Tuesday, April 23, 2024

రాజీనామాను మించిన ద్రోహం.. రాజ‌గోపాల్ నిర్ణ‌యం బాధాక‌రం : భట్టి విక్రమార్క

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్న సమయంలో, రాహుల్, సోనియాలకు అండగా ఉండాల్సిన రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం రాత్రి తొమ్మిదిన్నరకు ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చాలా బాధాకరన్నారు. ఆయన ఈ స్థాయికి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు కల్పించిందని చెప్పుకొచ్చారు. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు పెరిగిన సమయంలో, దేశ సంపదను ఒకరిద్దరు వ్యక్తులకు అప్పనంగా దోచిపెడుతున్న తరుణంలో, ప్రతి కాంగ్రెస్ నేత, కార్యకర్త గట్టిగా నిలబడి పోరాడాల్సినప్పుడు రాజగోపాల్ రాజీనామా చేయడం తీవ్రంగా ఖండించాల్సిన అంశమని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు.

దేశ స్వాతంత్ర పోరాటంలో స్థాపించిన పత్రిక ‘నేషనల్ హెరాల్డ్’ను కాపాడుకునే క్రమంలో ఆ సంస్థకు అప్పు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద ఈడీని ప్రయోగించిన సమయంలో ఇలా చేయడం తగదని హితవు పలికారు. మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కంచుకోటని భట్టి ధీమా వ్యక్తం చేశారు. ఈ క్షణం నుంచి అక్కడి పార్టీ నేతలు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈనెల 5న అక్కడ పార్టీ ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కార్యాలయాలపై ఈడీ సోదాలు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడాన్ని మించిన ద్రోహం లేదని నొక్కి చెప్పారు. ఏ స్థాయి పోరాటం అయినా ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడేలా చేయడం కోసం తామంతా కష్టపడతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement