Tuesday, April 30, 2024

Follow up: అనుమానంతోనే.. భార్యను అతికిరాత‌కంగా న‌రికి చంపిన భ‌ర్త

మ‌రిపెడ : అనుమానం పెనుభూత‌మైంది.. ఆఖ‌రికి ఇద్ద‌రు ప‌సిబిడ్డ‌ల్ని అనాథ‌లుగా చేసింది. నిద్రిస్తున్న భార్య‌ను గొడ్డ‌లితో క‌ర్క‌షంగా హ‌త్య చేసి ప‌రారయ్యాడు. ఈ సంఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లా మ‌రిపెడ మండ‌లం తానంచ‌ర్ల ప‌రిధిలోని అజ్మీర‌తండా గ్రామ‌పంచాయ‌తీ ఆన‌క‌ట్ట తండాలో ఈరోజు తెల్ల‌వారుజామున జ‌రిగింది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మ‌రిపెడ మండ‌లం ఆన‌క‌ట్ట తండాకు చెందిన బానోత్ ర‌వీంద‌ర్‌కు వ‌రంగ‌ల్ జిల్లా రాయ‌ప‌ర్తి మండ‌లం స‌న్నూర్ గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలోని న‌రియ తండాకు చెందిన బానోత్ మ‌మ‌త‌(28)కు ఆరేళ్ల క్రితం వివాహ‌మైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. ఏడాది పాటు స‌జావుగా సాగిన వీరి కాపురంలో భ‌ర్త అనుమానం గొడ‌వ‌ల‌కు దారీతీసింది. ప‌లుమార్లు భార్య‌ను భౌతికంగా గాయ‌ప‌ర్చినా.. పెద్ద‌మ‌నుషులు స‌ర్ధుబాటు చేసుకుంటూ వ‌చ్చారు. ఈ మ‌ధ్య కాలంలో భార్య కూలీ ప‌నికి వెళ్తోంది. ఈ క్ర‌మంలోనే మ‌మ‌త ఉద‌యం కూలికి వెళ్లోచ్చి ఇంట్లో నిద్రించింది. ఎన్నో రోజులుగా అనుమానంతో ర‌గిలిపోతున్న ర‌వీంద‌ర్ నిద్రిస్తున్న భార్య‌ను గొడ్డ‌లితో కిరాత‌కంగా హ‌త్య చేసి ప‌రార‌య్యాడు. తెల్ల‌వారుజామున విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని వివ‌రాలు న‌మోదు చేసుకుని.. మృత‌దేహాన్ని పోస్టుమార్టం కోసం త‌ర‌లించారు. ఫోరెన్సిక్ నిపుణులు ఇంట్లో బ్ల‌డ్ శాంపిల్స్‌, ఫింగ‌ర్ ప్రింట్స్ న‌మూనాలు సేక‌రించారు.


తాము రాకుండా మృత‌దేహం ఎలా తీసుకెళ్తారు…
అయితే మ‌మ‌త మృత‌దేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా.. తాళ్ల ఊక‌ల్ గ్రామ శివారులో కుటుంబ‌స‌భ్యులు, బంధువులు అడ్డుకున్నారు. తాము రాకుండా ఎలా త‌ర‌లిస్తారంటూ వాగ్వాదానికి దిగారు. అనంత‌రం మృత‌దేహాన్ని తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. పోలీసులు వివ‌ర‌ణ ఇస్తుండ‌గానే కోపోద్రిక్తులైన కుటుంబ‌స‌భ్యులు, బంధువులు ర‌వీంద‌ర్ ఇంటిని ధ్వంసం చేసి ఇంట్లోని వ‌స్తువులు, దుస్తులకు నిప్పుపెట్టారు. ఆప‌డానికి వెళ్లిన ఎస్ఐలు ప‌వ‌న్ కుమార్‌, న‌రేష్‌ల‌పై దాడికి దిగారు. అక్క‌డ పోలీసులు త‌క్కువ సంఖ్య‌లో ఉండ‌టంతో వారిపై భౌతిక దాడికి య‌త్నించారు.


లాఠీ ఝుళిపించిన పోలీసులు…
పోలీసుల‌ను మృతురాలి బంధువులు తోసుకుంటూ వెళ్తుండ‌గా అక్క‌డికి చేరుకున్న డీఎస్పీ, పోలీసు బ‌ల‌గాలు ప‌రిస్థితి అదుపు చేసేందుకు లాఠీలు ఝుళిపించారు. దీంతో కొంత మంది పోలీసుల‌పైకి రాళ్లు వేసేందుకు ప్ర‌య‌త్నించ‌గా… అక్క‌డున్న‌ వారు నిలువ‌రించారు. కాసేపు తండాలో ఉద్రిక్త వాత‌వ‌ర‌ణం నెల‌కొంది. అనంత‌రం డీఎస్పీ ర‌ఘు ప‌రిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి గొడ‌వ‌కు కార‌ణ‌మైన వారిని అదుపులోకి తీసుకున్నారు. మృత‌దేహ‌న్ని పోస్టుమార్టం కోసం బందోబ‌స్తుతో మానుకోట ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

- Advertisement -


మా అమ్మ లేస్తుంది…
మా అమ్మ ప‌ట్టా క‌ప్పుకుని ప‌డుకుంది.. మ‌ళ్లీ లేస్తుంది అన్న చిన్నారి మాటాలు అక్క‌డ ఉన్న వారంద‌రిని క‌ల‌చి వేసింది. మా నాన్న మా అమ్మ‌ను కొట్టి పారిపోయాడ‌ని మ‌ళ్లీ మా అమ్మ లేస్తుంద‌ని నాలుగేళ్ల కుమారు బేళ చూపులు చూస్తు మాట్లాడుతుంటే తండా వాసులు క‌న్నీరు మున్నీరుగా విల‌పించారు. కుటుంబ పెద్ద ఆవేశం ఓ నిండు ప్రాణం బ‌లి తీసుకోగా.. ఇద్ద‌రు చిన్నారుల‌ను అనాథ‌లుగా చేసింది. ఇంత గొడవ జ‌రుగుతున్నా.. ఆ చిన్నారుల‌ను క‌నీసం ప‌ట్టించుకున్న బంధువులే లేరు. రాత్రంతా ఏడుస్తూ పిల్ల‌ల్ని ఆక్క‌డే ఉన్న తండా వాసులు త‌మ ఇంటికి తీసుకెళ్లి ప‌డుకోబెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement