Sunday, April 28, 2024

TS : అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మరణించారు. ఈ మధ్యకాలంలో మృతి చెందిన భారతీయ విద్యార్థుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 10 మంది విద్యార్థులు వేర్వేరు కారణాలతో మరణించారు.

- Advertisement -

తాజాగా మరణించిన విద్యార్థి పేరు మహ్మద్ అబ్దుల్ అరాఫత్. ఓహియో స్టేట్‌లోని క్లీవ్‌ల్యాండ్‌లో నివసిస్తోన్నారు. కొద్దిరోజుల కిందట అదృశ్యం అయ్యాడు అరాఫత్. క్లీవ్‌ల్యాండ్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

అరాఫత్ స్వస్థలం హైదరాబాద్‌లోని నాచారం. క్లీవ్‌ల్యాండ్ యూనివర్శిటీలో ఐటీలో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి గత ఏడాది మేలో అమెరికా వెళ్లాడు. క్లీవ్‌ల్యాండ్‌ నివసిస్తోన్నాడు. కొంతకాలం కిందట ఆయన కనిపించకుండా పోయారు. మిస్సింగ్ కేసును నమోదు చేసిన క్లీవ్‌ల్యాండ్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా- అరాఫత్ మృతదేహాన్ని గుర్తించారు.

ఈ విషయాన్ని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం నిర్ధారించింది. భారత్‌లో అరాఫత్ కుటుంబానికి సమాచారం ఇచ్చామని పేర్కొంది. అరాఫత్ మృతి పట్ల సంతాపం తెలిపింది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించింది. మృతదేహాన్ని త్వరలోనే స్వస్థలానికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తోన్నామని వెల్లడించింది.

ఈ నాలుగు నెలల్లోనే అమెరికా మరణించిన భారతీయ విద్యార్థుల సంఖ్య 11కు చేరడం కలకలం రేపుతోంది. అటు దాడులు సైతం యథేచ్ఛగా చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. మార్చిలో భారత్‌కు చెందిన 34 ఏళ్ల శాస్త్రీయ నృత్య కళాకారుడు అమర్‌నాథ్ ఘోష్‌ను మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో కాల్చి చంపిన విషయం తెలిసిందే.

మూడు రోజుల కిందటే క్లీవ్‌ల్యాండ్‌లోనే నివసిస్తోన్న ఉమా సత్యసాయి గద్దె అనే తెలుగు విద్యార్థి మరణించిన విషయం తెలిసిందే. అంతకుముందు- బోస్టన్ యూనివర్శిటీలో చదువుకునే గుంటూరుకు చెందిన విద్యార్థి పరుచూరి అభిజిత్.. మృతదేహాన్ని ఓ కారులో పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మజర్ అలీ అనే విద్యార్థిపై చికాగోలో దుండగులు దాడి చేశారు. అప్పట్లో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పర్డూ యూనివర్సిటీలో 23 ఏళ్ల విద్యార్థి సమీర్ కామత్‌.. ఫిబ్రవరి 5వ తేదీన ఇండియానాలో మృతదేహమై కనిపించాడు.

పర్డ్యూ యూనివర్శిటీ విద్యార్థి నీల్ ఆచార్య అనుమానాస్పద మృతి, జార్జియాలో వివేక్ సైనీ దారుణ హత్యోదంతం, ఐటీ నిపుణుడు వివేక్ తనేజాపై వాషింగ్టన్‌లోని ఓ రెస్టారెంట్ సమీపంలో ప్రాణాంతక దాడి.. ఇవన్నీ అమెరికాలో నివసించే భారతీయులను ఉలిక్కిపడేలా చేస్తోన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement