Saturday, May 4, 2024

ఎంగిలి మెతుకులు, కుక్క బిస్కెట్లు, కాంట్రాక్టుల కోసం ఆశపడ్డాడు.. రాజ‌గోపాల్‌రెడ్డిపై రేవంత్ ఫైర్‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఎంగిలి మెతుకులు, కుక్క బిస్కెట్లు, ఇచ్చిన కాంట్రాక్టుల కోసం ఆశపడి రాజగోపాల్‌రెడ్డి నరేంద్రమోదీ పంచన చేరారని కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ప్రకటన అనంతరం మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఆయన న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. బీజేపీ తన అసలు స్వరూపాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తోందని అన్నారు. తెలంగాణ రక్తం కలిగిన ఏ బిడ్డైనా చచ్చే వరకు మోదీని క్షమించకూడదని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. లోక్‌సభ సాక్షిగా తెలంగాణను అవమానించిన మోదీని, తెలంగాణ సమాజం మొత్తం బహిష్కరించాల్సి ఉందని పిలుపునిచ్చారు. ఈడీ అంటే బీజేపీ ఎలక్షన్ డిపార్ట్‌మెంట్ అని రేవంత్ రెడ్డి భాష్యం చెప్పారు.

తెలంగాణ తల్లి అయిన సోనియాగాంధీని ఈడీ కేసులతో కక్ష సాధింపుకు పాల్పడుతున్న సమయంలో అలాంటి వారి తల తెగనరకాల్సింది పోయి అమిత్ షా దగ్గర కూర్చుని కాంట్రాక్టుల కోసం ఒప్పందాలు చేసుకున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మునుగోడు ప్రజలు సోనియా గాంధీ ప్రతినిధిగా రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే ఆయన కాంగ్రెస్‌తో పేగు బంధాన్ని తెంపేసుకున్నారన్న రేవంత్, మీవన్నీ ఆర్థిక సంబంధాలేనంటూ దుమ్మెత్తి పోశారు. సోనియాగాంధీని అవమానించే బీజేపీ పంచన చేరే వారిని ఎవ్వరూ క్షమించరని ఆయన నొక్కి చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలకు క్యాంపెయిన్ కమిటీని అధిష్టానం నియమించిందని, ఈనెల 5వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. 5వ తేదీ సమావేశంలో మునుగోడు ప్రజల గుండె చప్పుడు వింటాం… మోదీ-అమిత్ షా గుండె అదిరేలా రిజల్ట్ చూపిస్తామని హెచ్చరించారు. మునుగోడు ప్రజలు దేశంలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు.

ముఠాలతో వచ్చినా…. మూటలతో వచ్చినా చూసుకుందాం
కాంగ్రెస్ కోమటిరెడ్డి కుటుంబానికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పదవులు ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా పార్టీ పదవులు ఇచ్చిందని గుర్తు చేశారు. అవన్నీ మర్చిపోయి బ్రాండ్ బ్రాండ్ అని ఎగురుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ఆదరించకపోతే బ్రాందీ షాపుల్లో పని చేయడానికి కూడా పనికిరారని దుయ్యబట్టారు. నరేంద్ర మోదీ-కేసీఆర్ నాణేనికి బొమ్మా బొరుసు వంటి వారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ ముఠాలతో, మూటలతో, ఈడీలతో వచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని, పార్టీ శ్రేణులకు నాయకత్వం మొత్తం అండగా నిలబడుతుందని భరోసానిచ్చారు.

మాతోనే వెంకట్‌రెడ్డి
వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌తోనే ఉంటారని, పార్టీ కోసం పని చేస్తారని రేవంత్ తేల్చి చెప్పారు. పార్టీ సీనియర్లతో ఇటీవల జరిగిన సమావేశంలోనే కాంగ్రెస్‌లోనే ఉంటానని వెంకట్‌రెడ్డి స్పష్టంగా చెప్పారని ఆయన తెలిపారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లోనూ మునుగోడులో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేస్తారని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. 2023 నుంచి 2033 వరకు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, దానికి తనదే బాధ్యతని రేవంత్ అన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ పునర్నిర్మాణం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వాయువేగంతో వస్తాం-మెరుపు దాడులు చేస్తామని రేవంత్ అన్నారు.

ఈడీ వేటుతో మోదీకి సరెండర్
సిద్దాంతాలు సిగ్గూ వదిలేసి బీజేపీలో జాయినయ్యారని ఈటల రాజేందర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పార్టీలో ఏమాత్రం ప్రాధాన్యత లేని వ్యక్తి నేతల్ని తీసుకొచ్చి బిర్యానీ వండిపెతారా అని ప్రశ్నించారు. లెఫ్ట్, నక్సలైట్ ఉద్యమాల నుంచి వచ్చిన వాణ్నని చెప్పుకున్న వ్యక్తి ఈడీ వేటు పడగానే నరేంద్ర మోదీకి సరెండరయ్యారని ఎద్దేవా చేశారు. సిగ్గు తప్పిన వాళ్లు తెలంగాణ పరువు తీస్తున్నారన్నారు.

- Advertisement -

మానవత్వంతో బుజ్జగించాం
ఆత్మహత్య చేసుకునే వాణ్ని చావకురా అంటూ బుజ్జగిస్తామని, రాజగోపాల్‌రెడ్డి విషయంలోనూ అదే జరిగిందన్నారు. మానవత్వంతో ఆయనను ఆపడానికి పార్టీ అన్ని ప్రయత్నాలు చేసిందన్నారు. మానవత్వం లేని మనుషులు అన్ని బంధాలూ ఆర్థిక సంబంధాలు అనుకుని అమ్ముడు పోయారన్నారని విమర్శించారు. నీకొచ్చిన కాంంట్రాక్టుల్లో మునుగోడు ప్రజలకు వాటా ఇస్తావా అని ఆయన రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు.

బిడ్డలా చూసుకున్నాం
కాంగ్రెస్ ఉప ఎన్నికలకు తెరలేపిందన్న రేవంత్, ఎవ్వరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతామని హెచ్చరించారు. తెలంగాణలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించిందని చెప్పుకొచ్చారు. రాజగోపాల్ రెడ్డి ఎన్ని తప్పులు చేసినా బిడ్డలా కడుపులో పెట్టుకుని చూసుకున్నామన్నారు. తనకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడని, తన అధ్యక్ష నియామకంలో కూడా సహాయపడ్డాడని గుర్తు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement