Wednesday, May 1, 2024

గొప్ప పోరాట యోధుడు సర్దార్ పాపన్న గౌడ్ : మంత్రి ఎర్ర‌బెల్లి

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం పెద్ద మడూరు గ్రామంలో శ్రీ కంత మహేశ్వర దేవాలయంలో పూజలు చేసి ఆలయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఆ తర్వాత, పెద్ద మడూరు, నల్ల కుంట తండా గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో, మహిళలతో ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌడ సోదరుల కోరిక మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కల్లు రుచి చూశారు. మంత్రి మీద అభిమానంతో గౌడ సోదరులు పోటీ పడి కల్లు పోశారు. పట్టు పట్టి, మంత్రి ని ఒక పట్టు పట్టాలని అభ్యర్థించడంతో మంత్రి కాదనలేని స్థితిలో ఆ కల్లు తాగి వారి పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. కల్లు రుచి బాగుందని చెప్పి మంత్రి అభినందించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. స‌ర్దార్ సర్వాయి పాపన్నకు పుష్పాంజలి ఘటిస్తున్నాను, సర్దార్ సర్వాయి పాపన్న గొప్ప పోరాట యోధుడు అన్నారు. అతి చిన్న కుటుంబంలో పుట్టి, అతి గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తి అన్నారు. ఆయన కేవలం వ్యక్తి మాత్రమే కాదు శక్తి అన్నారు.

నిజాం పాలన పై తిరుగుబాటు చేసి, ఆ పాలన పై యుద్ధం ప్రకటించారు, ఆయన మన ప్రాంతంలో పుట్టడం మన అదృష్టం అన్నారు. ఆయన పోరాటం భావి తరాలకు స్ఫూర్తి, అందుకే సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతి లను ప్రభుత్వమే నిర్వహిస్తున్నది అన్నారు. సీఎం కెసిఆర్ మనసున్న మహారాజు, హైదరాబాద్ లో 5 ఎకరాల స్థలం లో ఒక భవనం ఏర్పాటు చేస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో నేను ప్రతి గ్రామంలో గౌడ కమ్యూనిటీ హాలు కట్టించాను, గిరక తాళ్ళు ఏర్పాటు చేయాలి.. కల్లు బాగా వస్తుంది అన్నారు. 2 ఏళ్ళ కింద నేను పాలకుర్తి నియోజకవర్గం లో గిరక తాళ్ళు పెట్టించాను, ఈ దిశగా గౌడ సోదరులు ఆలోచించాలి అన్నారు. సీఎం గౌడల కోసం ఎంతో చేస్తున్నారు. వైన్ షాపుల్లో 15శాతం రిజర్వేషన్లు కల్పించారు. కంఠ మహేశ్వర దేవుడి పేరున నియోజకవర్గం లో 20కి పైగా గుడులు కట్టించాను, పెద్ద మడూరులో కమ్యూనికంఠటీ హాలు అడుగుతున్నారు. 20 లక్షల రూపాయలు ఇస్తాను అని హామీ ఇచ్చారు.
కంఠ మహేశ్వర దేవాలయ ప్రారంభం..
ఇక కంఠ మహేశ్వర దేవాలయ నిర్మాణానికి సహకరించిన బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ కు మంత్రి ఎర్ర‌బ‌ల్లి ద‌యాక‌ర్ రావు అభినందనలు తెలిపారు. అందరూ సంపాదిస్తారు కానీ, ఖర్చు చేసే గుణం కొంతమందికే ఉంటుంద‌న్నారు. అలా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న శ్రీకాంత్ కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూడాల‌న్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గౌడ సంఘాల ప్రముఖులు, విగ్రహ ప్రతిష్ఠాపన సంఘం బాధ్యులు, గ్రామ ప్రముఖులు, ప్రజలు, వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన గౌడ సోదరులు, పెద్ద మడూరు గ్రామం, నల్ల కుంట తండా ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement