Saturday, May 4, 2024

అక్కడ తగిన సిబ్బందితో వైద్య సేవలు ప్రారంభించండి.. రాష్ట్ర వాటా ఫండ్స్‌ రిలీజ్​ చేయండి: కిషన్‌రెడ్డి లేఖ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన పథకం (పీఎంఎస్‌ఎస్‌వై) కింద ఆధునికీకరించిన ఆదిలాబాద్ (RGIMS), వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలల్లో తగిన సిబ్బందితో వెంటనే వైద్య సేవలను ప్రారంభించాలని, RGIMS‌కు బకాయి ఉన్న రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను వెంటనే విడుదల చేయాలంటూ కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.

దేశంలోని సామాన్య ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని, వైద్య కళాశాలలలో సౌకర్యాలను పెంపొందించి, నాణ్యమైన వైద్య విద్యను అందించాలన్న లక్ష్యంతో దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో 2003లో ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. నూతన AIIMSల ఏర్పాటు, ప్రభుత్వ వైద్య కళాశాలలు, సంస్థలను ప్రజావసరాలకు అనుగుణంగా అభివృద్ధి పరచడం ఈ పథకం లక్ష్యాలు. ప్రభుత్వ వైద్య కళాశాలలను అభివృద్ధి పరచడంలో భాగంగా 150 నుంచి 250 వరకు అదనపు పడకల ఏర్పాటు, కొత్త ఆపరేషన్ థియేటర్లు, 8 నుంచి 10 వరకు సూపర్ స్పెషాలిటీ విభాగాల ఏర్పాటు, దాదాపు 15 అదనపు పీజీ సీట్లను కేటాయించడం వంటి కార్యక్రమాలను పీఎంఎస్‌ఎస్‌ కింద చేపడతారు.

ఈ పథకం మూడవ విడతలో భాగంగా కేంద్రం ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, వరంగల్‌ కాకతీయ మెడికల్ కాలేజీలను గుర్తించి ఒక్కో సంస్థకు అత్యధికంగా రూ.120 కోట్ల నిధులను విడుదల చేసింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆదిలాబాద్, వరంగల్ పట్టణాలలో నాణ్యమైన వైద్య సేవలను ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ రెండు సంస్థలను పథకం కింద ఎంపిక చేసింది. కోవిడ్ విజృంభణ, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదలలో జరిగిన జాప్యంతో ఆదిలాబాద్, వరంగల్‌ వైద్య కాలేజీల అభివృద్ధి పనులు ఆలస్యంగా పూర్తయ్యాయి. కాకతీయ మెడికల్ కాలేజీ నిర్మాణాలు 2020 అక్టోబర్‌లో, RGIMS నిర్మాణాలు భారత ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో పూర్తయ్యాయి. ప్రజలకు పెరుగుతున్న వైద్యావసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు సంస్థలలో పీఎంఎస్‌ఎస్‌ కింద చేపట్టిన సేవలను తగిన సిబ్బందితో వెంటనే ప్రారంభించాలని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement