Sunday, April 28, 2024

TS: వేయిస్తంభాల ఆల‌యంలో తిరిగి పూజ‌లు ప్రారంభం..

హనుమకొండ: అల‌నాడు వేయిస్తంభాల గుడిని కట్టేందుకు 72సంవత్సరాలు పట్టిందని కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆలయంలో పునర్నిర్మించిన కల్యాణ మండపాన్ని ఆయన నేడు ప్రారంభించారు. కుటుంబ సమేతంగా వేయి స్తంభాల గుడి యాగశాలలో శాంతి హోమం చేశారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏఎస్‌ఐ అధికారులకు చాలా పరిమితులున్నాయని, ఆ పరిమితుల్లోనే వాళ్లు పనిచేస్తారని, వీటి కారణంగా నిర్మాణం కాస్త ఆలస్యమైన మాట వాస్తవమేనన్నారు. దేశ చరిత్రలో కాకతీయుల పాలనాకాలం స్వర్ణయుగం లాంటిదన్నారు. వ్యవసాయం మొదలుకుని.. కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, చేతివృత్తులకు వారు ఇచ్చిన ప్రాధాన్యత ఇవాళ్టికి కూడా రీసెర్చ్ టాపిక్ అని పేర్కొన్నారు. అలాంటి కాకతీయుల కళావైభవానికి ఇవాళ భక్తులకు అంకితమైనటువంటి ఈ వేయి స్తంభాల మండపం ఓ మచ్చుతునక అని అన్నారు.

మధ్యయుగంలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దేవాలయాలను ధ్వంసం చేశారన్నారు. తుగ్లక్‌ సైన్యం రామప్ప గుడి నుంచి వరంగల్‌ కోట వరకు అన్నింటినీ దెబ్బతీసిందని చెప్పారు. తాజాగా పునర్నిర్మాణం చేసిన వేయి స్తంభాల గుడి కల్యాణ మండపంలో 132 స్తంభాలు ఏర్పాటు చేసినట్లు కిషన్‌రెడ్డి వివరించారు. కాకతీయుల శిల్ప కళా వైభవం అద్భుతమని కొనియాడారు. ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిదన్నారు.

- Advertisement -

వేయిస్తంభాల ఆల‌య చ‌రిత్ర‌..

1163లో కాకతీయ పాలకుడైన రుద్రదేవుడు ఈ ఆర్కిటెక్చురల్ మార్వెల్ (ఇంజనీరింగ్ అద్భుతం)ను నిర్మించారు. అప్పట్లోనే దీన్ని నిర్మించేందుకు 72ఏళ్లు పట్టిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.1324-25లో తుగ్లక్ సైన్యం చేసిన దాడిలో ఈ మందిరం కొంతమేర ధ్వంసమైంది. దీంతోపాటుగా ఈ మందిరంలో ఉన్నటువంటి.. సూర్య, వాసుదేవ విగ్రహాలను తుగ్లక్ సైన్యం తీసుకెళ్లింది. మధ్యయుగ కాలంనాటి ఈ గుడి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా ప్రత్యేకతను చాటుకుంది. ఇక్కడున్న మండపంలో గ్రామసభలు, నాట్య కార్యక్రమాలు నిర్వహించుకునేవారు.

2006లో వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌కు కుంగిన పిల్ల‌ర్లు ..

2006లోవ‌చ్చిన వ‌ర‌ద‌లు ఈ ఆల‌యంలోని పిల్ల‌ర్ల‌లో భారీగా నీరు చేర‌డంతో కొన్ని కుంగిపోయాయి.. దీంతో ముందు జాగ్ర‌త్త‌గా 132 స్తంభాలున్న కల్యాణ మండపాన్ని అప్పుడే కూల్చేశారు. ఆ త‌ర్వాత అప్పుడే పున‌ర్మిణ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు.. అయితే వివిధ కార‌ణాల‌తో ఈ నిర్మాణ క్ర‌తువు ఆల‌స్య‌మైంది. 18 సంవత్స‌రాలకు నిర్మాణం పూర్తి కాగా, నేడు తిరిగి ఈ ఆల‌యంలో పూజ‌ల‌కు శ్రీకారం చుట్టారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement