Thursday, May 2, 2024

Josh In Congress – 30న కొల్లాపూర్ కు ప్రియాంక రాక‌… పవ‌ర్ ఫుల్ ఫైట్ కు కాంగ్రెస్ రెడీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : కర్ణాటక ఎన్నికల ఫలితాలతో మంచి ఊపుమీదున్న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలోనూ పాగా వేసేందుకు వ్యూహ రచన చేస్తోంది. అందులో భాగంగా ముఖ్యమైన అయిదు హామీలను ప్రజలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే వరంగల్‌ వేదికగా పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్‌ ప్రకటించగా ఆ తర్వాత హైదరాబాద్‌ వచ్చిన ప్రియాంకగాంధీ సరూర్‌ నగర్‌ స్టేడియంలో జరిగిన బహిరంగసభలో యూత్‌ డిక్లరేషన్‌ను విడుదల చేశారు. సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన ప్రజా గర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్‌ గాంధీ చేయూత కార్యక్రమాన్ని ప్రకటించారు. తాజాగా కొల్లాపూర్‌ వస్తున్న ప్రియాంక మహిళా డిక్లరేషన్‌ను విడుదల చేయనున్నారు

కర్ణాటక తరహాలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ అంశాన్నిమహిళా డిక్లరేషన్‌లో చేర్చనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లిd ఎన్నికల్లో మహిళల జనాభా ప్రకారం పోటీ చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తామన్న భరోసా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విద్యా సంస్థల్లో ఇప్పటికే అమలు చేస్తున్న 33శాతం మహిళా రిజర్వేషన్లకు తోడుగా ప్రతిభ కనబర్చే బాలికలకు, మహిళలకు వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రాధాన్యత కల్పిస్తామన్న హామీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మహిళల్లో అక్షరాస్యతా శాతాన్ని పెంచేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని, అందుకు సంబంధిం చిన విధివిధానాలను అధికారంలోకి వచ్చిన వెనువెంటనే అమలు చేస్తామని వివరించనుంది. విద్యా, ఉద్యోగరంగాల్లో మహిళలకు వారి జనాభా ప్రకారం అవకాశం కల్పిస్తామన్న హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

కాగా రాష్ట్రానికి వస్తున్న ప్రియాంకగాంధీ అసెంబ్లి ఎన్నికల్లో ఏవిధంగా ముందుకు వెళ్లాలన్న అంశంపై పార్టీ నేతలతో విడివిడిగా, సంయుక్తంగా సమా వేశం కావాలని నిర్ణ యించారు. ఢిల్లిd నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడ కు వస్తున్న ప్రియాంక మూడు గంటల పాటు పార్టీ నేతలతో గడపనున్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన డిక్లరేషన్లను ప్రజలచెంతకు తీసుకెళ్లి వాటి వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరించాలని ఆమె దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్రంలో భాజపా సర్కారు, రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్న విషయాన్ని ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరనున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా అసెంబ్లిd ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరించాలని, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని కొనసాగించడంతోపాటు మరిన్ని కొత్త, పేరెన్నికగన్న పథకాలను, కార్యక్రమాలను అమలు చేస్తామన్న హామీని ఇవ్వాలని ఆమె చెప్పే అవకాశం కనిపిస్తోంది. మరో మూడు నాలుగు మాసాల్లో ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో పార్టీ నేతలంతా తమ నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రజలతో మమేకం కావాలని ఆమె కోరనున్నట్లు సమాచారం. కాగా రాష్ట్రానికి వస్తున్న ప్రియాంకను ఎన్నికల ప్రచారానికి రావాలని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితోపాటు మిగతా నేతలు ఆహ్వానించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement