Monday, April 29, 2024

NZB: మహిళ బిల్లు ఘనత బీఆర్ఎస్ దే… ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ సిటీ, సెప్టెంబర్ 25 (ప్రభ న్యూస్) : మహిళా బిల్లు ఘనత బీఆర్ఎస్ దేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అకుంఠిత పోరాటంతో కేంద్రం మహిళ బిల్లు ప్రవేశపెట్టినందుకు, నగర అభివృద్ధికి మంత్రి కేటీఆర్ రూ.60 కోట్లు ప్రకటించినందుకు నిజామాబాద్ నగరంలో కృతజ్ఞత ర్యాలీ సోమవారం నిర్వహించారు. ఈ కృతజ్ఞత ర్యాలీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు ఘన స్వాగతం పలికారు. మహిళా రిజర్వేషన్ల సాధన తర్వాత తొలిసారి నిజామాబాదుకు వచ్చిన కల్వకుంట్ల కవితకు బీఅర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఐటిఐ గ్రౌండ్ నుంచి కలెక్టర్ గ్రౌండ్ వరకు జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ…. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చే ముందు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం, నిజామాబాదులో పసుపు బోర్డు ఏర్పాటు చేయడంపై ప్రధానమంత్రి నిర్ణయాన్ని వెల్లడించాలన్నారు. మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ కు రూ. 42వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రకటించిన ప్రధాని తెలంగాణను ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు.

- Advertisement -

మహిళా బిల్లు ఆమోదం పొంది ప్రపంచంలో ఇతర దేశాల సరసన భారతదేశం నిలబడిందంటే అందుకు బీఆర్ఎస్ పార్టీయే కారణమని స్పష్టం చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెట్టడం మర్చిపోయిందని, వాళ్లను బీఆర్ఎస్ పార్టీ నిద్రలేపిందని తెలిపారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ కూడా తప్పనిసరిగా మాట్లాడే పరిస్థితిని బీఆర్ఎస్ తీసుకొచ్చిందన్నారు. ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోందని, 20ఏళ్ల కింద కాంగ్రెస్ కు ఆ తెలివి ఉంటే అప్పుడే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు న్యాయం జరుగుతుండేదని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కు ఆ తెలివి లేదని, అధికారం కోల్పోయిన తర్వాత బీసీలు గుర్తుకొచ్చారని విమర్శించారు.


తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ అన్నారని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తన స్వప్నమని సోనియాగాంధీ అన్నారని, కానీ అధికారంలోకి రావడం స్వప్నం ఉండవద్దని, తెలంగాణ దళితులు, మైనారిటీలు, బలహీన వర్గాలు, మహిళలు, యువకులు మరింత అభివృద్ధి చెందాలన్న స్వప్నం ఉండాలని సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి సూచించారు. తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగితే అన్ని వర్గాలు బాగుపడతాయన్నది సీఎం కేసీఆర్ స్వప్నమని స్పష్టం చేశారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో గత పదేళ్లుగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తుందని, తమ పార్టీ పాలనలో ఒక్క మతకల్లోలం కూడా జరగలేదని, ఒక చిన్న గొడవ కూడా జరగలేదని చెప్పారు.

దేశంలో ఎటువంటి పరిస్థితులున్నా కూడా తెలంగాణలో శాంతిభద్రతలు సజావుగా ఉన్నాయి కాబట్టే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయని వివరించారు. అభివృద్ధి ఒకటే కాదు ప్రజలకు ఆత్మగౌరవం ఉండాలన్న ఆలోచన తమ పార్టీదని, అందుకే సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ చేస్తుంటే ఏమి చేయని కాంగ్రెస్ పార్టీ వచ్చి తామే అధికారంలోకి వస్తామని అంటుంటే నవ్వాలో ఏడవాలో అర్థం అవడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, టీఎస్ డబ్ల్యూ సి డి సి చైర్మన్ ఆకుల లలిత, నగర మేయర్ దండు నీతో కిరణ్, జిల్లా జడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్, మాజీ మేయర్ ఆకుల సుజాత, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement