Monday, May 6, 2024

జయశంకర్ సార్ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి : మంత్రి ఎర్ర‌బెల్లి

ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా రాజేంద్ర నగర్ లోని టీఎస్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన చిత్రపటానికి పూమాల వేసి, పుష్పాంజలి ఘటించి రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు నివాళులు అర్పించారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. జ‌య‌శంక‌ర్ సార్‌ తెలంగాణ రాష్ట్ర సాధనకు చేసిన కృషిని స్మ‌రించ‌కోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. ప్రొఫెసర్ గా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సిద్ధాంత కర్తగా ప్రజల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నతుడు కొత్తపల్లి జయశంకర్ సార్ అన్నారు. 1952 లో జయశంకర్ సార్ నాన్ ముల్కీ ఉద్యమంలో, తర్వాత సాంబార్, ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో, ఆ తర్వాత 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. ఎవరూ మాట్లాడటానికి సాహసించని కాలంలోనే 1954 విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్ సార్ అని గుర్తు చేశారు.

విద్యార్థి దశలోనే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ 1954 లో ఫజల్ అలీ కమిషన్‌కు నివేదిక ఇచ్చిన ధైర్యశాలి జయశంకర్ సార్ అన్నారు. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్సార్సీ కమిషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించిన మేధావి కొత్తపల్లి జయశంకర్ అన్నారు. తెలంగాణ డిమాండ్‌ను 1969 నుంచి సునిశితంగా అధ్యయనం చేస్తూ, విశ్లేషిస్తూ రచనలు చేసారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర వాదనను, డిమాండ్ ను సాధనకు రాజకీయ ప్రక్రియ మార్గమని నిర్దేశించారు. అవన్నీ ఉద్యమకారులకు ఎంతగానో ఉపయోగ పడ్డాయి అన్నారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై జయశంకర్ సార్ కు ఉన్న పరిజ్ఞానం ఎంతో మందికి స్ఫూర్తిని ఇచ్చింది అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యాప్తి చేయడంలో వారి పాత్ర మరవలేనిది అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ కు మార్గదర్శిగా తోడ్పాటు అందించి సిద్ధాంత కర్తగా చరిత్రలో నిలిచిపోయారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కెసిఆర్ జయశంకర్ సార్ ఆకాంక్షలను, ఆశయాలను అమలు చేస్తున్నారు. జయశంకర్ సార్ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి. జయశంకర్ సార్ జయంతి, వర్ధంతి లను ఘనంగా నిర్వహించడం, ఆయన సేవలను స్మరించుకోవడం ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి.

Advertisement

తాజా వార్తలు

Advertisement