Sunday, April 28, 2024

TS – ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కానికి రేవంత్ రెడ్డి శ్రీకారం …

భ‌ద్రాచ‌లం – కాంగ్రెస్ సర్కార్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా.. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద సొంత జాగా ఉన్న వారు ఇళ్లు నిర్మించుకోవడానికి 5లక్షల రూపాయల ఆర్థిక సాయం, ఇళ్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది ఈ ప‌థ‌కాన్ని నేడు భ‌ద్రాచ‌లంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రేవంత్ ప్రారంభించారు.. ముందుగా ఇందిరమ్మ ఇంటి మోడల్ ను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలు అభిషేకించారు.. ఈ ప‌థ‌కం కోసం రూ.22,500 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు..ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇల్లాలి పేరుతో ఇల్లు ఇస్తామని అన్నారు. ఇంటి పట్టా కూడా ఆడబిడ్డ పేరుతో ఉంటే బాగుంటుందని తమ ప్రభుత్వం నమ్మిందని చెప్పారు.

తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మోసం చేసింది కెసిఆరే…

చెప్పిన కథనే మళ్ళీ మళ్ళీ చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేశారని కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్ బీఆర్ఎస్ ను బొంద పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ కు ఖమ్మం జిల్లాకు బలమైన బంధం ఉందని తెలిపారు. కమ్యూనిస్టు కాంగ్రెస్ ల మధ్య గతంలో ఎన్ని కొట్లాటలు ఉన్నా.. ఇప్పుడు కలిసి అభివృద్ధిలో పాల్గొంటున్నారని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ వైపు ఉన్నారు.. కేసీఆర్ ను నమ్మలేదని ఆరోపించారు. రూ.400 ఉన్న సిలిండర్ 1200 చేసిన ఘనత మోడీ, కేసీఆర్ లేదనని విమర్శించారు. భట్టి విక్రమార్క అదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశార‌ని,.. ఆ సమయంలో ప్రజల వద్ద నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ఉచిత కరెంట్ ఇచ్చామని పేర్కొన్నారు.



మీరు ఇళ్లు క‌ట్టించిన చోట ఓట్లు ఆడిగేదే లే…

- Advertisement -

పార్టీ కండువా కప్పుకున్న వారికి ఏమి ఇవ్వ‌బోమ‌ని అంటూ .. పేద వారికి అన్ని పథకాలు ఉంటాయ‌న్నారు. అడిగిన పేద వారికి ఇస్తామని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఉన్న ఊర్లో ఓట్లు వేయించుకో కేసీఆర్.. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లో మేం ఓట్లు వేయించుకుంటామని అన్నారు.

బిజెపి నేత‌లు… మీరు కట్టిన ఇళ్లు ఎక్క‌డ

మోడీ హామీ ఇచ్చిన ఇళ్లు ఇచ్చారని కిషన్ రెడ్డి, ఈటల, లక్ష్మణ్ లని నిల‌దీశారు రేవంత్ . మీరు నిజంగా ఇళ్లు క‌ట్టిస్తే అక్క‌డ ప్ర‌జ‌ల‌ను తాము ఓటు ఆడ‌గ‌బోమ‌న్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులను బలి తీసుకుంటుందని ఆరోపించారు. 20 కోట్ల ఉద్యోగాలు ఇప్పటి వరకు దేశంలో ఇవ్వాల‌ని,… ఇచ్చారా ఇచ్చి ఉంటే తెలంగాణలో నిరుద్యోగం ఉండేది కాదని సీఎం చెప్పారు. తెలంగాణలో ఖమ్మంకు ప్రత్యేక స్థానం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

బీఆర్ఎస్, బీజేపీలు ఒకటే …

బీఆర్ఎస్, బీజేపీలు ఒకటే అని అన్నారు. ఈ రెండు పార్టీలు పదేళ్ల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కుమ్మక్కై లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీలు చీకటి ఒప్పందంలో భాగంగానే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం కల్వకుంట్ల కుటుంబంలోని నలుగురే ఆ పార్టీలో మిగులుతారని అన్నారు. తమతో పెట్టుకోవద్దని.. కాంగ్రెస్‌తో పెట్టుకున్నవారు బాగుపడ్డట్లు చరిత్రలో లేదని అన్నారు.

ప్ర‌తి పైసా పేద‌ల కోసం ఖ‌ర్చు చేస్తాం..డిప్యూటీ సిఎం భ‌ట్టి

డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అర్హులైన అందరికీ ఇళ్లు రాబోతున్నాయని తెలిపారు. గత పదేళ్ల కాలంలో పేద వాళ్లకు ఇళ్లు ఇచ్చిన పాపం లేదని అన్నారు. పోరాటం చేస్తామనే వారికి సవాల్ చేస్తున్నామ‌ని.. విమర్శలు చేసే మీ మెప్పు కోసం ఈ హామీలు ప్రకటించలేదని అన్నారు. తెచ్చిన రాష్ట్రాన్ని కాపాడాలని ఆరు గారంటీలు ప్రకటించామని తెలిపారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రకటించి ఇస్తున్నామ‌ని, తాము తూ తూ మంత్రంగా ప్రకటించడం లేదని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంకు, బీఆర్ఎస్ కు ఉన్న తేడా ఇదేనని తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు…. ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు పెడతామని చెప్పారు. గత ప్రభుత్వాలు దోచుకున్నట్లుగా ఉండదని తెలిపారు. భద్రాచలం పట్టణం కానీ, దేవాలయానికి కానీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు. మంచినీళ్లు, గోదావరి బ్రిడ్జి, కట్టిన మరో బ్రిడ్జి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ మాత్రమే నిధులు కేటాయించి అభివృద్ధి చేసిందని అన్నారు.

గిరిజ‌నుల‌కు,ద‌ళితుల‌కు రూ 6 ల‌క్ష‌లు..

గిరిజనులకు, దళితులకు గుడ్ న్యూస్ చెప్పారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క. ముఖ్యంగా వారి కోసం అదనంగా రూ.లక్ష సాయం చేయనున్నట్టు తెలిపారు. సాధారణంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు అందజేస్తార‌ని, తాజాగా ఈ పథకం కింద గిరిజనులు, దళితులకు రూ.1లక్ష అదనంగా కలిపి మొత్తం రూ.6లక్షలను ఇస్తామని ప్రకటించారు.

వాళ్ల‌కేమో ఫామ్ హౌజ్ లు…. కోమ‌టిరెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు ఫాంహౌస్ లు కట్టుకున్నారని విమర్శించారు. పేదలకు ఇళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. అదేవిధంగా.. భద్రాచలం దేవస్థానంను అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మీరందరూ మంచి మెజారిటీతో బలరాం నాయక్ ను గెలిపించాలని కోరుతున్నట్లు తెలిపారు.

పేద‌ల క‌ళ్ల‌లో ఆనందం చూడ‌ట‌మే కాంగ్రెస్ ల‌క్ష్యం – సీత‌క్క
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎప్పుడు పేదల పక్షం.. పేదల కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ లక్ష్యం అన్నారు. కాంగ్రెస్ ప్రతి గారంటీని పేదలకు అందిస్తామని తెలిపారు. గతంలో ఆర్టీసీ రెట్లు పెంచితే.. కాంగ్రెస్ మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుందని పేర్కొన్నారు. శ్రీరామ చంద్రుడు ఆలయం వద్ద చెబుతున్నాం… హామీలన్నీ అమలు చేస్తామని మంత్రి సీతక్క చెప్పారు.

సీతారామ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు అందిస్తాం…

మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ సాక్షాత్తు భద్రాద్రి రాముడి సమక్షంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టామ‌న్నారు. మొందికుంట ప్రాజెక్ట్, పాలెం వాగు ప్రాజెక్ట్, పగల్లపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కు.. సీతారామ ద్వారా జిల్లా మొత్తం నీళ్ళు ఇచ్చే ప్రక్రియ చేపడుతామన్నారు. అంతేకాకుండా.. కరకట్టను పూర్తి చేయడం కోసం కృషి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం విధ్వంసం చేసిన అప్పులున్నప్పటికి అన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇస్తామని అన్నారు.

కాంగ్రెస్ ది చేత‌ల ప్ర‌భుత్వం… పొంగులేటి

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం అయిన ఇళ్ల పథకం అమలు అవుతుందని తెలిపారు. రాముల వారికి ఇస్తానన్న వంద కోట్లు కూడా ఇవ్వకుండ కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. ఇది చేతల ప్రభుత్వం.. గతంలో పింక్ షర్ట్ లు తీసుకున్న వారికే పథకాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇప్పుడు ఏ పథకం అలా ఉండదని మంత్రి పొంగులేటి తెలిపారు.

త్వ‌ర‌లో పోడు భూముల‌కు ప‌ట్టాలు పంపిణీ..

త్వరలోనే అర్హులైన గిరిజనులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల సంక్షేమం అని అన్నారు. త‌మ ప్రభుత్వానికి భద్రాద్రి రాముడి ఆశీస్సులు ఉన్నాయన్నారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని ఫైర్ అయ్యారు. డబుల్ ఇండ్ల పేరుతో కేసీఆర్ పేదలను మోసం చేశారని నిప్పులు చెరిగారు. కేసీఆర్ పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు. భద్రాది రాముడిని కూడా కేసీఆర్ మోసం చేశారని విమర్శలు గుప్పించారు. భద్రాద్రికి రూ.100 కోట్లు ఇస్తామని చెప్పి కేసీఆర్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కింద పార్టీలకు అతీతంగా ఇళ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు.

భద్రాద్రి రామయ్య సేవలో రేవంత్

ముందుగా రేవంత్ రెడ్డి భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు.అనంతరం వేద ఆశీర్వచనం పండితులు ఇవ్వగా, స్వామి వారి ప్రసాదం, చిత్రపటాలను దేవస్థానం ఈవో రమాదేవి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరామనవమి పోస్టర్ ను సిఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి,ఇతర మంత్రులు విడుదల చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement