Friday, May 3, 2024

Big Story | నిలిచిన నోటరీ ఆస్తుల క్రమబద్ధీకరణ.. గ్రామాల్లో మళ్లీ మొదటికొచ్చిన సమస్య!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నోటరీ ఆస్తుల క్రమబద్దీకరణ మళ్లీ మొదటికొచ్చింది. జూలై 26న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 84 అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఈ అంశం మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. ఏళ్లుగా నిరుపేదలు నోటరీ పేరుతో ఆస్తులను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ప్రభుత్వం చరమగీతం పాడాలన్న లక్ష్యానికి తీవ్ర విఘాతంగా హైకోర్టు నిర్ణయం పరిణమించనున్నది. గతంలో నోటరీ ఆస్తులపై మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక మేరకు కీలక నిర్ణయానికి చేరువైన ప్రభుత్వానికి ఇది కొంత ప్రతికూలంగా మారింది. ప్రభుత్వ భూముల్లో ఇండ్లను కట్టుకున్న నిరుపేదలకు భూముల క్రమబద్ధీకరణ చేస్తున్న తరహాలోనే ఈ నోటరీ ఆస్తుల తీరును రాష్ట్రమంతటా విస్తరించాలని ప్రభుత్వం భావించింది.

ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించుకున్నవారికి, నోటరీ చేయించుకున్న ఇండ్లకు, స్థలాలకు క్రమబద్దీకరణ, హక్కుల కల్పన దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది. ఇందులో భాగంగా 125 చదరపు గజాల వరకు జీవో 58 తరహాలోనే ఉచిత రిజిస్ట్రేషన్లు చేసి క్రమబద్దీకరించాలని నిర్ణయించగా, అంతకు మించితే జీవో 59 తరహాలో రుసుములను నిర్ణయించి జీవో 84ను జారీ చేసింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల వారీగా భూముల లెక్కలు, ఆక్రమణలు, ఇండ్లను నిర్మించుకున్న వివరాలు, నోటరీ ఆస్తులపై సర్వం సేకరించారు.

గ్రామాలలో ఆబాదీ, గ్రామకంఠం కింద ఏర్పాటు చేసిన రికార్డులను ప్రత్యేకంగా అసెస్‌ చేసి నివేదికలో పొందుపరిచారు. వీటిని మార్కెట్‌ విలువల ఆధారంగా రేట్లు ఫిక్స్‌ చేసి క్రమబద్దీకరించడంతో భారీగా రిజిస్ట్రేషన్‌ ఆదాయాలు వస్తాయని, తద్వారా ప్రజలకు ఇతర వెసులుబాట్లతో ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని యోచించిన సర్కార్‌ ఆ దిశగా కార్యాచరణ పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామకంఠం, ఆబాదీ భూములు 25062 సర్వేనెంబర్లలో 25,062ఎకరాలున్నాయి. ప్రభుత్వ భూముల్లో సేకరించిన భూముల్లో 26వేల ఎకరాలు, సాదాబైనామాల కింద 5లక్షల ఎకరాలు, ప్రభుత్వ భూములు 21లక్షల ఎకరాలున్నాయి.

గ్రామాల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూముల వివరాలు, ప్రభుత్వ సంస్థలు, భవనాలు, కార్యాలయాల వివరాలు, ఆక్రమణలు, మండలాల వారీగా ప్రభుత్వ భూములు, ఆక్రమణల్లో నిర్మించుకున్న ఇండ్లు, వారి ఆర్ధిక, సామాజిక హోదా వంటి వివరాలు ప్రభుత్వానికి చేరాయి. 12 అంశాలతో నివేదికలను కలెక్టర్లు అందజేశారు.

- Advertisement -

భారీ రాబడిపై అంచనాలు…

భారీ రాబడికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ఒకేసారి రూ. 20వేల కోట్లకుపైగా ఆదాయార్జననే కాకుండా ఒక్క దెబ్బతో నిరుపేదల దీర్గకాల సమస్యలు తీరుతాయనే ఆకాంక్షకు అడ్డంకులు తలెత్తాయి. కొత్తగా అనుమతిలేని లే అవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతించడంతోపాటు, ఇప్పటికే పురోగతిలో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ అంశంలో వేగం పెంచి రాబడిని ఖజానాకు చేర్చాలని చూస్తోంది. అసైన్డ్‌ భూముల క్రమబద్దీకరణ, నిరుపేదల ఇండ్లకు యాజమాన్య హక్కుల కల్పన, ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణతో మరింత వెసులుబాటు కల్పించే దిశగా కృషి చేస్తోంది. వీటన్నింటితో భారీగా ఆదాయంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వ యోచనగా ఉంది. ఇప్పటికే తాజాగా నోటరీ యాజమానులకు హక్కుల కల్పనకు మార్గదర్శకాలు జారీకాగా, త్వరలో గ్రామకంఠాల సమస్యలను తీర్చేలా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జీవో 58, జీవో 59ల పరిధిలోని భూముల క్రమబద్దీకరణ జోరుగా జరుగుతోండగా, అతి త్వరలో అసైన్డ్‌ భూముల క్రమబద్దీకరణపై కీలక నిర్ణయం వెలువడనుంది. ఇప్పటికే అసైన్డ్‌ చట్ట సవరణ దిశగా యోచించినా పలు ఇబ్బందుల నేపథ్యంలో ఆచరణ యోగ్యం కాలేదు.

ఇంకోవైపు వేలం…

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయార్జనలో భాగంగా పన్నేతర రాబడులపై సర్కార్‌ దృష్టిపెట్టింది. హైదరాబాద్‌తోపాటు, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల విక్రయాలకు చర్యలు వేగవంతం చేస్తున్నది. హెచ్‌ఎండీఏ పరిధిలోని మూడు జిల్లాల పరిధిలోని స్థలాల విక్రయంతో రూ. 6500 కోట్లు ఆర్జించే లక్ష్యంతో ఈ వేలం నిర్వహిస్తుండగా, మరోవైపు భూముల గతంలో నిల్చిపోయిన లే అవుట్ల క్రమబద్దీకరణ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హెచ్‌ఎండీఏ పరిధిలో 633 వెంచర్లను గుర్తించారు. వీటితో మరో రూ. 1500కోట్లు రానుందని అంచనా వేస్తున్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌తో కూడా రాబడే…

లే అవుట్లలో ఇప్పటివరకు విక్రయించకుండా మిగిలిపోయిన ప్లాట్లకు మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్‌లో ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేసుకొని ఉంటే అలాంటివారికి తాజా ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తించకుండా చర్యలు తీసుకుంటున్నారు. వీటికి భవన నిర్మాణ సమయంలో ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలతోపాటు 33శాతం కాంపౌండ్‌ ఫీజులను చెల్లించాల్సిందిగా ప్రభుత్వం నిర్ణయించింది. లే అవుట్ల క్రమబద్దీకరణతో పోల్చితో ఇవి మరింత ప్రియం కానున్నాయి. ఇప్పటివరకు గుర్తించిన లే అవుట్లలో 1.31 లక్షల ప్లాట్లలో ఇంకా 40వేల ప్లాట్లు విక్రయించకుండా మిగిలిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement