Sunday, April 28, 2024

TS: ఈ సారి జంబో కార్యవర్గంపై కేసీఆర్‌ కసరత్తు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రసమితి రాష్ట్ర కార్యవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టి సారించారు. 60మందితో జంబో కార్యవర్గాన్ని సీఎం కేసీఆర్‌ ప్రక టించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నా యి. ఈ వారం, పదిరోజుల్లో కార్యవర్గాన్ని అధినేత ప్రకటిస్తారని చెబుతున్నారు. రాష్ట్ర కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శులకు అత్యంత ప్రాధాన్యముంది. గతంలో ప్రధాన కార్యదర్శులుగా ఉన్న పలువురు నేత లకు మంత్రి పదవులు, ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు దక్కడం తో.. వీటికి క్రేజ్‌ ఏర్పడింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియ మించాకే జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కాగా, బండ ప్రకాష్‌కు కూడా ఇదే తరహా పదోన్నతి దక్కింది.

మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి పి.రాములు ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యాక, లోక్‌సభటికెట్‌ దక్కించుకుని ఎంపీ అయ్యారు. సత్యవతి రాథోడ్‌ ఎమ్మెల్సీ కోసం ప్రయత్నించగా, ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి కూడా దక్కింది. ఇంకా పలువురు నేతలకు ఎమ్మెల్సీలు, ఇతర ప్రాధాన్యపదవులు దక్కాయి. ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి రైతుబంధు సమితి అధ్యక్షుడిగా కూడా పదోన్నతి పొందారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

యువనేతలకు, సీనియర్లకు ఛాన్స్‌..ఈ దఫా రాష్ట్ర కమిటీలో యువతతో పాటు సీనియర్లు, బలహీనవర్గాల నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధినేత కేసీఆర్‌ భావిస్తున్నారు. ఆదినుండి మరికొద్దికాలం పార్టీతో మమేకమై ముందుకు తీసుకెళ్ళగలిగే నేతలకు అవకాశాలిస్తున్న కేసీఆర్‌ ఆయా జిల్లాల్లో సమర్ధులైన ముఖ్యనేతలు, సీనియర్లు, యువకులకు ఈ సారి ప్రాధాన్యమిచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పదవుల్లో ఉన్న వారికంటే పదవులు లేకుండా పార్టీకి సమయం కేటాయించి సేవ చేయగలిగే నేతలను ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. పార్టీ ప్రధాన కార్యదర్శులకు వివిధ ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించగా, అసెంబ్లి, లోక్‌సభ ఎన్నికల సమయంలో వీరే కీలకంగా వ్యవహరించారు. అనుబంధ సంఘాలకు కూడా ఈసారి కొత్త ముఖాలను తీసుకొచ్చే అవకాశముంది

మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్న గుండు సుధారాణికి వరంగల్‌ మేయర్‌గా అవకాశమివ్వగా, ఈసారి మహిళా విభాగానికి కొత్త నేతను నియమించే అవకాశముంది. యువజన విభాగం అధ్యక్షుడిగా ప్రస్తుతం ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు వ్యవహరిస్తుండగా, మార్పుచేర్పులపై చర్చ జరుగుతోంది. గతంలో ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా ఉన్న సుంకె రవిశంకర్‌ చొప్పదండి ఎమ్మెల్యే కాగా, ఆ స్థానాన్ని భర్తీ చేయలేదు. ఇపుడు ఎస్సీ విభాగానికి కొత్త నేతను నియమించే అవకాశముంది. పార్టీలోని సీనియర్లు, యువత, నియోజకవర్గాల్లో నేతలను సమన్వయపరిచే సామర్ధ్యమున్న వారికి అవకాశాలు ఇవ్వాలని అధినేత యోచిస్తున్నారు. త్వరలో ఇవ్వనున్న ఎమ్మెల్సీలు, నామినేటెడ్‌ పదవులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర కమిటీని ఖరారుచేసే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement