Monday, April 29, 2024

రెండో రోజూ నిర్మానుష్య‌మే…

లాక్ డౌన్ సక్సెస్‌
ఉ. 6 గంటలకే తెరుచుకున్న దుకాణ సముదాయాలు
10 గంటలకు అన్నీ బంద్‌
రోడ్డెక్కిన మంత్రులు
జిల్లా కేంద్రాల్లో పర్యటనలు, సమీక్షలు
బస్సులు లేక జనం ఇబ్బందులు
షాపులకు కొనుగోలుదారుల ఉరుకులు
పాపం… అడ్డా కూలీలు శ్రీ పనులు దొరక్క ఇంటిముఖం

హైదరాబాద్‌, : కరోనా కట్టడి చర్యల్లో భాగంగా.. తెలంగాణ ప్రభుత్వం విధిం చిన లాక్‌డౌన్ సక్సెస్‌ అయింది. జనం ఇళ్ళకే పరిమితం కాగా, రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ముందు నుండి కరోనా విజృంభణ నేపథ్యంలో తీవ్ర భయాందోళనలో ఉన్న ప్రజలు ఉదయం 6గంటల నుండే ఉరుకులు పరుగులు పెట్టారు. దినచర్యను మార్చుకుని మినహాయింపుల సమయాన్ని సద్వినియోగం పరుచుకునే యత్నం చేశారు. దూరప్రాంతాలకు వెళ్ళాల్సిన వారు.. హైదరాబాద్‌లో బస్సులు లేక ఇబ్బందిపడ్డారు. పదిగంటలకు ముందే దుకాణాలు బంద్‌ చేయగా, ఆ తర్వాత కొద్దిసేటికి గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా, జిల్లా కేంద్రాలు, పట్టణాలు, మండల కేంద్రాలన్నీ నిర్మానుష్యం గా మారాయి. ఉదయం 6 నుండి 10గంటల వరకు అన్ని కార్యకలాపాలను నిర్వహించుకు నేందుకు ప్రభుత్వ అనుమతి ఉండగా, షాపింగ్‌ మాల్స్‌, వాణిజ్య దుకాణ సదుపాయాలు, కూర గాయల దుకాణాలు అన్నీ తెరుచుకున్నాయి. కొనుగోలుదారులు కూడా ఉరుకులు పరుగులు పెట్టి ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపుల గడువు లోనే.. తమ పనులను చక్కబెట్టుకునే ప్రయత్నం చేశారు. సూపర్‌ మార్కెట్లు, ఎలక్ట్రానిక్స్‌ వంటి వాణిజ్య సముదాయాలు కూడా ఉదయాన్నే తెరుచుకోవడం విశేషం. పలు దుకాణదారులు.. తమ సరుకులను సర్దుకునే సరికి సమయం అయిపోయిందని వాపోగా, కొనుగోలుదారులు మాత్రం చకచకా స్పందించారు. అడ్డా కూలీలు.. పదిగంటల వరకు వేచిచూసి పనులు దొరక్క వెనుదిరిగారు. మొత్తంగా పోలీసులకు శ్రమ లేకుండా.. ప్రజలే స్వచ్చందంగా లాక్‌డౌన్‌కు సహకరించారు. పదిగంటల తర్వాత దాదాపు తెలంగాణలోని రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి. ఎపుడూ జనసమ్మర్థంగా ఉండే పట్టణాలు, కూడళ్ళన్నీ బోసిపోయాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో డిజిపి మహేందర్‌ రెడ్డి ప్రత్యేక దృష్టిసారించి హైదరాబాద్‌కు జోన్ల వారీగా ప్రత్యేక ఐపిఎస్‌ అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించగా, రవాణా వాహనాలు.. ప్రభుత్వం అనుమతిచ్చిన సర్వీసులు నడిచాయి.
రంగంలోకి మంత్రులు
కేసీఆర్‌ ఆదేశాల మేరకు తమతమ జిల్లాల్లో మంత్రులు రంగంలోకి దిగారు. లాక్‌డౌన్‌ ప్రజల కోసమే, ప్రజల భద్రత కోసమే పెట్టామని ప్రజలను చైతన్యపరుస్తూ.. పదిరోజుల లాక్‌డౌన్‌కు సహకరించాలని పట్టణ ప్రజలను, వ్యాపారులను కోరారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, డబుల్‌ మాస్క్‌, గ్లౌజ్‌ ధరించాలని మంత్రులు సూచించారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాసగౌడ్‌ ఉదయాన్ని రోడ్ల మీదికి వెళ్ళి ప్రజలకు అవగాహన కల్పించగా, నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కూడా రోడ్లపై నడుస్తూ తిరిగి చైతన్యపరిచారు. ఆ తర్వాత జిల్లా కేంద్రాల్లో కరోనా కట్టడిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నల్లగొండలో మంత్రి జగదీష్‌రెడ్డి కరోనా కట్టడి, ధాన్యం సేకరణపై సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఇక వ్యవసాయశాఖా మంత్రి నిరంజన్‌రెడ్డి ధాన్యం సేకరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌, అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి కరోనా కట్టడిపై కీలక సూచనలు చేశారు. వరంగల్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కరోనా పరిస్థితులను, కట్టడిని సమీక్షించారు.
ఇక‌ మద్యంషాపులు రద్దీగా కనిపించాయి. లాక్‌డౌన్‌ ప్రకటించిన వెంటనే ఒక్కసారిగా మందుబాబులు మద్యందుకాణాలపై దండెత్తగా, రూ.225కోట్ల స్టాక్‌ అమ్ముడుపోయింది. రికార్డు మద్యం గంటల్లోనే విక్రయించబడగా, ఉదయం 6గంటలకు గిరాకీ ఉండదని భావించారు. కానీ హైదరాబాద్‌ నగరంతో పాటు పలు జిల్లా కేంద్రాల్లోనూ మద్యం దుకాణాలు తెరిచిన వెంటనే మందుబాబులు క్యూ కట్టారు. కూకట్‌ పల్లి లాంటి ప్రాంతాల్లో కట్టడి సమస్యగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement