Thursday, May 16, 2024

ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా – బండికి వరంగల్ సిపి సవాల్

వరంగల్ -, వరంగల్ సిపిని వదిలిపట్టే ప్రసక్తే లేదంటూ , పరువు నష్టం దావా వేస్తానని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఆయన అవినీతి చిట్టా మొత్తం బయటకు తీస్తానని మండిపడ్డారు ఈ వ్యాఖ్యలపై వరంగల్ సిపి ఏవి రంగనాథ్ స్పందించారు. మీడియా తో ఆయన మాట్లాడుతూ, వాళ్ల ఆరోపణలకు నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదన్నారు. తాను తన వృత్తి ధర్మంలో ఏ రోజు ఎటువంటి దందాలు చేయలేదని, తాను ఎక్కడైనా సెటిల్మెంట్లు చేసినట్టు చూపిస్తే ఉద్యోగాన్ని వదిలేస్తానంటూ సవాల్ విసిరారు.

సత్యం బాబు కేసు పై బండి సంజయ్ కు పూర్తిగా అవగాహన లేదని, సత్యం బాబు కేసు తను హ్యాండిల్ చేయలేదని రంగనాథ్ తెలిపారు. నిందితులుగా ఉన్నవారు దర్యాప్తును తప్పు పట్టడం సాధారణమని పేర్కొన్న ఆయన తన పై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు.

తనకు బిజెపి వాళ్ళ పై తప్పుడు కేసులు పెట్టాలనే ఉద్దేశం లేదని , తాను రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్నానని పేర్కొన్నారు. తాను ఎవరి పక్షాన ఉంటానో ప్రజలందరికీ తెలుసని కొన్ని కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవడం వల్లే వారికి బాధ కలిగి ఉండొచ్చని పేర్కొన్నారు. గతంలో చేయని ఆరోపణలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రఘునందన్ కూడా కాల్ డేటా విషయంలో కొన్ని విషయాలను తెలుసుకోవాలని, దర్యాప్తుని ఎప్పుడు రాజకీయ కోణంలో చూడకూడదని పేర్కొన్నారు..

బండి సంజయ్ కు తనకు ఏమైనా గట్టు పంచాయితీ ఉందా అంటూ ప్రశ్నించారు సీపీ ఏవి రంగనాథ్… బండి సంజయ్ ఫోన్ మా దగ్గరికి రాలేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన మొబైల్ రాత్రి 1. 14 నిమిషాలకు లాస్ట్ కాల్ ఉందని, లాస్ట్ లొకేషన్ బెజ్జంకి అని చూపిస్తుందని, దానికి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి అన్నారు. బండి సంజయ్ కోపంగా ఉన్నందుకు తమపై పరువు నష్టం దావా వేసుకోవచ్చు అని కానీ తాను మాత్రం ఎవరిపైన పరువు నష్టం దావా వెయ్యనని పేర్కొన్నారు. ప్రతి కేసులో ప్రమాణాలు చేస్తే తాను ఇప్పటివరకు పదివేల సార్లు ప్రమాణాలు చేయాలని ప్రమాణం అనే మాట వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుందని వరంగల్ సిపి తెలిపారు. తమ వద్ద ఉన్న అన్ని ఆధారాలను కోర్టులో సమర్పిస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement