Monday, May 13, 2024

సమ్మెకు సై: ఉసురుపోసుకుంటున్న ఉన్నతాధికారులు.. సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులకు జీతాలు బంద్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్యశాఖ బలోపేతానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ… సకాలంలో కోట్లాది నిధులు సమకూరుస్తున్నా వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కొంత మంది ఉద్యోగుల ఉసురుపోసుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారు. ఫలితంగా ఆ సిబ్బంది కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. ఏప్రిల్‌ -2021లోనే పీజీ కోర్సు పూర్తి చేసి రాష్ట్ర వైద్య విద్యా విభాగంలో కాంట్రాక్టు బేసిక్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులుగా నవంబరు -2021నుంచి పనిచేస్తున్న దాదాపు 700 మంది సూపర్‌ స్పెషలిస్టు వైద్యులుకు అయిదు నెలలుగా జీతాలు రావటం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిగాని లేదంటే శాఖాపరమైన చర్యలు చేపట్టి జీతాలు అందేవిధంగా చర్యలు తీసుకోవాల్సిన వైద్య విద్య విభాగం ఉన్నతాధికారులు అట్టర్‌ ప్లాఫ్‌ అవటం, నిర్లక్ష్యంగా వ్యవహరించటమే ఇందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొవిడ్‌ కష్టకాలంలో ప్రాణాలు ఫణంగా పెట్టి వైద్య సేవలు అందించినా జీతాలు మాత్రం ఇవ్వటం లేదని సదరు వైద్యులు వాపోతున్నారు. తాము ఏప్రిల్‌ -2021నాటికి పీజీ కోర్సు పూర్తి చేశామని, ఆ సమయంలో కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతుండటంతో వైద్య సేవల అవసరం దృష్ట్యా నెలపాటు(మే నెల) అదనంగా ఇంటర్న్‌ షిప్‌లో భాగంగా వైద్య సేవలు అందించామంటున్నారు. ఆ తర్వాత థర్డ్‌ వేవ్‌ విరుచుకుపడటంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు కాంట్రాక్టు సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులుగా చేరి గత నవంబరు నుంచి పనిచేస్తున్నారు. జాయిన్‌ నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 నెలల జీతాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ కష్టకాలంలో వైద్య సేవలు అందిస్తున్న దాదాపు 700 మంది తాజా సీనియర్‌ రెసిడెంట్‌లకు అయిదు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. తమ జీతాల విషయమై డీఎంఈ డా. రమేష్‌రెడ్డికి, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం ఉండటం లేదని సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులు వాపోతున్నారు. ఈ 700 మందిలో నీట్‌ పీజీ ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వైద్యులు కూడా ఉండటం గమనార్హం. ఇప్పటికైనా స్పందించి మే, నవంబరు, డిసెంబరు -2021, జనవరి, ఫిబ్రవరి-2022 కాలానికి జీతాలు చెల్లించాలని వేడుకుంటున్నారు.

జీతాలు చెల్లించకుంటే సమ్మెకు సై..

జీతాలు చెల్లించని పక్షంలో సమ్మెకు దిగుతామని సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొత్తగా చేరిన ఈ 700 మంది సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన వైద్య కాలేజీల్లో వీరి సేవలు కీలకంగా మారాయి. సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులు ఉంటేనే కొత్త కాలేజీలకు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) అనుమతులు వచ్చే అవకాశం ఉంది. అయిదు నెలలుగా జీతాలు రాని వారిలో కొత్త మెడికల్‌ కాలేజీలకు అపాయింట్‌ అయిన స్పెషలిస్టు వైద్యులు కూడా ఉండటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో జీతాల కోసం సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులు సమ్మెకు దిగితే కొత్త మెడికల్‌ కాలేజీలకు అనుమతులు, బోధనాసుపత్రుల్లో వైద్య సేవలకు ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement