Thursday, April 25, 2024

గుప్పుమంటున్న గంజాయి!

గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు
కార్మికులు,యువకులే లక్ష్యంగా వ్యాపారం
ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల సాగు
గంజాయి సాగు,రవాణాపై సీఎం కేసీఆర్‌ సీరియస్‌
కొరడా ఝళిపించేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు
రంగంలోకి పోలీసు,ఎక్సైజ్‌ శాఖ అధికారులు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది.. గుట్టుచప్పుడు కాకుండా కార్మికులు, యువకులే లక్ష్యంగా చేసుకొని విక్రయాలు సాగిస్తున్నారు.. దీనికితోడు మారుమూల ప్రాంతాల్లో గంజాయి సాగవుతున్నట్లు తెలుస్తోంది.. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి సాగు, రవాణా, విక్రయాలపై సీఎం కేసీఆర్‌ సీరియస్‌ అయ్యారు.. సాగు, విక్రయదారులపై కొరడా ఝుళిపించేందుకు ప్రత్యేక బందాల ఏర్పాటుకు ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో పోలీస్‌, ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో గంజాయి రవాణా, సాగుకు చెక పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రభన్యూస్‌ ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని కొన్ని ప్రాంతాలలో సాగు చేస్తున్నారు. ఇలా సాగుచేసిన గంజాయిని కొందరు అక్రమార్కులు దొంగచాటుగా పట్టణ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. జిల్లాలో గంజాయి వినియోగంకూడా జోరుగా సాగుతోంది. ముఖ్యంగా కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో గంజాయి వినియోగం అధికంగా ఉంటోంది. రాష్ట్రంలో గంజాయి వినియోగం అధికం కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రంగా స్పందించారు. మూడు రోజుల క్రితం పోలీసు, ఎక్సైజ్‌ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పలు ఆదేశాలు జారీచేశారు. అన్ని జిల్లాల్లో పోలీసు, ఎక్సైజ్‌ శాఖ అధికారులు గంజాయి సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ బృందాలు ప్రత్యేకంగా గంజాయి సాగుతో పాటు విక్రయాలపై దృష్టి సారిస్తుంది. ఇటీవల కాలంగా ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని దిగుమతి చేసుకుంటున్నారు. రైళ్లు, బస్సులు, సరకు రవాణా వాహనాలలో గంజాయిని దిగుమతి చేసుకుంటున్నారు. దీనిని స్థానికంగా ఉండే కార్మికులకు విక్రయిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతంలోని పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు, నాపరాయి గనులు, పాలిష్‌ యూనిట్లలో పనిచేస్తున్న కార్మికులకు పెద్దఎత్తున గంజాయిని విక్రయిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా కొందరు వ్యక్తులను నియమించుకుంటున్నారు. మూడుచక్రాల వాహనాలపై గ్రామాలకు తిరుగుతూ ఐస్‌ క్రీమ్‌లను విక్రయించే వారు, పాత ఇనుప సామాగ్రిని కొనుగోలు చేస్తామని చెప్పి గ్రామాలకు తిరిగే వారు ప్రతిరోజు కార్మికులకు గంజాయిని విక్రయిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో గంజాయి సాగు..అక్రమ రవాణా..వినియోగంపై కొరడా ఝుళిపించేందుకు జిల్లాలోని పోలీసు, ఎక్సైజ్‌ అధికారులు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement