Friday, May 3, 2024

Tribe’s Danger bells తెరపైకి పోడు గోస …మరోసారి ఖమ్మం జిల్లాలో ఘర్షణ

ఎన్నికల వేళ పోడు భూముల స‌మ‌స్య‌ మరోసారి తెరపైకి వచ్చింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రాయపాలెంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. పోడు భూముల వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. హక్కుల కల్పనే కాకుండా పోడు రైతులకు రైతుబంధు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. కానీ, పాస్‌ పుస్తకాల‌ను జారీ చేయలేమని చెప్పింది. దీంతో ఇది కాస్త రావణకాష్టంలా మారి పోడు భూముల వ్యవహారం మరోసారి రగడకు కారణమైంది. ఇక‌.. ఖ‌మ్మం జిల్లాలో ఈ పోడు ఇష్యూ మ‌రోసారి రాష్ట్ర‌వ్యాప్త చ‌ర్చ‌కు వ‌చ్చింది. అక్క‌డ జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో పోలీసులు జోక్యం చేసుకోగా ఆక్రోశంతో గిరిజ‌నులు వారిని త‌రిమికొట్టారు. ఇంకా తెలంగాణ వ్యాప్తంగా ల‌క్షలాది ఎక‌రాల స‌మ‌స్య పెండింగ్‌లో ఉంది. దీంతో నిత్యం ఘ‌ర్ష‌ణ‌లు, గొడ‌వ‌లూ జ‌రుగుతున్నాయి. దీనిపై రేవంత్ స‌ర్కారు ఓ క‌చ్చిత‌మైన నిర్ణ‌యం తీసుకుని ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపాల‌ని గిరిజ‌నులు కోరుతున్నారు.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో పోడు భూములకు పట్టాల పంపిణీ గత ప్రభుత్వం చేసింది. ఈ భూములకు పెట్టు-బడి సాయం రైతుబంధు మొత్తం అందేలా చెక్కులను అందించింది. అయితే చాలా ఏళ్ల నుంచి పోడుభూముల పట్టాల అంశం పెండింగ్‌ లో ఉంటూ వస్తుంది. ఎట్టకేలకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పోడు రైతుల కల నెరవేరిందని గతేడాది అధికారులు కూడా భావించారు. అలాగే గిరిజనులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని అప్పటి సీఎం కేసీఆర్‌ ఆదేశించినప్పటికీ ఈ అంశం అమలులోకి రాలేదు. తెలంగాణలో పోడు భూములను నమ్ముకొని లక్షల మంది కుటుబాలు బ్రతుకుతున్నాయి. అడవుల్లో చిన్న చిన్న చెట్లు, కొండ వాలుల్లో పొదలను నరికి చేసుకునే వ్యవసాయాన్ని పోడు వ్యవసాయం అంటారు. ఆ భూములను పోడు భూములు అంటారు. అయితే వీటి హక్కులు ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. వీటికి హక్కులు కల్పించాలని అనేక ఏళ్లుగా పోరాటం జరుగుతోంది.

11 జిల్లాల్లో పోడు స‌మ‌స్య అధికం..

రాష్ట్రంలోని 11 జిల్లాల్లో పోడు భూములు అధికంగా ఉండగా వాటిపై హక్కుల కల్పన జరిగిందని అధికారులు వెల్లడించారు. మిగతా జిల్లాల్లో కూడా పోడు భూములు ఉన్నప్పటికీ అవి స్వల్ప మొత్తంగానే ఉన్నాయి. 11,55,849 ఎకరాలకు సంబంధించి మొత్తం 3,94,996 క్లెయిమ్‌లు..7,19,704 ఎకరాలకు సంబంధించి 2,23,416 ఎస్టీ క్లెయిమ్‌లు. 4,36,145 ఎకరాలకు సంబంధించిన 1,71,580 క్లెయిమ్‌లు గతంలో ప్రభుత్వానికి అందాయి. అలాగే 28 జిల్లాల నుంచి 2845 గ్రామ పంచాయతీల నుంచి 4 లక్షల 14 వేల 353 దరఖాస్తుల వరకు ప్రభుత్వానికి వచ్చాయి. ఆయా అబ్దిదారులకు అందిన భూమి 12 లక్షల 46 వేల 846 ఎకరాలుగా ఉంది. అయితే కొన్ని జిల్లాల్లో ఈ భూమిని నమ్ముకున్న గిరిజనులు అధికంగా ఉన్నారు. అందులో భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్‌ , ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌ , ములుగు, ఖమ్మం , వరంగల్‌, నాగర్‌కర్నూల్‌, మంచిర్యాల జిల్లాలు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 7.14 లక్షల ఎకరాలకు పైగా మొత్తం 2.47 లక్షల క్లెయిమ్‌లు ఆమోదించారు. కాగా అటవీ, పోడు భూముల హక్కుల కోసం ప్రత్యేకంగా ఓ చట్టం వచ్చింది. అటవీ హక్కుల చట్టం 2006ను తీసుకొచ్చారు. దీని ప్రకారం ప్ర‌స్త‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వం చొర‌వ చూపాల్సి ఉంది.. సీఎం రేవంత్ హ‌యాంలో అయినా పూర్తి స్థాయిలో హక్కులు కల్పించాల‌ని గిరిజ‌న‌లు, పోడు రైతులు వేడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement