Sunday, April 28, 2024

Flash..Flash: ఎస్ఐబి అదుపులో మావోయిస్టు దంపతులు

మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులను ఎస్ఐబి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామ సమీపంలోని ఒక ఇంట్లో 20రోజులుగా ఇద్దరు మావోయిస్టులు మకాం వేసినట్లు సమాచారం అందుకున్న ఎస్ఐబి పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. గత ఆరు నెలలుగా మావోయిస్టులు మంచిర్యాల జిల్లాలో సంచరిస్తున్నట్టుగా నిఘా వర్గాలు అనుమానించాయి. శనివారం ఇందారం ఓవర్ బ్రిడ్జి సమీపంలోని ఒక మాజీ మావోయిస్టు ఇంటిలో వారు ఉన్న విషయాన్ని తెలుసుకున్న నిఘా వర్గాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా నరేంద్రపురం గ్రామానికి చెందిన మావోయిస్టు భార్యాభర్తలు దొంగ గంగాధర్ రావు అలియాస్ నర్సన్న అలియాస్ బక్కన్న, ఆయన భార్య దొంగ భవాని అలియాస్ సుజాత అలియాస్ లక్ష్మి పార్టీలో టెక్నికల్ సెంట్రల్ కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నారు.

వీరు విప్లవ భావాలు ఉన్న యువతను గుర్తించి సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరే విధంగా ప్రయత్నిస్తారు. ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పార్టీకి తెలియజేయడంతో పాటు పార్టీకి చందాల విషయంలో సమాచారం అందిస్తారు. మావోల వారోత్సవాల నేపథ్యంలోనే మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోడానికే వచ్చినట్టు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న మావోయిస్టుల నుండి పోలీసులు సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు, పెన్ డ్రైవ్ లతో పాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement