Tuesday, May 21, 2024

Delhi: పథకాల ద్వారా లక్ష్య సాధన.. ఎంపీ అరవింద్ ప్రశ్నకు కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్, స్మార్ట్‌ సిటీ మిషన్‌ వంటి పథకాల ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి వివిధ పథకాలను అమలు చేయడం ద్వారా ఐటీఐఆర్‌ లక్ష్యాలను సాధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ అడిగిన ప్రశ్నలకు బుధవారం కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ రాతపూర్వక సమాధానమిచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇటీవలి పారిశ్రామిక పథకాలు, కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుని ఐటీఐఆర్‌ పాలసీ కింద అన్ని కార్యకలాపాలు మూసివేసినట్లు తెలిపారు.

2013లో నోటిఫై చేసిన హైదరాబాద్, బెంగళూరు ఐటీఐఆర్‌ ప్రాజెక్టులను ఆపేయాల్సి వచ్చిందన్నారు. దేశంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎనేబుల్డ్‌ సర్వీసెస్, ఎలక్ట్రానిక్స్‌ హార్డ్‌వేర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ వృద్ధిని వేగవంతం చేయడానికి స్వీయ–నియంత్రణ ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేసేందుకు 2008 మే 28న ఒక నోటిఫికేషన్‌ ద్వారా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (ఐటీఐఆర్‌) పాలసీని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిందని తెలిపారు.

ఈ విధానం ప్రకారం, కర్ణాటక (బెంగళూరు), ఆంధ్రప్రదేశ్‌ (విశాఖపట్నం), తెలంగాణ (హైదరాబాద్‌), తమిళనాడు (చెన్నై సమీపంలో), ఒడిశా (భువనేశ్వర్‌) రాష్ట్రాల నుండి ఐటీఐఆర్‌ ఏర్పాటుకు ఐదు (5) ప్రతిపాదనలు అందాయని కేంద్రమంత్రి వివరించారు. వీటిలో 2013 నవంబర్‌ 13న తెలంగాణ (హైదరాబాద్‌)లో ఐటీఐఆర్‌ను నోటిఫై చేసినప్పటికీ ఆ తర్వాత మూసేయాల్సి వచ్చిందని రాజీవ్ చంద్రశేఖర్ జవాబులో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement