Sunday, April 28, 2024

జంట నగరాల్లో బోనాల సందడి.. ఘనం నిర్వహించనున్న ప్రభుత్వం

జంట నగరాల్లో ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల సందడి మొదలు కానుంది. ఈ నెల 11 నుంచి గోల్కొండ బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవ ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, కరోనా వల్ల గత సంవత్సరం బోనాలను నిరాడంబరంగా నిర్వహించామని, అయితే, ఈ ఏడాది ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. కరోనా మహమ్మారిని పారద్రోలి ప్రజలను చల్లగా చూడాలని గోల్కొండ జగదాంబ అమ్మవారిని కోరుతున్నానని తలసాని చెప్పారు.

అమ్మవారి దర్శనం కోసం లక్షలాది భక్తులు తరలి వస్తారని… ఎవరికీ ఇబ్బంది కలగకుండా, అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు రూ. 10 లక్షలు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. వివిధ ఉత్సవాలను నిర్వహించేందుకు వివిధ ఆలయాలకు ప్రభుత్వం రూ. 15 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. ప్రైవేటు ఆలయాలకు కూడా ఆర్థిక సాయాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

తెలంగాణ సంస్కృతిలో బోనాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఎంతో ఘనంగా బోనాలు నిర్వహిస్తారు. ఈ బోనాలు తెలంగాణ ప్రజల భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తాయి. బోనం అంటే భోజనం. అమ్మవారికి భోజనం పెట్టడమే బోనాలు. తెలంగాణలో అనాధిగా ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం బోనాలను అధికార పండుగగా ప్రకటించింది. వర్షాకాలంలో రోగాలు రాకూడదని కోరుతూ అమ్మవార్లకు నైవేద్యం సమర్పిస్తారు. గతేడాది కరోనా వైరస్ పంజా విసరడంతో వేడుకను నిర్వహించలేదు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో.. బోనాల వేడుకలు నిర్వహంచవద్దని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రస్తుతం కరోనా ఉద్ధృతి రాష్ట్రంలో తగ్గంతో బోనాలు వైభంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement