Wednesday, May 1, 2024

T Congress Plans – బిజెపిలో క‌ల్లోల‌మే కాంగ్రెస్ అస్త్రం ….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బీజేపీలోని అంతర్గత పంచాయతీని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ కార్యాచరణ మొదలు పెట్టింది. బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ మార్పును ఒక అస్త్రంగా వాడుకునేందుకు హస్తం పార్టీ సిద్ధమవుతోంది. సీఎం కేసీఆర్‌ తనయురాలు లిక్కర్‌ కేసులో అరెస్టు చేయక పోవడానికి.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం మొదలు పెట్టింది. ఇప్పుడు సంజయ్‌ని మార్చి.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి బాధ్యతలు ఇవ్వడమంటే.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు లాభం చేయడాని కేనని ప్రచారాన్ని మరింత విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లితే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకుండా ఉంటుందని, అది కాంగ్రెస్‌ వైపు మళ్లుతోందనే అభిప్రాయంతో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వెళ్లిన వారిలో కొందరు తిరిగి సొంత గూటికి వస్తారనే నమ్మకంతో ఆ పార్టీ నేతలున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను బండి సంజయ్‌ చేపట్టాక.. ఆ పార్టీ హైదరాబాద్‌ను దాటి పల్లెల వరకు వెళ్లిందనే ప్రచారం కూడా ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు చాలా మంది నాయకులు ముందుకు రావడమే కాకుండా ఆయా నియోజక వర్గాల్లో సొంత ఖర్చులతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారని, అందులో కాంగ్రెస్‌ నుంచి వెళ్లిన వారు కూడా ఉన్నారని గాంధీభవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బండిని నమ్ముకుని పార్టీ కార్యక్రమాల స్పీడ్‌ పెంచిన కొందరు నేతలకు.. వచ్చే ఎన్నికల్లో టికెట్లు వస్తాయా? అనే అనుమానం ఉంటుందని, అలాంటి వారికి కాంగ్రెస్‌ పార్టీనే ప్రత్యామ్నా యంగా ఉంటుందని వాదన కూడా వినిపిస్తున్నారు. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వెళ్లిన వారు తిరిగి సొంత గూటికి రావాలని పలుమార్లు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు మాత్రం కాంగ్రెస్‌లో చోటివ్వమని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

బీజేపీలోకి వెళ్లిన మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజ గోపాల్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు జితెందర్‌రెడ్డిల పేర్లను కూడా రేవంత్‌రెడ్డి ప్రస్తావించిన విషయం తెలిసిందే. కేసీఆర్‌ను ఓడించేందుకు బీజేపీలోకి వెళ్లిన వాళ్ల ఆశలు అడియాసలైనాయని, కేసీఆర్‌ను ఓడించడం కేవలం కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యమని అనుకునే వాళ్లు తమతో చేతులు కలపాలంటూ కాంగ్రెస్‌ నాయకులు స్నేహస్తం చాటుతున్నారు.

- Advertisement -

ఇంటింటికీ చేయూత.. ప్రతి గడపకు సంక్షేమం..
కాగా, గత రెండు పర్యాయాలు అధికారానికి దూరమైన హస్తం పార్టీ.. వచ్చే అసెంబ్లిd ఎన్నికల్లో తెలంగాణలో విజయం సాధించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. అన్ని వర్గాల ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పటి నుంచే కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలను మొదలు పెట్టింది. అందుకు ఎన్నికల మేనిఫెస్టోను రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ఆమోదంగా ఉండేందుకు కాంగ్రెస్‌ పార్టీ కార్యాచరణను రూపొందిస్తోంది. ప్రతి ఇంటికి చేయూతనివ్వాలనే ఆలోచన చేస్తోంది. ఒక వైపు అభివృద్ధి విషయంలో ముందుకు సాగుతూనే.. మరో వైపు సంక్షేమానికి పెద్ద పీట వేయాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. ఇతర పార్టీల్లోని బలమైన అసంతృప్తులకు గాలం వేస్తూనే ప్రజలకు చేరువయ్యేందుకు రూట్‌ మ్యాప్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు.

వరంగల్‌ వేదికగా ప్రకటించిన రైతు డిక్లరేషన్‌, హైదరాబాద్‌ వేదికగా ప్రకటించి యూత్‌ డిక్లరేషన్లు అన్ని వర్గాల నుంచి ఆమోదయోగ్యత లభిస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రైతు రుణమాఫీ లాంటి పథకం కేవలం భూమి వున్న వారికే వర్తిస్తుందని, భూమిలేని నిరుపేదల నుంచి వ్యతిరేకత రాకుండా చూడాలనే అభిప్రాయంతో కాంగ్రెస్‌ నేతలు ఆలోచన చేస్తున్నారు. రైలే రైతులతో పాటు కూలీ వర్గాలను కూడా ఆదుకుంటామని చెబుతున్నారు. ఖమ్మంలో నిర్వహించిన జన గర్జన సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించిన చేయూత పథకం ప్రతి ఇంటి తలపు తడుతుందని, తద్వారా కాంగ్రెస్‌ పార్టీకి మరింత లాభం చేకూరుతందనే భావనతో ఆ పార్టీ నేతలున్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అసరా పథకం పేరుతో వికలాంగులకు రూ. 3,016, వృద్ధులు, వితంతువులు, ఇతరులకు రూ. 2,016 ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ప్రతి ఇంటిలో దాదాపుగా ఏదో ఒక పెన్షన్‌ తీసుకుంటున్న లబ్ధిదారు లు ఉన్నారు. వికలాంగులకు రూ. వెయ్యి పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిం ది. అన్ని రకాల పెన్షన్లను రాష్ట్ర వ్యాప్తంగా 44.54 లక్షల మందికి ప్రభుత్వం అంది స్తోంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 12 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది. అయితే కాంగ్రెస్‌ ప్రభత్వం అధికారంలోకి వస్తే అన్ని రకాల పెన్షన్ల ( వృద్దులు, విక లాంగులు, వితంతవులు, ఒంటరి మహిళలు, కల్లు గీత, చేనేత కార్మికులు, బీడీ వర్కర్లు, ఏయిడ్స్‌ బాధితులు, ఫైలేరియా- డయాలసిస్‌ పేషంట్లు) లబ్దిదారులంద రికి చేయూత పథకం కింద నెలకు రూ. 4 వేలు ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటిం చింది. ఈ పథకం అమలుకు ఏడాదికి రూ. 21 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని చెబుతున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకొస్తే అమలు చేస్తామని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement