Thursday, April 25, 2024

మహిళల కోసం అత్యధిక సంక్షేమ పథకాలు తెలంగాణనే అమ‌లు : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

హనుమకొండ : దేశంలో మహిళల కోసం అత్యధికంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో అత్యధిక వేతనాలు కూడా మనం అంగన్వాడీలకే అందుతున్నాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలోని ఎం.ఎన్.రావు గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో అద్భుతమైన పథకాలు అమలు జరుగుతున్నాయ‌న్నారు. గర్భం దాల్చిన ప్రతి మహిళ పోషకాహారం తినాలి అని దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్య లక్ష్మి పథకం తీసుకొచ్చి, వారికి మంచి ఆహారం ఇస్తున్నామ‌న్నారు. ఇందుకు కృషి చేస్తున్న అంగన్వాడిలను అభినందిస్తున్నామ‌ని, అంగన్వాడీల కష్టం గుర్తించి, సీఎం కేసీఆర్ మూడు సార్లు వేతనాలు పెంచి, పి.ఆర్.సి కూడా ఇచ్చార‌న్నారు. నేడు దేశంలో అధికంగా వేతనాలు తీసుకుంటున్నది మన రాష్ట్రంలోనే అని గుర్తుచేశారు. మహిళల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఏమి చేయాలో సూచించాలంటూ, 9 మంది ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి, ఇతర రాష్ట్రాలకు పంపించి అధ్యయనం చేయించారు. గ‌ర్భిణీ స్త్రీలు, బాలింతలకు భోజనం, పాలు, గుడ్డుతో పాటు కేసీఆర్ కిట్ కింద నెలకు 2వేల రూపాయల చొప్పున 12వేల రూపాయలు, ఆడపిల్ల పుడితే అదనంగా మరో వెయ్యి రూపాయలు కలిపి, 13 వేల రూపాయలు ఇచ్చి, కిట్ లో బ్రాండెడ్ వస్తువులు అందిస్తున్నారన్నారు. ఈ పథకానికి 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం అన్నారు.
గిరిజన కుటుంబంలో జరిగిన సంఘటన చూసి చలించిన సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చారు, ఈ పథకం కింద కొన్ని లక్షల కుటుంబాలు లబ్ది పొందార‌న్నారు.

పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్ కూడా ఇస్తున్నారు. 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బాలికలకు హెల్త్ అండ్ హైజెనిక్ కిట్స్ ఇవ్వాలని నిర్ణయించడం చారిత్రాత్మకం అన్నారు. మహిళలకు రక్షణ కవచంగా ఉండేందుకు సఖి కేంద్రాలు, భరోసా కేంద్రాలు మహిళల భద్రత కోసం అమలు చేస్తున్నారు అన్నారు. ఇవి దేశానికి ఇది రోల్ మోడల్ గా నిలుస్తాయ‌న్నారు. భగీరథుని రూపంలో సీఎం కేసీఆర్ ఇంటింటికీ నల్లా నీరు అందిస్తున్నారు, ఆసరా పెన్షన్ ద్వారా కుటుంబంలోని వృద్ధులకు కూడా సీఎం కేసీఆర్ గౌరవం కల్పించారు. రాష్ట్రంలో మహిళల కోసం అమలు చేస్తున్నఇలాంటి ప్రతి పథకం గ్రామీణ ప్రాంతాల్లో మహిళకు కూడా తెలియాలి అని, అలా మనమంతా కలిసి ప్రచారం చేయాల‌న్నారు. సుస్థిరమైన రేపటి కోసం లింగ సమానత్వం రావాలి అంటే మొదట మనలో మార్పు రావాలి, తద్వారా సమాజంలో మార్పు రావాలి అన్నారు. నేడు మహిళలో దేనిలో తీసిపోని విధంగా రాణిస్తున్నారు, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం, ప్రోత్సాహం అందిస్తోంద‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో మా ఆడపడచులు ఖాళీ బిందెలతో నీళ్లకు వెళ్లకుండా… ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తున్న అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ కర్నాకర్, సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ కార్యదర్శి పల్లెపాడు దామోదర్, నేషనల్ కంజ్యుమర్స్ ఫోరం మెంబర్ ప్రీతి పాండే, రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు, మున్సిపల్, మార్కెట్, సొసైటీ చైర్మన్లు, ఏసిపి, ఎంపిపిలు, జడ్పీటిసిలు, కౌన్సిలర్లు, వైద్య, శిశు సంక్షేమ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపిటిసిలు, బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు తదతరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement