Thursday, May 2, 2024

ఆర్మూర్ డివిజన్ లో రికార్డు స్థాయిలో వర్షం.. తెగిన రహదారులు, చెరువులు

ఆర్మూర్, ప్రభ న్యూస్ : జులై 25 : నిజామాబాద్ జిల్లాలో జోరుగా వానలు కురుస్తున్నాయి. ఆర్మూర్, వేల్పూర్, భీంగల్, జక్రాన్ పల్లి మండలాల్లో రికార్డు స్థాయి వర్షాలు కురిసాయి. దీంతో చెరువులు, కుంటలు నిండుకుంటున్నాయి. వేల్పూర్ లో అత్యధికంగా 46 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే పెర్కిట్ లో 33, భీంగల్ లో 26, జక్రాన్ పల్లిలో 23 సెంటి మీటర్ల వర్షపాతం నమోదయింది. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు రాళ్ల వాగు, పెద్దవాగు, కప్పల వాగులు వరద నీటితో పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాల్లో చెరువులు ఆలుగు పారుతున్నాయి. వేల్పూర్ మండలం పడగల్ నవాబు చెరువు కట్ట తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారి తెగిపోయి వందల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి.

మరో పక్క పచ్చల నడుకుడ బుడిగెడు చెరువుకట్ట తెగిపోవడంతో ఆర్మూర్, భీంగల్ మధ్య రాకపోకలు నిలిచాయి. జిల్లా కలెక్టర్ హనుమంతు స్థానిక అధికారులతో కలిసి పర్యటించారు. జిల్లాలో అత్యధికంగా కుండపోత వానకు వేల్పూర్ మసుకుంట చెరువు తెగిపోవడంతో ఆర్మూర్, భీంగల్ ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. చెరువు అలుగు పారుతుండటంతో వేల్పూర్ పోలీస్ స్టేషన్ ఎదుటనున్న డివైడర్ తెగిపోయింది. అలాగే వేల్పూర్ రామన్నపేట గ్రామాల మధ్య వరద ప్రవాహానికి ప్రధాన రహదారి తెగిపోయి నీరు ప్రవహిస్తుంది. ఆర్మూర్ మండలం గోవింద్ పెట్ సాహెబ్ పేట్ గ్రామాల మధ్య రోడ్డు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భీంగల్ పట్టణంలో అయ్యప్ప నగర్ లో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో బయటకు రావాలంటే జనాలు జంకుతున్నారు.

ఆర్మూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ కు వెళ్లే ప్రధాన రహదారి వరద ప్రవాహానికి తెగిపోవడంతో స్టేషన్ కు రాకపోకలు నిలిచిపోయాయి.. ఆర్మూర్ నుండి నందిపేట వెళ్లే ప్రధాన రహదారిలో సుభాష్ నగర్ సమీపంలో నిర్మిస్తున్న కల్వర్టు వద్ద వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్మూర్ మండలంలో మాలకుంట చెరువు కట్ట వర్షపు తాకిడికి తెగుతుండడంతో స్థానిక తహసిల్దార్ వేణు పరిశీలించారు. ఇప్పటికే ఆర్మూర్ డివిజన్ లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లు చాలా వరకు కూలిపోయాయి. మామిడిపల్లి శివారులో రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న కాలనీలో ఇండ్ల మధ్యలోనికి వరద నీరు రావడంతో చెరువులను తలపిస్తున్నాయి.

- Advertisement -

చేపూరు సాయిబాబా గుడి వద్ద వరద నీటి తాకిడికి ప్రధాన రహదారి తెగుతుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పారుతున్న అలుగు నుండి వస్తున్న చేపలను పట్టుకునేందుకు కొన్నిచోట్ల ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. వేల్పూర్ వరదనీటితో 20కిలోల పెద్ద చేప దొరికింది. జక్రాన్ పల్లి మండలం తొర్లికొండ-మనోహర్ బాద్ గ్రామాల మధ్య ప్రధాన రహదారి తెగిపోయి రాకపోకలు నిలిచాయి. ఏది ఏమైనా ఈ సీజన్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదు కావడంతో ఓ పక్క జనజీవనం స్తంభించింది. మరోపక్క వాహనాల రాకపోకలు నిలిచాయి. అప్రమత్తమైన అధికారులు ఎక్కడికక్కడ చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement