి ప్రజల పోషకాహార అవసరాల్ని గుర్తించడం లేదు. వాటిని తీర్చే ప్రయత్నాలు చేయడంలేదు. ఇదే క్షయ విస్తరణకు కారణమౌతోంది. క్షయ ప్రధానంగా రెండు రకాలు. ఒకటి ఊపిరితిత్తులకు సోకుతుంది. మరొకటి శరీరంలోని ఏ ఇతర అవయవానికైనా పడుతుంది. ఈ రెండు రకాలు కూడా అంటువ్యాధులే. ఒకర్నుంచొకరికి వేగంగా వ్యాపిస్తాయి. రోగి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా కూడా ఈ వ్యాధి సోకుతుంది. దశాబ్దం క్రింత వరకు క్షయ విస్తరణకు హెచ్‌ఐవి రోగుల సంఖ్య పెరగడాన్ని ఓ సాకుగా చెప్పేవారు. కానీ హెచ్‌ఐవి తగ్గుముఖం పట్టిన అనంతరం కూడా క్షయ విస్తరణ నియంత్రణలోకి రాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కేవలం బియ్యమిచ్చి చేతులు దులుపుకోకుండా పేదలకవసరమైన పౌష్టికాహార సరఫరాకు ప్రత్యేక పథకాలు అమలు చేయాల్సిన అవసరాన్ని నిపుణులు నొక్కి చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement