Monday, April 29, 2024

Bhatti Vikramarka: ప్రతి శాఖనూ అప్పుల్లో ముంచిన‌ గత ప్రభుత్వం

భద్రాచలం: గత ప్రభుత్వం ప్ర‌తి శాఖ‌నూ అప్పుల్లో ముంచింద‌ని, విద్యుత్‌ కొనుగోలు కోసం భారీగా అప్పులు చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. భద్రాచలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… ప్రస్తుతం విద్యుత్‌ కొనుగోలు కింద రూ.59,580 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. విద్యుత్‌ శాఖను పీకల్లోతు అప్పుల్లో ముంచి వెళ్లారని వ్యాఖ్యానించారు. భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌, యాదాద్రి పవర్‌ స్టేషన్‌ పెడుతున్నామంటూ భారీగా అప్పులు చేశారన్నారు. ఈ రాష్ట్రాన్ని అత్యంత ప్రమాదకరమైన, భయంకరమైన పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. అందుకే అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేసి కొంత మేర వాస్తవ విషయాలను ప్రజలకు వివరించేందుకు ప్రయత్నం చేశామ‌న్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రణాళికాబద్ధంగా, ముందు చూపుతో అడుగులు వేయాల్సి ఉందన్నారు. ఒక్క రోజు కూడా వృథా చేయకుండా ప్రతి శాఖలోని పరిస్థితులపై సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నామ‌న్నారు. కేవలం రాజధాని హైదరాబాద్‌లోనే ఉండకుండా.. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల వద్దకు వెళ్లి పరిస్థితులను సమీక్షిస్తున్నామ‌న్నారు. వీలైనంత మేరకు వాస్తవ పరిస్థితులను ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామ‌న్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సరైన దారిలో తీసుకెళ్లేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామ‌ని భట్టి విక్రమార్క వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement