Saturday, May 4, 2024

Shobha Yatra – గంగ‌మ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మ‌హా గ‌ణేషుడు… కొన‌సాగుతున్న శోభ‌యాత్ర‌.. త‌ర‌లి వ‌స్తున్న విగ్ర‌హాలు..

హైదరాబాద్‌లో గణేష్‌ మహా శోభాయాత్ర ప్రారంభమైంది. నిమజ్జనానికి రాత్రి నుంచే గణనాథులు తరలివస్తున్నారు. దీంతో ట్యాంక్‌బండ్‌పై సందడి మొదలైపోయింది. ఖైరతాబాద్ గణనాథుడి ముందుగా నేటి మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌కు గంగ‌మ్మ ఒడికి చేరాడు.. హ‌స్సేన్ సాగ‌ర్ వ‌ద్ద ఏర్పాటు చేసిన నాలుగో నెంబ‌ర్ భారీ క్రేన్ సాయంతో నిమ‌జ్జ‌నం కార్య‌క్ర‌మం పూర్తి చేశారు.. ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్రకు చిన్నాపెద్ద తేడా లేకుండా.. లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు. గణపతిబప్ప మోరియా.. ఖైరతాబాద్ గణేష్‌కు జై అంటూ డ్యాన్సులు వేస్తూ గణనాథుడ్ని సాగనంపారు. ఎటు చూసినా జనసంద్రమే.. ఇసుకేస్తే రాలనంత జనంతో ట్యాంక్ బండ్ పరిసరాలు కిటకిటలాడాయి. ఖైరతాబాద్ గణేశ్ ఎదుట భక్తులతో పాటు.. పోలీసులు కూడా డ్యాన్స్ వేసి అందరినీ ఆకట్టుకున్నారు.

అంత‌కు ముందు 63 అడుగుల ఎత్తులో శ్రీ దశమహా విద్యాగణపతిగా కొలువైన ఖైరతాబాద్ గణేశుడి శోభాయత్ర ఉదయం 7 గంటలకు ప్రారంభమై.. టెలిఫోన్‌ భవన్‌, సచివాలయం మీదుగా శోభాయాత్ర కొనసాగింది. . ఉదయం 9:30కు ఎన్టీఆర్‌ మార్గ్‌కు, ఉదయం 10:30కు క్రేన్‌ నెంబర్‌ 4 దగ్గర పూజా కార్యక్రమం నిర్వ‌హించారు.

ఇక జంట‌న‌గ‌రాల‌లో గణేష్‌ మహా శోభాయాత్ర నేపపథ్యంలో వినాయక నిమజ్జనాలకు జీహెచ్‌ఎంసీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈరోజు 50 వేలకు పైగా విగ్రహాల నిమజ్జనం జరగనుంది. ట్యాంక్‌బండ్‌తో పాటు పలు చెరువులు, రబ్బర్‌ డ్యామ్స్‌, బేబీ పాండ్స్‌లో నిమజ్జనాలు జరగనున్నాయి. హుస్సేన్‌సాగర్ చుట్టూ 5 చోట్ల 36 భారీ క్రేన్లను మోహరించారు. ప్రత్యేక లైటింగ్ వ్యవస్థ, భద్రతా బలగాలతో పకడ్బంధీగా చర్యలు తీసుకున్నారు. 20వేల సీసీకెమెరాలతో పటిష్ట నిఘా.. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో..25,694 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. సున్నిత ప్రాంతాల్లో ఆర్‌పీఎఫ్‌, పారామిలిటరీ భద్రత, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 6 వేల పోలీసులతో భద్రత నిర్వహిస్తున్నారు. నగరంలో 354 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరగనుంది. నిమజ్జన ప్రాంతాల దగ్గర డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లను కూడా మోహరించారు. ఖైరతాబాద్ గ‌ణేష్ నిమ‌జ్జ‌నం పూర్తికావ‌డంతో మిగిలిన ప్రాంతాల నుంచి గ‌ణేష్ విగ్ర‌హాల వాహ‌నాలు హ‌స్సేన్ సాగ‌ర్ ఘాట్ కు భారీ ర్యాలీల‌తో త‌ర‌లివస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement