Tuesday, April 30, 2024

పెద్దల జోలికి పోకుండా పేదలపై ప్రతాపమా? జడ్పీ భేటీలో పంచాయతీ అధికారులపై కన్నెర్ర

ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి : పెద్దపెద్ద భవనాలు కట్టుకుంటున్న వారి జోలికి వెళ్లడం లేదు.. పేదలు పాత ఇళ్లు కూల్చివేసి కొత్త ఇళ్లు కట్టుకుంటుంటే నానా ఇబ్బందులు పెడుతున్నారు. రూల్‌ అందరికీ ఒకేలా ఉండాలి.. పేదలకు ఒకరకంగా.. పెద్దలకు మరోరకంగా ఉండటం ఏమిటి.. విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడం లేదు.. పంచాయతీలకు దక్కాల్సిన పదిశాతం భూమిని వెంచర్ల యజమానులు కేటాయించకపోయినా అటువైపు కన్నెత్తి చూడటం లేదు.. పెద్దల వద్దకు జేసీబీలతో వెళ్లి కలెక్షన్‌ చేసుకుని వస్తున్నారని ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శులను మొదలుకుని అందరూ అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పంచాయతీ అధికారుల పనితీరుపై ఎమ్మెల్యేలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలను లక్ష్యంగా చేయటాన్ని కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ కూడా తప్పుపట్టారు.. అక్రమ నిర్మాణాలను మొదట్లోనే ఆపేస్తే ఎలాంటి ఇబ్బంది లేదని 70 శాతం నిర్మాణాలు పూర్తి చేసుకున్నాక కూల్చి వేయడం ఏమిటని పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డిని ప్రశ్నించారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలని పెద్దలకు ఒకరకంగా పేదలకు మరో రకంగా ఉండకూడదని సూచించారు. బుధవారం జడ్పీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ తీగల అనితారెడ్డి అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌.. ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్‌, కాలె యాదయ్య, అంజయ్యయాదవ్‌, జైపాల్‌యాదవ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్ గణేష్‌, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ పాండురంగారెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు హాజరయ్యారు.

పంచాయతీ అధికారుల పనితీరుపై జడ్పీ సర్వసభ్య సమావేశంలో రెండు గంటలపాటు చర్చ కొనసాగింది. పంచాయతీ కార్యదర్శులను మొదలుకుని అధికారుల వరకు అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. గ్రామ కంఠంలో ఇళ్లు నిర్మించుకుంటే కూడా కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. గతంతో పోలిస్తే ఈసారి జడ్పీ సమావేశం భిన్నంగా జరిగింది. ముందుగా పంచాయతీరాజ్‌ శాఖను సమీక్షించారు. జడ్పీటీసీలు, ఎంపీపీలతోపాటు ఎమ్మెల్యేలు కూడా పంచాయతీరాజ్‌ శాఖ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా పెంచర్లు కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదని సభ్యులు ఆరోపించారు. పేదలు తమ సొంత భూమిలో ఇళ్లు కట్టుకున్నా ఇబ్బందులపాలు చేస్తున్నారని మండిపడ్డారు. పేదలనే ఇబ్బందులపాలు చేస్తున్నారు పెద్దల జోలికి వెళ్లడం లేదు.. పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలెయాదయ్య ఆరోపించారు. పంచాయతీ అధికారుల పనితీరుపై ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్‌, ప్రకాష్‌గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదిశాతం పంచాయతీలకు భూములకు వదలడం లేదు..
ఎఫ్‌టీఎల్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి.. సీలింగ్‌ భూములను కూడా వదిలిపెట్టడం లేదని పంచాయతీ అధికారులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కలెక్షన్లకు ఎగబడ్డారు : జడ్పీటీసీ జంగారెడ్డి
సీలింగ్‌ భూముల్లో పెద్దఎత్తున విల్లాలు నిర్మిస్తున్నా పట్టించుకోవడం లేదని కలెక్షన్లకు ఎగబడి పేద్దలకు న్యాయం
చేస్తున్నారని కందుకూరు జడ్పీటీసీ జంగారెడ్డి ఆరోపించారు. కూల్చివేసేందుకు జేసీబీలతో వెళ్లి కలెక్షన్లు చేసుకుని వస్తున్నారని మండిపడ్డారు. పులిమామిడిలో సీలింగ్‌ ల్యాండ్‌లో వెంచర్‌ వేసి అమ్మకాలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారితో సెటిల్‌మెంట్లు
చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఆమన్‌గల్‌ ప్రాంతంలో బట్టర్‌ప్లై సంస్థ పంచాయతీలకు పదిశాతం
వాటాను రిజిస్ట్రేషన్‌ చేయడం లేదు. అయినా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని కడ్తాల్‌
కమిలీ మోతియానాయక్‌ ఎంపీపీ ఆరోపించారు.

పేదలను ఇబ్బందులకు గురి చేయొద్దు : కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌
ఇళ్లుకట్టుకునే విషయంలో పేదలను ఇబ్బందుల పాలు చేయవద్దని కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. ఇళ్లు కూల్చితే నోటీసు ఇచ్చి కూల్చివేయాల్సి ఉంటుందన్నారు. తాతల కాలం నాటి ఇళ్లు కూల్చి వేసి కొత్తది కట్టుకుంటే మీకేమి ఇబ్బందని ప్రశ్నించారు. అతి ఉత్సాహం వద్దని హితవు పలికారు. ప్రతి ఊళ్లో ఇవే సమస్యలున్నాయని పేర్కొన్నారు. పేదలను ఇబ్బందులపాలు చేస్తున్నారని పెద్దల జోలికి వెళ్లడం లేదన్నారు. మొయినాబాద్‌లో 111 అమలులో ఉంది ఇక్కడ పెద్దలను వదిలిపెడుతున్నారు.. పేదలను మాత్రం ఇబ్బందులపాలు
చేస్తున్నారని కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలను మొదట్లోనే నిలుపుదల చేయాలని 70 శాతం మేర నిర్మాణాలు జరిగిన తరువాత కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు. మొదట్లోనే చర్యలు తీసుకుంటే ఇబ్బందులు ఉండవు కదా అని పేర్కొన్నారు. పేదల ఇళ్లు కూల్చితే వారిని నాశనం చేసినట్లేనని అమోయ్‌కుమార్‌ తెలిపారు. పేదలకు సర్వీస్‌ చేయాలి తప్పిస్తే ఇబ్బందులపాలు చేయవద్దని హితవు పలికారు. పెద్దల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని పంచాయతీ అధికారులపై కలెక్టర్‌ మండిపడ్డారు.

అధికారులు.. ప్రజాప్రతినిధులకు కలెక్టర్‌ చురకలు..
కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ అధికారులు.. ప్రజాప్రతినిధుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు వర్గాలకు పలుమార్లు చురకలు అంటించారు. కొత్తూరు మండల పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రహారిగోడలు లేకపోవడంతో సాయంత్రం పూట అసాంఘీక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎవరూ పట్టించుకోవడం లేదని కొత్తూరు జడ్పీటీసీ విశాల ఆరోపించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అసాంఘీక కార్యక్రమాలు జరిగితే స్థానిక ప్రజాప్రతినిధులు ఏమి చేస్తున్నారని చర్యలు తీసుకోవచ్చుకదా అని కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ సూచించారు. చేవెళ్లలో మండల పరిషత్‌ భవన నిర్మాణం ఎనమిదేళ్లుగా కొనసాగుతోందని సమావేశాలు ఎక్కడ పెట్టుకోవాలని చేవెళ్ల జడ్పీటీసీ మాలతి ప్రశ్నించారు. నిధులు లేకపోవడంతో నిర్మాణాలు ఆగిపోయాయని రానున్న ఆరుమాసాల్లో నిర్మాణాలను పూర్తి చేస్తామని పంచాయతీరాజ్‌ ఈఈ పేర్కొన్నారు. సమావేశాలు ఎక్కడ పెట్టుకోవాలనేది మీరు డిసైడ్‌ చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. పంచాయతీ అధికారుల పనితీరుపై కలెక్టర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక పంచాయతీ కార్యదర్శి పరిధిలో 250 ఇళ్ల వరకే ఉంటాయని వాటిని కూడా సక్రమంగా చూసుకోరా అని ప్రశ్నించారు. బేస్‌మెంట్‌ స్థాయిలోనే నిర్మాణాలు నిలుపుదల చేస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని 70 శాతం నిర్మాణాలు పూర్తి చేసుకున్నాక కూల్చివేస్తే వాళ్లు ఆర్థికంగా నష్టపోతారు కదా అని కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

- Advertisement -

ధాన్యం కొనుగోలు చేయాలని తీర్మానం..
యాసంగిలో రైతులు పండించిన ధాన్యం మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జడ్పీ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. సమావేశం ప్రారంభంలోనే తీర్మానంపై చర్చ కొనసాగింది. జడ్పీ వైస్‌ చైర్మన్‌ గణష్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ్యులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. మెజార్టీ
సభ్యులు కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేయగా జడ్పీటీసీలు దాస్‌, ఉప్పల్‌ వెంకటేష్‌లు మాత్రం కేంద్రం కొనుగోలు చేయని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల సౌకర్యాలు కల్పించడంతో వ్యవసాయం పెరిగిందని జడ్పీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ తీగల అనితారెడ్డి పేర్కొన్నారు. రైతులు సాగుచేసిన ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని తేల్చి చెప్పారు. మెజార్టీ సభ్యులు యాసంగి ధాన్యం కేంద్రం కొనుగోలు చేయాలని సూచన చేశారు.

సుదీర్ఘంగా కొనసాగిన సమావేశం..
భోజన విరామం తరువాత వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. భోజనం కంటే ముందు యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయాలని చర్చ జరిగిన తరువాత ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తరువాత పంచాయతీరాజ్‌ శాఖపై చర్చించారు. తరువాత భోజన విరామం ఇచ్చారు. అనంతరం సాయంత్రం వరకు చర్చ కొనసాగింది. విద్యా, వైద్యం, వ్యవసాయం. పరిశ్రమలు, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్‌, నీటిసరఫరా విభాగం, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలతోపాటు ఇతర శాఖల పనితీరును సమీక్షించారు. సర్వసభ్య సమావేశం చీకటి పడేంతవరకు కొనసాగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement