Friday, June 14, 2024

TS: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచ‌క్ష‌ణ‌తో ఓటు.. ఓట‌ర్ల‌ను అభ్య‌ర్ధించిన కేటీఆర్

420 మోసగాడు రేవంత్ రెడ్డి
..హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్
..అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు
..మోసపోతే మళ్ళీ గోసపడుతాం
.. మోసగాళ్లకు మోసగాడు తీన్మార్ మల్లన్న
..ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డిని గెలిపించాలి
..సన్నాహక సమావేశంలో కేటీఆర్

ఆంధ్రప్రభ ప్రతినిధి /యాదాద్రి – మోసపోతే గోస పడుతాం అని చెప్పినం. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచక్షణతో ఓటెయ్యాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడింట్‌ కేటీఆర్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, నకిరేకల్, దేవరకొండ లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదని, 9న్నర ఏళ్ళు అధికారం కేసీఆర్ కు కట్టబెట్టగా, అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ ను నమ్మి ఓట్లు వేసి గెలిపించారని చెప్పారు. 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని చెప్పారు. 6 గ్యారంటీలు మరచి పోయిందని, 420 హామీలను తుంగలో తొక్కిందని చెప్పారు. ఆరు నెలల ముందు జరిగిన ఎన్నికల్లో చేసిన అభివృద్ధి చెప్పుకోలేక ఓడిపోయాం. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం, వేతనాలు పెంచినాం, కొన్ని వర్గాల ప్రజలకు దూరం అయ్యినాం. కేవలం 1.84 శాతం ఓట్ల తోనే ఓటమి పాలయ్యమని గుర్తు చేశారు. కేసీఆర్ పాలన ఎలా ఉండే, నేడు రేవంత్ పాలన ఎలా ఉందొ గుర్తు చేసుకోవాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అని చెప్పి పచ్చి మోసం చేశార‌ని, ధాన్యం బోనస్ విషయంలో కూడా మాట తప్పిండని విమర్శించారు.

అప్పుడేమో అన్ని వ‌డ్ల‌కు… ఇప్పుడేమో స‌న్నాల‌కు..
ఓట్లప్పుడు మాత్రమే రైతుబంధు ఇస్తుండు, మహిళలకు రూ.2,500 ఇస్తా అని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా నిర్లజ్జగా అబద్ధాలు ఆడుతున్నారని ఘాటుగా విమర్శించారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ అంటూ అన్ని బోగస్ మాటలు మాట్లాడుతున్నాడని సీఎంపై మండిపడ్డారు. ఆరు గ్యారంటీలతో అభూతకల్పనలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇన్ని అబద్ధాలు ఆడుతున్న కాంగ్రెస్‌కు ఓటుతో సరైన బుద్ధి చెప్పాలన్నారు. అలాగే విద్యుత్ కూడా సరిగా ఇవ్వడం లేదని ఆరోపించారు.

- Advertisement -

కాంగ్రెస్ అభ్య‌ర్ధి ప‌చ్చి బ్లాక్ మెయిల‌ర్ ..
దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రేవంత్ రెడ్డి పూటకో అబద్ధం అడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఉద్యోగాలు ఇచ్చినం అని అబద్ధాలు అడుతున్నాడు. 30వేల ఉద్యోగాలు కేసీఆర్ రిక్రూట్మెంట్ చేస్తే వాటికి కాగితాలు పంచుతూ సీఎం అబద్ధాలు అడుతున్నాడని విమర్శించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పచ్చి బ్లాక్ మెయిలర్‌. అతను అబద్ధాలు ఆడే వ్యక్తి. 56 క్రిమినల్ కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. అమ్మాయిలు పెట్టిన కేసులే పది దాకా ఉన్నాయి. అతన్ని చట్టసభల్లోకి రానివ్వకుండా బుద్ధి చెప్పాలన్నారు. జీవో 46ని రద్దు చేసేందుకు త‌మ‌ ప్రభుత్వంలో అన్నీ సిద్ధం చేసినం. దురదృష్టవశాత్తు అప్పటికే ఎన్నికల కోడ్ వచ్చింది. ప్రాసెస్ అంతా నిలిచిపోయింది. ఇప్పుడు ఆ జీవోను రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేష్ రెడ్డి గొప్ప విద్యావంతుడు అతనికి ఓటేస్తే ప్రభుత్వంపై కొట్లాడుతాడని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్ధి లింగయ్య, గాధరి కిషోర్, బడుగుల లింగయ్య యాదవ్, ఎలిమినేటి సందీప్ రెడ్డి, క్యామ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement