Monday, May 6, 2024

చేనేతపై జీరో జీఎస్టీ విధించాలి, చేనేత మహావస్త్ర లేఖపై టీఆర్ఎస్ ఎంపీల సంతకాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : చేనేతపై జీరో జీఎస్టీ విధించాలంటూ దేశవ్యాప్తంగా తాము చేపడుతున్న ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోందని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం తెలిపింది. వివిధ రూపాలలో కేంద్ర ప్రభుత్వానికి చేనేత వర్గాల పక్షాన జీరో జీఎస్టీ డిమాండును తెలియజేస్తున్నామని చేనేత విభాగం నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సామాజికవేత్తలు, ఉద్యమకారులు, పార్లమెంటు సభ్యులు, వివిధ రాష్ట్రాల శాసనసభ, శాసన మండలి సభ్యుల సంతకాలతో చేనేత మహా వస్త్ర లేఖ రాస్తున్నామని చెప్పారు. దీనిపై ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తొలి సంతకం చేశారని వారు తెలిపారు.

సోమవారం ఢిల్లీలో చేనేత మహా వస్త్ర లేఖపై 12 మంది టీఆర్‌ఎస్ ఎంపీలు సంతకాలు చేశారు. సంతకాలు చేసిన వారిలో కె. కేశవరావు, నామా నాగేశ్వరరావు, కె.ఆర్. సురేష్ రెడ్డి, మాలోత్ కవిత, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేష్ నేత, బడుగుల లింగయ్య యాదవ్, రంజిత్ రెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డి, పసునూరి దయాకర్, పి.రాములు వున్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు కందగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, చేనేత విభాగం జాతీయ అధ్యక్షులు యర్రమాద వెంకన్న నేత, తెలంగాణ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు అవ్వారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement